నేడు వైఎస్ జగన్ నామినేషన్
పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల జనభేరి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పలు బహిరంగ సభలలో పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ బుధవారం అర్ధరాత్రి ఇడుపులపాయకు చేరుకున్నారు. గురువారం ఉదయాన్నే తండ్రి వైఎస్‌ఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన అనంతరం నేరుగా పులివెందులకు రానున్నారు. నామినేషన్ సందర్భంగా భాకరాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది.
అక్కడి నుంచి కడప రోడ్డుమీదుగా ఆర్టీసీ బస్టాండు, మెయిన్ బజార్, పూలంగళ్ల వరకు ర్యాలీ ఉంటుంది. పూలంగళ్ల వద్ద హాజరైన ఆశేష జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం ముద్దనూరు రోడ్డుమీదుగా జూబ్లీ బస్టాఫ్, నాలుగు రోడ్ల సర్కిల్, తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఉదయం 11గంటలనుంచి 12గంటల మధ్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను వైఎస్ జగన్ అందజేయనున్నారు.
ప్రజలతో మమేకం.. :
గురువారం ఉదయం నామినేషన్ కార్యక్రమం ముగిసిన అనంతరం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం కానున్నారు. ప్రజలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్చించనున్నారు.
తొలిసారి శాసనసభకు వైఎస్ జగన్:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా పులివెందుల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిపై 1.75లక్షలపైచిలుకు ఓట్లతో గెలుపొందారు. వైఎస్‌ఆర్ మృతిని తట్టుకోలేక అశువులు బాసిన కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుండగా కాంగ్రెస్‌పార్టీ నియంత్రణ చర్యలకు ఉపక్రమించడంతో తప్పని పరిస్థితులలో పార్టీని వీడి బయటకు వచ్చారు.
అనంతరం 2011లో వైఎస్‌ఆర్ సీపీని స్థాపించడం.. మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 5,45,043ఓట్ల భారీ మెజార్టీని అందించడంతో దేశస్థాయిలోనే ఆయన పేరు మారుమోగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభంజనం వీస్తున్న నేపథ్యంలో పులివెందుల నుంచి వైఎస్ జగన్ సీఎం అభ్యర్థిగా శాసన సభకు పోటీ చేస్తున్నారు.
రేపు వైఎస్ జగన్ ప్రచారం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 18వ తేది కడప పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహిస్తారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.