సాక్షి, అమరావతి: రాజకీయాలంటే సినిమా కాదని, వంద రోజుల్లో పాలనపై తీర్పు ఇవ్వడం ప్రతిపక్షం తొందరపాటని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో దివంగత మహానేత ఒకడుగు ముందుకు వేస్తే జగన్ రెండడుగులు ముందుకు వేస్తానంటున్నాడని చెప్పారు. జగన్‌లో ధైర్యం పాళ్లు ఎక్కువని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను ఆచరించి చూపుతారని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ 10వ వర్ధంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆదివారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి అఖండ విజయంతో సీఎం పదవిని అధిష్టించిన వైఎస్ జగన్.. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటారని ఆకాంక్షించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
ఆ కమిట్‌మెంట్ నాకు చాలా నచ్చింది
జగన్ అధికారంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 100 రోజుల పాలనను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేం. ఇది సినిమా కాదు. ప్రతి రోజు.. ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేయాలి. నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానంటున్నాడు జగన్. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వలంటీర్లకు మేనిఫెస్టోను ముందు పెట్టుకోవాలని చెప్పారు. ఆ కమిట్‌మెంట్ నాకు చాలా నచ్చింది. మళ్లీ ఎన్నికల నాటికి ఈ మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేశాకే ఓట్లడుగుతానంటున్నాడు. మద్యపాన నిషేధంలో భాగంగా బెల్ట్‌షాపుల తొలగింపు మొదలుపెట్టారు.
జగన్ సీఎం అవుతాడని ఊహించే కష్టపెట్టారు
వైఎస్సార్ అన్ని కష్టాలు అనుభవించారు. చాలా పోరాటం చేశారు. ప్రతిపక్షంతోనూ, స్వపక్షంతోనూ పోరాడారు. ఆయన సీఎం కావడానికి 25 ఏళ్లు పట్టింది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక జగన్‌ను చాలా వేధించారు. జగన్ సీఎం అవుతారని ఊహించే ఇలా కష్టపెట్టారు. ఓదార్పు యాత్రలో ప్రజా స్పందన, ప్రజల అభిమానం చూశారు. రాజశేఖరరెడ్డికి మంచి పేరు రావడం, ఆయన కోసం జగన్ ఓదార్పు యాత్ర చేయడం హైకమాండ్‌కు నచ్చలేదు. అందుకే తొక్కిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారికి చంద్రబాబు తోడయ్యారు. 2014లో ఓటమి మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. మేమెక్కడా కుంగిపోలేదు. 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకున్నా జగన్ భయపడలేదు. ఏం జరుగుతోంది నాయనా అంటే ‘నీవు దేవుడిని నమ్ముతావు కదమ్మా.. దేవుడు మంచి చేస్తాడు’ అన్నాడు. వెళ్లే వాళ్లు వెళ్లినా భయపడలేదు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట కోసం జగన్ కష్టపడుతున్నాడని ప్రజలు భావించారు. వైఎస్ చేసిన మంచి పనులన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ఓదార్పు యాత్రలో గమనించాం. జగన్ జైలులో ఉండగా, మేము బయటకు వెళ్లినప్పుడు ప్రజలు మా వెంట నిలవడం, 18 మందిని గెలిపించుకోవడం, పార్టీ కోసం వెళ్లినప్పుడు కూడా జనం మమ్మల్ని అక్కున చేర్చుకోవడం.. పాదయాత్ర అయిపోయే నాటికి గెలుపుపై మాకు పూర్తి విశ్వాసం కలిగింది. ఎక్కడ వైఎస్, జగన్ పేరు ప్రస్తావించినా మంచి స్పందన ఉండేది. వైఎస్సార్ చేసిన పనులు, చంద్రబాబు చేయని పనులు జనమే చెప్పేవారు.
అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు ఆమోదించారు
చంద్రబాబు చివరి మూడు నెలల్లో అన్నీ చేశానని చెప్పారు. పెన్షన్ రూ.2 వేలు చేశానన్నారు.. 3 వేలు చేస్తానని చెప్పారు.. డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ ఇస్తానన్నారు.. అమ్మ ఒడి అమలు చేస్తానని, యువతకు మేలు చేస్తానన్నారు. పింఛన్‌ను జగన్ రూ.2 వేలకు పెంచుతానని చెప్పకపోతే బాబు చెప్పేవాడా? జగన్ హామీలను చూసి బాబు కాపీ కొట్టలేదా? రైతులకు ఏటా రూ.12,500 జగన్ ఇస్తానన్నాకే కదా బాబు కూడా ఇస్తానంది? వైఎస్ చెప్పినవన్నీ చేసి చూపించారు. ఆయన రక్తం పంచుకుపుట్టిన జగన్ కూడా చేస్తాడు. ఒక అవకాశం ఇవ్వండని కోరాను. ప్రజలు అవకాశం ఇచ్చారు. తొలిరోజే మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన స్పందన కార్యక్రమం బాగుంది. ఎన్నిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామో చెప్పాలన్నారు. అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు ఆమోదించారు.
