అవినీతి చక్రవర్తి చంద్రబాబు! | YS Jaganmohan Reddy lashes out at Chandra babu | Sakshi
Sakshi News home page

అవినీతి చక్రవర్తి చంద్రబాబు!

Published Wed, Apr 23 2014 2:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

అవినీతి చక్రవర్తి చంద్రబాబు! - Sakshi

అవినీతి చక్రవర్తి చంద్రబాబు!

ఐఎంజీ, ఎమ్మార్‌లకు వందలాది ఎకరాలను పప్పుబెల్లాల్లా కట్టబెట్టాడు  మంగళగిరి వైఎస్‌ఆర్ జనభేరి సభలో జగన్
 
ప్రభుత్వరంగ సంస్థలను బినామీలకు అప్పగించాడు
ప్రభుత్వ డైరీలను కుప్పకూల్చి, హెరిటేజ్‌ను విస్తరించాడు
కాంగ్రెస్ నేతలతో కలిసి కోర్టుల్లో నాపై కేసులు వేశారు
విప్ జారీచేసి మరీ కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడాడు
రాష్ట్ర విభజనకోసం సోనియాతో కుమ్మక్కయ్యారు
అందుకే ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో సీబీఐ విచారించదు
కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌పై కేసులు పెడతారు
చంద్రబాబుకు ఒక న్యాయం.. జగన్‌కు ఒక న్యాయం

 
మంగళగిరి (గుంటూరు జిల్లా):

 
నీతి నిజాయితీల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐఎంజీ, ఎమ్మార్‌లకు వందలాది ఎకరాలు పప్పుబెల్లాల్లా కట్టబెట్టిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌక ధరలకే బినామీలకు అప్పగించడం, ప్రభుత్వ డైరీలను కుప్పకూల్చి, హెరిటేజ్‌ను విస్తరించడం రాష్ట్రప్రజలింకా మర్చిపోలేదని చెప్పారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. గుంటూరుజిల్లా మంగళగిరిలో మంగళవారం జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. ‘‘చంద్రబాబుకు మాటమీద నిలబడే నైజం లేదు.

ఆయనకు రాజకీయాలంటే ఎత్తులు, పైఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు మాత్రమే. సీబీఐ కేసులనుంచి తప్పించుకునేందుకు నాలుగేళ్లుగా కాంగ్రెస్ సర్కారు తలకెత్తుకుని మోస్తున్నారు. అధికార కాంగ్రెస్‌తో కలిసి నాపై కోర్టులో కేసులు వేశారు. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కరెంటు చార్జీల బాదుడు బాదితే తన ఎమ్మెల్యేలకు విప్ జారీచేసి మరీ కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి కాపాడారు. చిన్న చిన్న వర్తకులను దెబ్బతీసే ‘ఎఫ్‌డీఐ’ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల) బిల్లును గట్టెక్కించేందుకు రాజ్యసభలో తన సభ్యులను గైర్హాజరు చేయించారు. ఇలా అడుగడుగునా అధికార పార్టీకి అండదండలు అందించాడు కాబట్టే చంద్రబాబును సీబీఐ విచారించదు. సీబీఐ ఎమ్మార్ అక్రమాలపై విచారణ చేస్తుంది కానీ అందులో చంద్రబాబు పాత్రను మాత్రం ప్రస్తావించదు. కనీసం మంత్రివర్గంలో చర్చించకుండా ఊరూపేరూలేని ఐఎంజీకి వందలాది ఎకరాలు ధారాదత్తం చేసిన వైనంపై చంద్రబాబును విచారించాలని కోరితే... తమ వద్ద తగిన సిబ్బంది లేరని సమాధానం చెపుతుంది.

అధికార పార్టీని ధిక్కరించి సొంతపార్టీ స్థాపించాను కాబట్టి నాపై కక్ష సాధిస్తుంది. నా ఆఫీసుల్లో అర్ధరాత్రి సోదాలు చేస్తుంది. చంద్రబాబుకు ఒక న్యాయం.. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయం. ఎందుకంటే జగన్‌మోహన్‌రెడ్డి సోనియాను ఎదిరించాడు.. చంద్రబాబు కుమ్మక్కయ్యాడు’’ అని చెప్పారు. ఈ కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడే రోజు 15 రోజుల్లో రాబోతుందని చెప్పారు. ఆ రోజున విశ్వసనీయతకు ఓటేసి మన తలరాతలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే...
 
