వైఎస్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
అయిదు సంతకాలతో జగన్ రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాడు: విజయమ్మ
విశాఖపట్నం: ‘‘ఎన్నికలు దగ్గరపడ్డాయి. సుపరిపాలన అందించే నాయకుడినే ఎంచుకోవాలి. అలా అయితేనే సంక్షేమ ఫలితాలు గడపగడపకు అందుతాయి. జగన్‌బాబు తన తండ్రి రాజశేఖరరెడ్డిలాగే దీక్ష, పట్టుదల, తెగువ ఉన్న నాయకుడు. జగన్ సీఎం అయితే అయిదు సంతకాలతో రాష్ట్ర చరిత్రను తిరగరాస్తాడు. వైఎస్ సంక్షేమ పథకాలన్నీ తిరిగి గాడినపెట్టి రాష్ట్రంలో సమస్యలు పరిష్కరిస్తాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టే ఆనాడు జగన్‌ను జైలుపాలు చేశారు. ఎన్ని కష్టాలుపడ్డా నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తాడు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్‌కు పట్టం కట్టి తిరిగి రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. వైఎస్ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆ పార్టీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ శనివారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం, యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, చోడవరం నియోజకవర్గం వడ్డాది, మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు.
దేవరాపల్లి సభపై పోలీసుల ఓవర్ యాక్షన్
విజయమ్మ దేవరాపల్లి సభలో ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. గ్రామీణ ప్రాం తంలో 8గంటల వరకే ఎన్నికల యాత్రకు అనుమతి ఉందం టూ... పర్యటన ముగించాలని హెచ్చరికలు చేశారు. ఇంకా సమయం ఉన్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిం చడంపై విజయమ్మ మండిపడ్డారు. ప్రసంగించడానికి అనుమతించకపోతే స్టేషన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు విజయమ్మ ఒక్కరే ప్రసంగించాలని షరతు విధించారు. దీంతో వేలాదిగా హాజరైన ప్రజలనుద్దేశించి విజయమ్మ ఉత్సాహభరితంగా ప్రసంగించారు.