ఐదేళ్లలో ఏమీ చేయలేని వారు అప్పుడే విమర్శలా?
జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు. ఐదేళ్లలో ఏమీ చేయలేని వారు విమర్శలు మొదలు పెట్టారు. వాళ్లు తప్పులు మాట్లాడుతున్నారు. బిల్డింగులు, రోడ్లు.. ప్రతి చోటా అవినీతే. వచ్చిన డబ్బులేం చేశారో తెలీదు. రాజధాని పేరుతో అంతా అవినీతే. జలయజ్ఞం కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బాబు పాలనకు ముందు వరకు రూ.96 వేల కోట్ల అప్పులుంటే.. బాబు రూ.2.60 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ డబ్బులతో ఏం చేశారంటే జవాబు లేదు. పవన్ కల్యాణ్ టార్గెట్ ఎప్పుడూ జగనే. ఎన్నికలప్పుడు జగన్‌ను విమర్శించారు. ఇప్పుడూ విమర్శిస్తున్నారు. రాజధాని మార్పు నిజం కాదనుకుంటా. రాజధాని పేరుతో బాబు ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారం గురించి సీఆర్‌డీఏ మీటింగ్‌లో మాట్లాడుకున్నారు. బాబు పర్మినెంట్‌గా ఒక ఇటుక పెట్టింది లేదు. అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇలా బురద వేస్తున్నారు. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే జగన్‌కు చెబుతుంటాను. బయట అలా అనుకుంటున్నారని, ఇలా అనుకుంటున్నారని వివరిస్తాను.
చంద్రబాబు నోట అన్నీ అబద్ధాలే
తను ఎందుకు ఓడిపోయారో అర్థం కావడం లేదని చంద్రబాబు మాట్లాడుతుండటం ప్రజల చెవిలో పూలు పెట్టాలనే. తునిలో తనే రైలు తగలబెట్టించి కడప నుంచి రౌడీలు వచ్చారన్నారు. నీళ్లను ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? అలా చేసి ఉంటే నిజంగా ఆయన ఇల్లు మునిగిపోయేది. ఏం చేశారని బాబుకు ప్రజలు ఓటేస్తారు? ఈ విషయం ఆయనకు ఎందుకు అర్థం కాదు? 1978లో వైఎస్సార్, చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి కలిసి వెళ్లే వారు. తర్వాత బాబు దారి బాబుది. వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్ కాదు.. శత్రువుగా చూశారు. బాబు హయాంలో ఇసుక పేరుతో దోచుకున్నారు. పోలవరంలో పనులు చేయకుండానే కోట్లు కోట్లు డబ్బులిచ్చేశారు. ఇవాళ జగన్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగన్ అన్ని పథకాలను వాళ్ల కంటే దర్జాగా అమలు చేస్తారు. ఇసుక విక్రయంలో పారదర్శకత తీసుకొస్తున్నారు. పోలవరం వైఎస్సార్ కల. ప్రాజెక్టులంటే జగన్‌కు ఆసక్తి, ఇష్టం. పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కనిపిస్తున్నాయంటే వైఎస్సార్ నిర్ణయాలే కారణం. కనీసం జగన్ పాలనను ఏడాది చూడాలి. బాబు అడ్డగోలుగా దోచుకున్నారు. అలాంటి పాలనను దారికి తేవాలంటే సమయం పడుతుంది. జగన్ గొప్ప పనులు చేస్తారు.