బంగారంలాంటి రాష్ట్రాన్ని  నిట్టనిలువునా చీల్చారు...
 
ఓట్లు, సీట్ల కోసం సోనియాతో కుమ్మక్కయిన చంద్రబాబు బంగారంలాంటి రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారు. సమైక్య రాష్ట్రం కోసం నేను జైలులోనే నిరాహార దీక్ష చేసి ఉద్యమిస్తే.. చంద్రబాబు మాత్రం పార్లమెంటులో తన సభ్యులతో కాంగ్రెస్‌కు మద్దతు పలికించి రాష్ట్ర విభజనకు పాల్పడ్డాడు. ఓట్లు, సీట్ల కోసం ఎంతటి నీచానికైనా పాల్పడే మనస్తత్వం చంద్రబాబుది. అందుకోసం ఇప్పుడు మరిన్ని వాగ్దానాలతో మీ ముందుకు వస్తున్నాడు. రోజుకో అబద్ధం చెబుతూ.. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెపుతూ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబుకు రాజకీయం అంటే ఓ చదరంగం, ఓ కుట్ర.
 
కానీ రాజకీయం అంటే పేదవాని మనసెరిగి ప్రవర్తించడం... పేదవాడి గుండెచప్పుడు వినడం... చనిపోయాక కూడా పేదవాని గండెల్లో సజీవంగా ఉండటం... ఇదీ నేను మా నాయన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేర్చుకున్న విలువలు. మా నాయన నుంచి నాకు వారసత్వంగా వచ్చిందేమైనా ఉందంటే అది ‘విశ్వసనీయతే’. రాజకీయాల్లో ఇచ్చిన మాటపైన నిలబడటం.. మాటకోసం ఎందాకైనా పోరాడటం అన్న విలువలు ఆయన నుంచే నేర్చుకున్నాను.
 
వైఎస్ కన్నా ముందూ.. తర్వాతా మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం. అయితే మహానేత మరణించి ఐదేళ్లవుతున్నా వైఎస్ ఎక్కడ అని అడిగితే ప్రతి పేదవాని చేయి నేరుగా గుండెల వద్దకు వెళుతుంది. మా గుండెల లోతుల్లో మహానేత ఇప్పటికీ సజీవంగా ఉన్నారంటారు. కారణం ఆయన అందించిన పాలన. ఎన్నికల ముందు ఏమైతే చెప్పాడో అంతకన్నా ఎక్కువే చేసి చూపాడు.

చంద్రబాబు అయితే ఎన్నికల ముందు రెండు రూపాయలకు కిలో బియ్యం అన్నాడు.. ఎన్నికలయ్యాక రూ.5.25 చేశాడు. ఎన్నికల ముందు మద్యనిషేధం అన్నాడు.. ఆ తర్వాత ‘ఈనాడు’లో పెద్ద పెద్ద వార్తలు రాయించి.. నిషేధం ఎత్తేసి ఊరూరా బెల్టు షాపులు తెరిపించాడు.చంద్రబాబు పాలనలో ఏ గ్రామానికి వెళ్లి చూసినా భయానక దృశ్యాలే. పెద్ద జబ్బుచేస్తే ఆస్పత్రి ఖర్చులకోసం నాలుగైదు రూపాయల వడ్డీ అయినా చెల్లించేందుకు తిప్పలు పడే దృశ్యాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంటాయి. పిల్లల ఫీజులకోసం అన్నీ అమ్ముకునే పేద తల్లిదండ్రులు.. పింఛన్ కోసం... ఒక వృద్ధుని చావుకోసం మరో వృద్ధుడు ఎదురు చూనే అమానవీయ పరిస్థితి మనసును కలచివేస్తూనే ఉంటుంది.
 
