అభిమాన వర్షం
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో రెండురోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనం ఆయనపై అభిమాన వర్షాన్ని కురిపించారు. రెండోరోజు ఆదివారం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో జనభేరి సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.
ఉదయం ఆత్మకూరులో, ఆ తర్వాత నెల్లూరుపాళెం, రాజవోలు, చంద్రపడియ, వింజమూరు, అనంతరం దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ప్రకాశంజిల్లాలోకి వెళ్లారు. రాత్రి అయినా కూడా మహిళలు ఆయన కోసం వేచి యుండి ఘనస్వాగతం పలికారు. మండే ఎండలను సైతం లెక్కచేయక చిన్నాపెద్దా, వృద్ధులు అనే తేడాలేకుండా గంటల తరబడి జగన్ కోసం ఎదురు చూశారు. జనాన్ని చూసిన జగన్ అడుగడుగునా కాన్వాయ్ ఆపి కిందకు దిగి అందరినీ పేరుపేరునా పలకరించారు. ‘ఎలా ఉన్నారు? బాగున్నారా’ అంటూ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
రాబోయే కాలం మనదేనని, అందరికీ మంచి జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. చిన్నారులను, వృద్ధులను ముద్దాడి ఆప్యాయత కురిపించారు. రాజన్న బిడ్డ ఆప్యాయతకు జనం కరిగి పోయారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి రాజన్న రాజ్యం తెచ్చుకుంటామంటూ జగన్‌ను ఆశీర్వదించారు. ఆత్మకూరు, వింజమూరు సభల్లో జగన్ ప్రసంగం జనాన్ని ఉత్తేజితులను చేసింది. రైతుల కోసం ప్రత్యేకనిధి, మహిళలకు డ్వాక్రా రుణాలు రద్దు, విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, తదితర పథకాలను ప్రకటించినప్పుడు జనం హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినప్పుడు జనం నుంచి మంచిస్పందన లభించింది.
చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ నినదించారు. 18 రోజులు తర్వాత రాజన్న రాజ్యం వస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. వింజమూరు రోడ్‌షోకు జనం పోటెత్తారు. జగన్ రెండో రోజు రోడ్‌షోలు, జనభేరి సభలకు జనం నుంచి అపూర్వస్పందన లభించింది. మొత్తంగా జిల్లాలో జగన్ రెండు రోజులు ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ విజయచందర్, జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డాక్టర్ బాలచెన్న య్య, నెల్లూరు నగర వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, పాండు రంగారెడ్డి పాల్గొన్నారు.