ఎంత మంది చెప్పినా ప్రభుత్వాన్ని పడగొట్టలేదు
వైఎస్సార్ ప్రభుత్వం తొలి రోజుల్లో జీతాలిచ్చే పరిస్థితి లేదు. మంచి మనసు ఉంటే ప్రకృతి, దేవుడు సహకరిస్తారు. జగన్ ఎంపీ అయ్యాక 2009లో వైఎస్ మన మధ్యనుంచి వెళ్లిపోయారు. ఒకసారి ఎంపీలందరినీ పిలుచుకుని సోనియా, రాహుల్‌కు పరిచయం చేశారు. తర్వాత ప్రతి నెలా అపాయింట్‌మెంట్ అడిగారు. కానీ అవకాశం ఇవ్వలేదు. అప్పుడు మొదలైన పోరాటం మొన్నటి దాకా సాగింది. తనకెన్ని కష్టాలున్నా పక్కనపెట్టాడు. ప్రజలకు ఎప్పుడూ తన కష్టం చెప్పలేదు. జగన్ ఎప్పుడూ పెద్దలను గౌరవించేవాడు. సోనియాను ఓదార్పునకు అనుమతి కోసం వెళ్లినప్పుడు.. తనకు సీఎం పదవి కావాలని కోరలేదు. ‘నాన్న చెప్పినట్లు 41 స్థానాలు మీకు అప్పగిస్తాను.. నాకు మంత్రి పదవి వద్దు.. రాష్ట్రంలో తిరగడానికి అనుమతిస్తే చాలు’ అని కోరాడు. చాలా మంది సలహా ఇచ్చినా ప్రభుత్వాన్ని పడగొట్టలేదు.
చంద్రబాబు అవకాశవాది
జగన్‌ను ఎప్పుడూ విమర్శించడమే వాళ్ల పని. వారి బాగోతాలు బయట పడుతుంటే ఓర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నారు. కేటీఆర్‌తో జగన్ బావుంటే నష్టం ఏమిటి? రకరకాల గొడవలతో నీవు దూరమయ్యావు. మళ్లీ వారితో పొత్తు కోసం హరికృష్ణ మృతదేహం సాక్షిగా మాట్లాడావు. కేంద్రంతో, మోదీ.. అమిత్ షాలతో, పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు అవసరం. ప్రజలకు మంచి చేయడానికి వీలవుతుంది. చంద్రబాబు అవకాశవాది. ఈరోజు మోదీని, కేసీఆర్‌ను తిట్టడం లేదు. ఈ రోజు తన పార్టీ వాళ్లను బీజేపీలోకి పంపిస్తున్నారు. జగన్ తో మోదీ, అమిత్‌షాలు బాగానే ఉన్నారు. వాళ్ల పార్టీ వేరు. మా పార్టీ వేరు. అయినా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలున్నాయి. రాష్ట్రంలో సాగిన స్కాంలపై విచారణ జరుగుతుంది’’అని వైఎస్ విజయమ్మ అన్నారు.
సమస్య తెలుసుకుని పరిష్కరించే వారు
వైఎస్ అధికారంలోకి రావడానికి 25 ఏళ్లు పట్టింది. ప్రతి ఊరు, ప్రతి అవసరం తెలుసు. ప్రతి జిల్లాకు ఎన్నో మార్లు వెళ్లారు. లక్షల మందిని గుర్తు పట్టి పేరుతో పిలిచేవారు. కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఇచ్చేవారు. ఆయనే సమస్య తెలుసుకుని పరిష్కారం చూపేంత మంచి మనసు. సీఎం రిలీఫ్ ఫండ్ సరిపోవడం లేదనే ఆరోగ్య శ్రీ తీసుకొచ్చారు. రైతులకు నీళ్లుంటే తప్ప పండించుకునే పరిస్థితి లేదని ప్రాజెక్టులు మొదలు పెట్టారు. నిజాయితీ, వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఎవరికీ భయపడలేదు. ఆ రోజూ స్వపక్షంలోనే కార్నర్ చేసేవాళ్లు. ఇదే మీడియా.. ఇదే చంద్రబాబు.. దేనికీ వెరవ లేదు. ఆయనకు ఆయనే సీబీఐ ఎంక్వైరీ వేశారు. పరిటాల రవి హత్య, అవుటర్ రింగ్ రోడ్డుపై ఎంక్వైరీ వేశారు. జలయజ్ఞంపై ప్రతిపక్ష పార్టీలతో చర్చించడానికి సిద్ధమని చెప్పేవారు. ప్రజలకు ఏది అవసరమో అది తెలుసుకుని ఎవరూ అడగకపోయినా స్వయంగా చేశారు. ఈ రోజు జగన్ కూడా అంతే. అదే కోవలోనే మేనిఫెస్టో తయారైంది. వైఎస్ నాడు అలా చేశారు కాబట్టే ఈ రోజు కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారు. ప్రతి ఇంట్లో వర్ధంతి జరుపుకునే వారున్నారు.