ముఖ్యమంత్రిగా పేదలకు నరకం చూపిన చంద్రబాబు.. ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటూ మీ ముందుకు వస్తున్నాడు. ఓట్లు, సీట్ల కోసం నేను చంద్రబాబులా అబద్ధాలు చెప్పను. ఈ ఎన్నికల అనంతరం తాను, తన పార్టీ ఉండబోమని 65 ఏళ్ల చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అడ్డగోలు హామీలిస్తున్నారు. చంద్రబాబుకన్నా నేను పాతికేళ్లు చిన్నవాడిని. మరో 30 ఏళ్లు ప్రజల మధ్య ఉండి రాజకీయాలు చేసేవాడిని. అందుకే చేసే పనులే చెప్తా. నేను ప్రమాణస్వీకారం చేసినరోజే ఐదు సంతకాలు చేస్తానని ఇప్పటికే పలు సభల్లో చెప్పాను. అధికారంలోకి వచ్చాక చేసే పనుల గురించి పలు సందర్భాల్లో ఇప్పటికే పలు సభల్లో వివరించా. నేనిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా. 15 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల సమరంలో కుట్రలు, కుతంత్రాలను ఓడించండి. విశ్వసనీయతకు పట్ట కట్టండి. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి.
 
 తె నాలిలో అభివాదాలకే పరిమితం

 సాక్షి, గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనభేరి బహిరంగసభకు జనం పోటె త్తారు. తెనాలి మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. అయితే మంగళగిరి బహిరంగ సభ ముగించుకుని తెనాలి వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రసంగానికి అవకాశం లేకపోయింది. దీంతో బహిరంగ సభ కు వచ్చిన జనాన్ని నిరుత్సాహపర్చకుండా అభివాదం చేస్తూ జగన్ సభా ప్రాంగణం అంతా కలియతిరిగారు. పదినిమిషాల పాటు అందరికీ అభివందనం చేసి వినుకొండ వైపు బయలు దేరారు.
 
 ఐదు సంతకాలు... ఆరు పనులివే...

 
ఇద్దరు పిల్లలను బడికి పంపితే అమ్మ ఒడి పథకం కింద అక్కాచెల్లెళ్ల ఖాతాలో ప్రతి నెలా రూ.వెయ్యి జమ చేసేలా తొలి సంతకం.వృద్ధులకు నెలనెలా రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా రెండో సంతకం .రైతన్నలకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి.. కరువు, వరద వచ్చినప్పుడు వెంటనే ఆదుకోవడానికి ఏటా రూ.2 వేల కోట్లతో సహాయ నిధిని ఏర్పాటుచేస్తూ మూడో సంతకం.అక్కాచెల్లెళ్లను రుణవిముక్తుల్ని చేసేందుకు రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం. రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు, మరే కార్డు కావాలన్నా మీ ఊర్లో, మీవార్డులోనే 24 గంటల్లోగా కార్డును ల్యామినేషన్ చేసి ఇప్పించే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయించేలా ఐదోసంతకం. 2019 నాటికి గుడిసెల్లేని రాష్ట్రం. ఐదేళ్లలో 50 లక్షల ఇళ్ల నిర్మాణం. ఆ ఇంటి పట్టాలు అక్కా చెల్లెళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్. ఆ ఇంటి పట్టాలు తాకట్టు పెడితే పావలా వడ్డీకే రూ.30 వేలను రుణంగా ఇచ్చేలా ఏర్పాటు.
 
ఆరోగ్యశ్రీ నుంచి తొలగించిన 133 జబ్బులను తిరిగి చేర్చడం. ఆపరేషన్ చేయించుకున్న వారికి డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పినన్ని రోజులు... నెలకు రూ.మూడు వేల చొప్పున సహాయం.ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి అవసరమైన 150 యూనిట్లు రూ.100కే. వ్యవసాయానికి పగటి పూట ఏడుగంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా 2019 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం.  గ్రామాల్లో బెల్ట్‌షాపుల మూసివేత. నియోజకవర్గానికి కేవలం ఒక మద్యం దుకాణం. అందులోనూ షాక్ కొట్టేలా ధరలు. చదువుకున్న ప్రతి తమ్ముడు, చెల్లెమ్మకు ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement