ధర్మయుద్ధంలో వైఎస్సార్ కాంగ్రెస్‌దే విజయం
కొవ్వూరు సభలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణచౌదరి
కొవ్వూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ఈ ధర్మయుద్ధంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణచౌదరి అన్నారు. కొవ్వూరు విజయవిహార్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఆయన కోరారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ విజయమ్మను కంటతడి పెట్టించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు గుణపాఠం చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. వైఎస్ విజ యమ్మ పార్లమెంట్ సభ్యురాలిగా గెలుపొంది దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నట్టు తెలిపారు.
సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 30మంది ఎంపీలను విజయమ్మకు తోడుగా పంపించి రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొవ్వూ రు ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి సమర్థవంతంగా అమలు కావాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. జగనన్నపై ప్రేమతో, వైఎస్సార్‌పై అభిమానంతో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు శ్రమించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకునే స్వభావం షర్మిలమ్మకు ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందన్నారు. పేదల ప్రభుత్వం రాబోతుందన్నారు.
సభలో చిరుజల్లులు
బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతుండగా ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. చిరుజల్లులు కురిశాయి. ప్రజలు కేరింతలు కొడుతూ రాజన్నరాజ్యం రాబోతుందనడానికి ఈ జల్లులు సంకేతమన్నారు. జోరు గాలి వీయడంతో ఫ్యాన్ గాలి జోరందుకుందని వ్యాఖ్యానించారు.