జగన్‌ను సీఎం చేద్దాం
వైఎస్ సువర్ణ యుగం మళ్లీ తెచ్చుకుందాం: విజయమ్మ
సాక్షి, గుంటూరు: ‘‘మనం ఈ నాలుగున్నర సంవత్సర కాలం అవస్థలు పడ్డాం. మంచి నాయకుడిని ఎన్నుకునే తరుణం మరో మూడు వారాల్లో రానుంది. రాజశేఖరరెడ్డిలో ఉండే దీక్ష, పట్టుదల, తెగువ, మొండితనం అన్నీ జగన్‌లో ఉన్నాయి. అది మీరు ప్రత్యక్షంగా చూశారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం, మహానేత అందించిన సువర్ణయుగాన్ని మళ్లీ మనమే తెచ్చుకుందాం.
’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఇటీవల తొలిదశ ఎన్నికల ప్రచారం చేసిన విజయమ్మ.. రెండో దశ ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా గుంటూరు జిల్లా నందివెలుగు సెంటర్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వేలాది మంది విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. నందివెలుగు నుంచి కొలకలూరు మీదుగా గుడివాడ, కోపల్లె, అంగలకుదురు, దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోతుకూరు, మోపర్రు, తురిమెళ్ల, అమృతలూరులో విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోకు ఆయా గ్రామాల్లో వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఇంటూరు, గోవాడ మీదుగా బాపట్ల నియోజకవర్గం చందోలుకు చేరుకుని వైఎస్సార్ జనభేరి సభలో విజయమ్మ పాల్గొన్నారు. విజయమ్మ వెంట రోడ్‌షోలో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నా బత్తుని శివకుమార్, కిలారి వెంకటరోశయ్య, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, బాపట్ల సమన్వయ కర్త కోనరఘుపతి తదితరులు పాల్గొన్నారు.