తొమ్మిదేళ్ల పాలనంతా స్కాములే
‘వైఎస్సార్ జనభేరి’లో చంద్రబాబుపై విజయమ్మ ధ్వజం
విజయవాడ: ‘‘నిజాం షుగర్స్‌ను విక్రయించడం వల్ల రూ.308 కోట్లు నష్టం వస్తోందని నాటి ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ చెప్పినప్పటికీ చంద్రబాబు పచ్చచొక్కాలకు అప్పనంగా ధారాదత్తం చేశారు. సొంత లాభం కోసం చిత్తూరు డెయిరీని మూయించి హెరిటేజ్ సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా తన సంస్థల్ని విస్తరించుకున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పచ్చచొక్కాలకు మినహా ఎవరికీ మేలు చేయలేదు. ఆయన పాలనంతా స్కాములే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు.
‘‘మాజీ ఐఏఎస్ అధికారి పి.సి. పరేఖ్ ‘క్రూసేడర్ ఆర్ కాన్‌స్పిరేటర్’ అనే పుస్తకంలో నిజాం షుగర్స్ విషయం రాసినట్లు పత్రికల్లో చదివాను. మద్యం, ఏలేరు, తెల్గీ, నీరు-మీరు, పనికి ఆహార పథకం, ఐఎంజీ, ఎమ్మార్ కుంభకోణాల్లో చిక్కుకున్న చంద్రబాబు.. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని బతుకుతున్నారు’’ అని విమర్శించారు. మంగళవారం ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని 11 గ్రామాల్లో ఆమె ఎన్నికల రోడ్‌షో నిర్వహించారు.