చంద్రబాబుకివే చివరి ఎన్నికలు | YS Jagan mohan Reddy takes on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

Published Tue, Apr 22 2014 1:10 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM

చంద్రబాబుకివే  చివరి ఎన్నికలు - Sakshi

చంద్రబాబుకివే చివరి ఎన్నికలు

ఎన్నికలయ్యాక టీడీపీ కనుమరుగు కాకతప్పదు  ప్రకాశం జిల్లా వైఎస్సార్ జనభేరి సభల్లో జగన్
 
అందుకే బాబు అడ్డగోలు హామీలిస్తున్నారు
ఆయనలా తప్పుడు హామీలివ్వను, ఇవ్వలేను
ఇచ్చిన హామీని నిలుపుకొనేందుకు ఎందాకైనా వెళతా
దివంగత నేత పథకాలను మరింత మెరుగుపరుస్తా
ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మారుస్తా
సమర్థ పాలన అందిస్తా...రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ తెస్తా


కందుకూరు/సింగరాయకొండ (ప్రకాశం జిల్లా): ‘‘65 ఏళ్ల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల అనంతరం తన పార్టీ టీడీపీ కనుమరుగుకాక తప్పదని ఆయనకు తెలుసు. అందుకే ఎన్ని అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. వ్యవసాయ రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగమంటూ ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో బాబు మీ ముందుకొచ్చినప్పుడు... తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఏం చేశారని నిలదీయండి. కరెం టు చార్జీలు తగ్గించమన్న రైతులపై బషీర్‌బాగ్‌లో తుపాకి గుళ్లు కురిపించిందెవరని ప్రశ్నించండి. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిందెవరని అడగండి. 65 ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి 26 వేలమందిని రోడ్లపాలు చేసిందెవరని నిలదీయండి’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ కేంద్రంలో, కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో మాట్లాడారు. ‘‘నాలుగున్నరేళ్లుగా నేను ఎంత కష్టపడుతున్నానో మీ అందరికీ తెలుసు. భార్యాబిడ్డలను వదిలి... ఎండనక వాననక.. పగలనక రేయనక మీ మధ్యనే ఉన్నా.. మీ కోసమే పనిచేశా. చంద్రబాబు కన్నా నేను 25 సంవత్సరాలు చిన్నవాణ్ణి. మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండేవాణ్ణి. దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వంగా ‘విశ్వసనీయత’ను పుణికిపుచ్చుకున్నవాణ్ణి. చంద్రబాబులా తప్పుడు హామీలివ్వను. ఇచ్చిన హామీలను నిలుపుకొనేందుకు ఎందాకైనా వెళతా. నేను యువతరం ప్రతినిధిని. సమర్థమైన పాలన అందిస్తా. రాజశేఖరుని సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తా. మన తలరాతలు మార్చే సార్వత్రిక ఎన్నికలు మరో 16 రోజుల్లో రానున్నాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుళ్లు, కుట్రల రాజకీయాలకు చరమగీతం పాడండి. వైఎస్సార్ అందించిన విశ్వసనీయతకు పట్టం కట్టం డి. పేదవాడి గుండెచప్పుడు వినే.. ప్రజల మనసెరిగే నడుచుకునే నాయకుడిని సీఎంగా ఎన్నుకోండి. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...
 
ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మారుస్తా

 వైఎస్ నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయత సాక్షిగా చెపుతున్నా. నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసే వేదికపైనే  చేయబోయే ఐదు సంతకాలు రాష్ట్ర దశ, దిశను మారుస్తాయి. అక్కాచెల్లెళ్లు ఆరు, ఏడు తరగతి చదువుతోన్న పిల్లలను చదివించే స్థోమత లేక కూలి పనులకు తీసుకెళ్తున్నారు. అక్కాచెల్లెళ్లను ఆ కష్టాలకడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం చేయబోతున్నా. ఇద్దరు పిల్లలను బడికి పంపితే అక్కాచెల్లెళ్ల ఖాతాలో ప్రతి నెలా రూ.వెయ్యి జమ చేస్తా.  నా అవ్వాతాతలకు ఓ మనవడిగా భరోసా ఇస్తున్నా. నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా రెండో సంతకం చేయబోతున్నా. రైతన్నల కోసం మూడో సంతకం చేయబోతున్నా. రైతులకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. కరువు, వరద వచ్చినప్పుడు వెంటనే ఆదుకోవడానికి ఏటా రూ.2 వేల కోట్లతో సహాయ నిధి ఏర్పాటుచేస్తా. నా అక్కాచెల్లెళ్ల కోసం నాలుగో సంతకం చేయబోతున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు, మరే కార్డు కావాలన్నా మీ ఊర్లో, మీవార్డులోనే 24 గంటల్లోగా ఇప్పించేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయించేలా ఐదోసంతకం చేస్తా.

 మూడు రకాల అంబులెన్స్‌లు ప్రవేశపెడతా...

మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది. 108, 104 సర్వీసులకు నిధులివ్వకుండా మూలనపడేసింది. నేను అధికారంలోకి రాగానే రాజన్న పథకాలన్నింటినీ సమర్థంగా అమలుచేస్తా. అనారోగ్యంతో ఉన్న వారు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో  ఇంటి వద్దకు వచ్చేలా 108 సర్వీసులను మెరుగుపరుస్తాం.  రైతన్నకు తన పొలంలో భూసారం ఎంతుందో? ఏ ఎరువులు ఏ మోతాదుల్లో వాడాలో? ఏ పైరు వేసుకోవాలో తెలిపేందుకు 103ని ప్రవేశ పెడతాం. రైతు 103కి ఫోన్ చేయగానే శాస్త్రవేత్తలు ఆ రైతు పొలం వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి సలహాలు ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తాం.పాడి పశువులు జబ్బుపడితే 102కు ఫోన్ చేస్తే చాలు.. 20 నిమిషాల్లో పశువైద్యులు వచ్చి ఆ పశువుకు వైద్యం చేసేలా వినూత్న పథకాన్ని అమలు చేస్తాం. 2019 నాటికి ఏ గ్రామానికైనా వెళ్లి ఇళ్లులేని వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తే ఒక్క చేయి కూడా పైకి లేవకుండా చేస్తా. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 47 లక్షలు ఇళ్లు నిర్మిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు నిర్మించారు. ఆయన స్ఫూర్తితో ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాదు.. ఆ ఇంటి పట్టాలు అక్కా చెల్లెళ్ల పేరు మీద  రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తా.

  వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమైన ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నీరుగార్చింది. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారు. నేను ముఖ్యమంత్రినయ్యాక వీటన్నిటినీ చేర్చి ఆరోగ్యశ్రీని మరింత బాగా అమలు చేస్తా. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందినవారు డాక్టర్ సూచన మేరకు వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే.. అన్ని రోజులు నెలకు రూ.మూడు వేల చొప్పున సహాయంగా అందిస్తా. ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి ఇప్పుడు బిల్లు రూ.550 వరకూ వస్తోంది. ఆ బిల్లులు కట్టలేని దుస్థితిలో పేదలు ఉంటే.. కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. దొంగ కనెక్షన్ తీసుకుని పేదలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. నేను ముఖ్యమంత్రినయ్యాక ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి అవసరమైన 150 యూనిట్లు రూ.100కే ఇస్తా.వ్యవసాయానికి పగటి పూట ఏడుగంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా 2019 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నా.
 
ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు బెల్ట్‌షాపుల వల్ల దారితప్పుతున్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్‌షాపులను మూసివేయిస్తా. బెల్ట్‌షాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పదిమంది మహిళా పోలీసులను నియమిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఒక చోటే మద్యం దుకాణం ఉంటుంది. ఆ షాపును కూడా ప్రభుత్వమే నడుపుతుంది. మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటాయి. చంద్రబాబు తరహాలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. సొంత తమ్ముడు, చెల్లెమ్మకు ఉద్యోగం కోసం ఎంత కష్టపడతానో అదే రీతిలో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement