జగన్‌తోనే వైఎస్ సువర్ణయుగం
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో వైఎస్ తెగువ జగన్‌లో ఉంది: విజయమ్మ
విశాఖపట్నం/ శృంగవరపుకోట (విజయనగరం): ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మనసున్న మనిషి. ముఖ్యమంత్రిగా ప్రతి సంక్షేమ పథకాన్ని కుల, మతాలకు అతీతంగా అమలుచేశారు. ఆయన పాలనలో ప్రతి ఇంటికీ నలుగురైదుగురు లబ్ధిదారులు సంక్షేమ ఫలాలు పొందారు. ఆయన పాలనంతా సువర్ణయుగం. ఒక్క పన్ను కూడా రాష్ట్ర ప్రజలపై మోపని మహానీయుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆయన తర్వాత అంతటి తెగువ జగన్ మోహన్‌రెడ్డిలో ఉంది. చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. ఎన్ని కష్టాలొచ్చినా నిరంతరం ప్రజల గురించే ఆలోచించాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జగన్‌బాబు విలవిల్లాడిపోతాడు. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఎండనకా, వాననక నిరంతరం ప్రజలమధ్యే తిరిగాడు.
వివిధ ప్రజల సమస్యలపై స్పందించి జలదీక్ష, రైతుదీక్ష , ఫీజుపోరు వంటివెన్నో చేశాడు. వైఎస్ సువర్ణ యుగం జగన్‌తోనే సాధ్యం.. అందుకే ప్రజల కోసం పనిచేసే జగన్‌ను సీఎంను చేద్దాం’’ అని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం లోక్‌సభకు గురువారం నామినేషన్ వేసిన విజయమ్మ శుక్రవారం పార్లమెంట్ పరిధిలోని భీమిలి నియోజకవర్గంలోగల పద్మనాభం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. విజయనగరం జిల్లా జామి, శృంగవరపుకోట, వేపాడ, ఎల్.కోట మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. విజయమ్మవెంట వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ, ఎస్.కోట వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్.జగన్నాథం, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు.