జన కెరటం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎండలు మండుతున్నాయని తెలిసినా.. ఏ నాయకుడూ వాహనాలు ఏర్పాటు చేయకపోయినా.. వడదెబ్బ తగిలి ప్రాణాలు పోతాయని తెలిసినా ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు.. పిల్లా జెల్లా.. ముసలీ ముతక సహా ఊళ్లకు ఊళ్లు రోడ్లపైకి చేరుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షోలకూ బహిరంగ సభలకూ శనివారం జనం నీరాజనాలు పలికారు. షర్మిలకు వస్తోన్న జనాదరణను చూసి ఓర్వలేని టీడీపీ శ్రేణులు గోరంట్లలో ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇంటి వద్ద కవ్వించే యత్నాలకు పాల్పడటాన్ని బట్టి చూస్తే.. పోలింగ్‌కు ముందే ఆ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న కదిరి, ఓడీసీ, హిందూపురం, మడకశిరల్లో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది.
ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో 24న ఎన్నికల ప్రచారాన్ని షర్మిల వాయిదా వేసుకున్నారు. శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ, హిందూపురం, మడకశిరలలో షర్మిల పర్యటించి, రోడ్‌షోలు నిర్వహించేలా శుక్రవారం రాత్రి షెడ్యూలు రూపొందించారు. సమయం లేకపోవడంతో జనసేకరణకు వైఎస్సాసీపీ శ్రేణులు ఎలాంటి వాహనాలను సమకూర్చలేదు. ఎండల నుంచి ఉపశమనం కల్పించడానికి షామియానాలు కూడా వేయలేదు. హిందూపురంలో సాయంత్రం ఆరు గంటలకు షర్మిల రోడ్‌షోకు తొలుత అనుమతించిన పోలీసులు.. శనివారం ఉదయం మాత్రం సాయంత్రం నాలుగు గంటల్లోగానే రోడ్‌షోను పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు.
పోలీసులతో కలిసి హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఎన్ని కుట్రలు పన్నినా.. సూరీడు మండుతున్నా జనాన్ని మాత్రం ఆపలేకపోయారు. షెడ్యూలు ప్రకారం శనివారం ఉదయం పది గంటలకు షర్మిల ఓడీసీకి చేరుకోవాలి. కానీ.. పులివెందుల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఆ రెండు గంటల పాటూ మండేఎండలో తారురోడ్డుపై నిల్చున్న వేలాది మంది ప్రజల్లో ఏ ఒక్కరి మొహంలో కూడా చిరాకు కన్పించలేదు. షర్మిల ఓడీసీకి చేరుకోగానే ఆమెను దగ్గరి నుంచి చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆమెతో కరచాలనంతో చేసేందుకు యువతులు, వృద్ధులు, యువకులు పోటీపడ్డారు.
ఓటమి భయంతో నిమ్మల కవ్వింపు యత్నాలు..
ఓడీసీ నుంచి గోరంట్ల మీదుగా హిందూపురానికి షర్మిల బయలుదేరారు. ఇది తెలుసుకున్న ప్రజానీకం గోరంట్లకు వేలాదిగా తరలివచ్చారు. షెడ్యూలు ప్రకారం గోరంట్లలో షర్మిల రోడ్‌షో లేదు. కానీ.. పుట్ట పగిలి చీమలు బయటకు వచ్చినట్లు గోరంట్ల జనసంద్రంగా మారింది. ఇది అక్కడే ఉన్న నిమ్మల కిష్టప్పకు కంటగింపుగా మారింది. షర్మిల రోడ్‌షో సూపర్‌హిట్ అవుతుందని గ్రహించిన ఆయన తన అనునయులను ఎగదోశారు. నిమ్మల అనునయులు ఆయన ఇంటి వద్ద షర్మిల ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌లోని శ్రేణులను కవ్వించేయత్నం చేశారు. టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు చాలా తేలిగ్గా తీసుకున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకున్నా గోరంట్లలో వేలాది మంది జనం పోటెత్తడంతో హిందూపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను నిర్ఘాంతపరచింది. సొంతూర్లో షర్మిలకు నీరాజనం పలుకుతోన్న నేపథ్యంలో తనకు ఎదురుగాలి వీస్తోందని గ్రహించి.. ప్రజల దృష్టిని మరల్చేందుకు నిమ్మల కవ్వింపు చర్యలకు దిగారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాలయ్య కుట్ర
షర్మిల రోడ్‌షో, బహిరంగసభను అడ్డుకోవడానికి పోలీసులతో కలిసి హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి, సినీనటుడు బాలకృష్ణ కుట్రపన్నారు. హిందూపురంలో షర్మిల రోడ్‌షోకు శనివారం సాయంత్రం ఆరు గంటలకు పోలీసులు తొలుత అనుమతి ఇచ్చారు. కానీ.. పెనుకొండ డీఎస్పీపై బాలకృష్ణ ఒత్తిడి తేవడంతో షర్మిల రోడ్‌షో సమయాన్ని శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ మార్చారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకూ రోడ్‌షో నిర్వహణకు పోలీసులు అనుమతించారు. షర్మిల రోడ్‌షో సమయం మారిన విషయం ప్రజలకు తెలియదు. కానీ.. షర్మిల చేరుకునే సమయానికే హిందూపురం వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సభకు జనం పోటెత్తడంతో సినీనటుడు బాలకృష్ణ నివ్వెరపోయారు. హిందూపురంలో నిర్వహించిన సభకు ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం.
రఘువీరా కోటలో షర్మిల జనభేరి
షెడ్యూలు ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు షర్మిల మడకశిరకు చేరుకోవాలి. కానీ.. పోలీసుల అభ్యంతరాల వల్ల ఆ సమయానికి హిందూపురంలో రోడ్‌షో నిర్వహించారు. హిందూపురంలో రోడ్‌షో ముగించుకుని రాత్రి ఏడు గంటలకు మడకశిరకు చేరుకున్నారు. మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నా జనం ఏమాత్రం చెక్కుచెదరలేదు. మడకశిర వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఇసుకేస్తే కిందకు రాలనంత రీతిలో జనం పోటెత్తారు. మడకశిర చరిత్రలో ఇప్పటిదాకా ఏ నాయకుడు నిర్వహించిన సభకు హాజరుకాని రీతిలో వైఎస్ షర్మిల సభకు ప్రజాసైన్యం కదలివచ్చింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోటలో షర్మిల జనభేరి సూపర్‌హిట్ కావడం కాంగ్రెస్ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసింది. ఈనెల 16, 17న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించిన విషయం విదితమే. శనివారం షర్మిల నిర్వహించిన ప్రచారానికీ అదే రీతిలో స్పందన లభించడంతో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులకు ఓటమి భయం పట్టుకుంది.