జగన్ మంచి సీఎంగా నిలబడతారు
అక్టోబర్ నుంచి నాలుగైదు లక్షల మంది కొత్తగా పనుల్లోకి వస్తున్నారు. గ్రామ సెక్రటేరియట్ నుంచే పాలన సాగించాలనుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలకు వైఎస్ స్ఫూర్తి. అందుకే ఆయన పేరు పెడుతున్నారనుకుంటా. డేట్లు ఇచ్చి ఒక్కో పని చేపడుతున్నారు. జనంలో ఎక్కడా వ్యతిరేకత లేదు. వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. సమయం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ నేతల మాటలను మీడియా పది సార్లు వేస్తుంది కాబట్టి వారలా చెప్పుకుంటారు. అప్పుడు, ఇప్పుడు నా మాట ఒక్కటే. నాకు రాజకీయాల్లో తిరగాలని ఇంట్రస్ట్ లేదు. వైఎస్ భార్యగా, జగన్ తల్లిగా ప్రజలకు మంచి జరగాలన్నది నా ఆకాంక్ష. నా కొడుకు మీద నమ్మకంతో 175కు 151 అసెంబ్లీ, 25కు 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. చరిత్రలో నిలబడతాడని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నా. మంచి ముఖ్యమంత్రిగా జగన్ నిలబడతారు.
ఆ రోజు వైఎస్ వల్లే కాంగ్రెస్ వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో వాళ్ల పరిస్థితి ఏమిటి?
ఆరోజు ఒక్కసారిగా కష్టాలన్నీ కళ్లెదుట రీల్ తిరిగాయి. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం, మీడియాను అడ్డుపెట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం, అసెంబ్లీలో వాళ్లు వ్యవహరించిన తీరు అన్నీ ఒక్కసారిగా.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం రోజున గుర్తుకొచ్చాయి. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. వాళ్లు ఎంత అణిచినా నేల కేసి కొట్టిన బంతిలా జగన్ ముందడుగే వేశారు. సోనియా ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పిందని, వాళ్ల మాట కాదంటే ఇబ్బందులొస్తాయని చెప్పాను. అయినా జగన్ చేయాల్సిందేనన్నారు. ఇబ్బంది పెడతారని తెలిసి నాకు భయం వేయలేదు కానీ బాధేసింది. పదేళ్లలో చాలా మంది అక్కచెల్లెమ్మలు జగన్‌తో వారి బాధ చెప్పారు. మద్యానికి బానిసైన వారి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో వారి బాధలు స్వయంగా విన్నారు.. చూశారు. అందుకే ‘ఓ వైపు ఆదాయం తగ్గినా మద్య నిషేధం అమలు చేయాలమ్మా..’ అని చెబుతున్నాడు. ఇది కష్టసాధ్యమైనా చేస్తాడనుకుంటున్నా.
వైఎస్ గారు నిజంగా గొప్ప మానవతావాది. చరిత్రను ప్రభావితం చేసే నాయకుడు. ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు ఎవరూ తీసేయలేనివి. మన మధ్య నుంచి ఆయన వెళ్లిపోయి ఇవాళ్టికి 10 సంవత్సరాలైంది. అందరిలో ఆ బాధ ఉంది. సెప్టెంబర్ 2ను తలచుకుంటే చాలా చాలా బాధనిపిస్తుంది. పదేళ్ల క్రితం ఆ రోజు 10 కోట్ల మంది హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఆయన తిరిగి రావాలని, క్షేమంగా ఉండాలని కుల, మతాలకు అతీతంగా ప్రజలు పూజలు చేశారు. ఏ నాయకుడికీ ప్రజల్లో ఇంతటి స్థానముండదు. ఏ నాయకుడి కోసం 700 మంది చనిపోవడం ఉండదు. అదే అభిమానాన్ని ఈ రోజు జనం ఆయన కొడుకు జగన్‌పై చూపారు. వారి నమ్మకాన్ని జగన్ తప్పకుండా నిలబెడతారు.
వివేకానందరెడ్డి హత్య ఊహించనిది. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చేశారు. మనుషులను చంపే వరకు ఎందుకు పోతారో నాకు అర్థం కావడం లేదు. ఆరోజు వైఎస్‌ను ఇబ్బంది పెట్టేందుకే మా మామ గారిని చంపారు. ఆ రోజు దోషులను అధికారంలో ఉన్న వారు అన్ని విధాలా సహకరించి కాపాడారు. ఈ రోజు జగన్‌ను ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ల చిన్నాన్నను ఇలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment