PC Parekh
-
తొమ్మిదేళ్ల పాలనంతా స్కాములే
‘వైఎస్సార్ జనభేరి’లో చంద్రబాబుపై విజయమ్మ ధ్వజం విజయవాడ: ‘‘నిజాం షుగర్స్‌ను విక్రయించడం వల్ల రూ.308 కోట్లు నష్టం వస్తోందని నాటి ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ చెప్పినప్పటికీ చంద్రబాబు పచ్చచొక్కాలకు అప్పనంగా ధారాదత్తం చేశారు. సొంత లాభం కోసం చిత్తూరు డెయిరీని మూయించి హెరిటేజ్ సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా తన సంస్థల్ని విస్తరించుకున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పచ్చచొక్కాలకు మినహా ఎవరికీ మేలు చేయలేదు. ఆయన పాలనంతా స్కాములే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘మాజీ ఐఏఎస్ అధికారి పి.సి. పరేఖ్ ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్’ అనే పుస్తకంలో నిజాం షుగర్స్ విషయం రాసినట్లు పత్రికల్లో చదివాను. మద్యం, ఏలేరు, తెల్గీ, నీరు-మీరు, పనికి ఆహార పథకం, ఐఎంజీ, ఎమ్మార్ కుంభకోణాల్లో చిక్కుకున్న చంద్రబాబు.. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని బతుకుతున్నారు’’ అని విమర్శించారు. మంగళవారం ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని 11 గ్రామాల్లో ఆమె ఎన్నికల రోడ్‌షో నిర్వహించారు. -
ఏమంటారు బాబూ!
సంపాదకీయం తొమ్మిదేళ్ల తన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ప్రకటనల మోత మోగిస్తున్న చంద్రబాబు నాయుడు ఖంగు తినేలా ఆయన నిర్వాకం మరోసారి బట్టబయలైంది. బాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల విభాగం బాధ్యతలను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీసీ పరేఖ్ తాజాగా వెలువరించిన ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?’ పుస్తకం నిజాం షుగర్స్‌ను బాబు తెగనమ్మిన తీరును సోదాహరణంగా వివరిం చింది. ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు ఎదురైన ఎన్నో అనుభవాలను ఆయన గ్రంథస్థం చేశారు. తనపై ఎవరు ఆరోపణలు చేసినా బాబు ఒకటే జవాబు చెబుతారు. ‘నాపై ఎన్నో విచారణలు జరిగాయి. ఒక్కదాన్లో కూడా నన్ను తప్పుబట్టలేదు. కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారు. అన్నీ కొట్టేశారు. ప్రభుత్వం ఎన్నో సభా సంఘాలను నియమించింది. ఏ ఒక్కటీ నన్ను దోషిగా చెప్పలేదు’ అంటారు. ఈ మాటలన్నిటిలోనూ అర్ధ సత్యాలూ, అసత్యాలూ ఉన్నాయని తరచు నిరూపణ అవుతూనే ఉన్నా ఆయన తన బాణీ మార్చరు. ఇప్పుడు పరేఖ్ పుస్తకం మరొక్కసారి బాబు మాటల్లోని డొల్లతనాన్ని వెల్లడించింది. నిజాం షుగర్స్ సంస్థ చరిత్ర చాలా ఉన్నతమైనది. 90 ఏళ్లనాటి ఆ సంస్థ లక్షలాదిమంది చెరకు రైతులపాలిట కల్పవల్లి. ఎన్నడో 1921లో బోధన్‌లో తొలి యూనిట్ మొదలయ్యాక ఇది ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలుగా విస్తరించింది. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమగా పేరుప్రఖ్యాతులున్నాయి. దీనికి నష్టాలొస్తున్నాయన్న సాకుతో 2002లో బాబు ప్రభుత్వం ప్రైవేటీకరిం చింది. నిజాం షుగర్స్ అమ్మకం వ్యవహారం గురించి నిజానికి 2004లోనే కాగ్ నిశితంగా విమర్శించింది. లక్షలాదిమంది రైతుల కల్పవల్లిగా ఉంటున్న ఈ సంస్థ క్రమేపీ నష్టాల్లోకి జారుకుంటున్నప్పుడు ఆదుకోవా ల్సిందిపోయి, పునరుద్ధరించాల్సిందిపోయి నష్టాల సాకుతో 1,042.27 ఎకరాలను కేవలం రూ. 3.35 కోట్లకు రాసి చ్చేసిన వైనాన్ని ఎండగట్టింది. అటు తర్వాత 2006లో సభా సంఘం సైతం యూనిట్ల అమ్మకంలో బాబు ప్రభుత్వం చేసిన మాయను గణాంకాల సహితంగా తూర్పారబట్టింది. రెండేళ్లపాటు విచారణ జరిపి రూపొందించిన విలువైన నివేదిక అది. నిజాం షుగర్స్ సంస్థ ఆస్తులను తెగనమ్మడంలో చాలా లొసుగు లున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడంలో బాబుకు దేశంలోనే ఎవరూ సాటిలేరని వామపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల ఉసురుతీసి వేలాదిమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను వీధులపాలు చేసిన ఘనత బాబుకు దక్కుతుందని వివిధ సందర్భాల్లో ఆ పార్టీలు తెలిపాయి. అయితే, నిజాం షుగర్స్‌ను అమ్మకానికి పెట్టిన తీరు ప్రపంచబ్యాంకు అధికారులకే కళ్లు తిరిగేలా చేసిందని సభా సంఘం వెల్లడించింది. వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు విక్రయించడా నికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఓపెన్ టెండర్ విధానంలో బిడ్లను ఆహ్వా నించి వచ్చిన ప్రతిపాదనల్లో మేలైనదేదన్న పరిశీలన చేస్తారు. అనంతరం నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వేరే పద్ధతి అనుసరించాలంటే అందుకు మంత్రివర్గం ఆమోదం అవసరమవుతుంది. కానీ, నిజాం షుగర్స్ విష యంలో బాబు ఈ క్రమానికి తూట్లు పొడిచారు. అనుకూలమైనవారితో కేబినెట్ సబ్ కమిటీ నియమించి, అడ్వొకేట్ జనరల్ సలహాను సైతం పెడచెవినబెట్టి తాను అనుకున్న వ్యక్తులకు బాబు కట్టబెట్టారు. ఈలోగా తమది ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారినా ఎవరికీ తెలియకుండా హడా వుడిగా భూముల్ని బదిలీచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఆరోజుల్లోనే రూ. 300 కోట్ల నష్టం జరిగిందని సభా సంఘం తేల్చింది. ఇప్పుడు ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలుంటుంది. పరేఖ్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకి ఏమీ కాదు. ఆర్ధికంగా భారంగా మారిన సంస్థలను అమ్మేస్తేనే ఆర్ధిక సాయం చేస్తామన్న ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఆయనకేమీ పేచీలేదు. అందువల్లే ‘అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక’ నిజాం షుగర్స్ యూనిట్లను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆయన నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రెండు మిల్లులనూ, ఒక డిస్టిలరీని అమ్మారు కూడా. ఆ మూడింటి విషయంలోనూ మెరుగైన ధర లభించిందని, అటు తర్వాతే బాబు సర్కారు జోక్యంతో వ్యవహారం వక్రమార్గంలోకి జారుకున్నదని పరేఖ్ చెబుతున్నారు. నష్టజాతక సంస్థలను అమ్మడమంటే వాటిపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలను వీధులపాలు చేయడమేనని ప్రజాస్వామిక సంస్థలు విశ్వసిస్తాయి. నష్టాలకు దారితీస్తున్న పరిస్థితులను నిజాయితీగా అధ్యయనంచేసి, తగిన చర్యలు తీసుకుంటే అలాంటి సంస్థలు మళ్లీ పునరుజ్జీవం పొంద డం సాధ్యమేనని చెబుతాయి. ఈ వాదనతో విభేదించే పరేఖ్వంటివారిని కూడా బాబు చర్యలు ఆశ్చర్యపరిచాయి. ఇందులోకి గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ హఠాత్తుగా చొరబడటం, నిబంధనల బాదరబందీ లేకుండా ఆస్తులన్నిటినీ ఆ సంస్థకు నామమాత్రపు ధరకు కట్టబెట్టడం ఆయనను దిగ్భ్రమపరిచింది. అసలు నిజాం షుగర్స్ సంస్థ నష్టాల్లోకి జారుకున్న తీరుపై విచారణ జరిపిస్తే ఇంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్క నిజాం షుగర్స్ అనే కాదు...రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు, ఒంగోలు, విశాఖ డెయిరీలు, ఆల్విన్ వంటి ఎన్నో సంస్థలు హఠాత్తుగా నష్టాల్లోకి జారుకుని నాశనమైపోయాయి. ఏ ప్రయోజనాలాశించి, ఎవరిని ఉద్ధరించడానికి వీటన్నిటి ఉసురూ తీశారో, లక్షలాదిమందిని రోడ్లపాలు చేశారో బాబు సంజాయిషీ ఇవ్వాలి. ‘ఆయనొస్తేనే ఉద్యోగాలొస్తాయండీ...’అని చానెళ్లలో ఊదరగొడుతున్నం దుకైనా తన సచ్చీలత ఏపాటిదో నిరూపించుకోవాలి. -
సంస్కరణలకు మసి పూశారు
నాటి బొగ్గు మంత్రులు సోరెన్, దాసరి అడ్డుకున్నారు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ ఆరోపణలు ప్రధాని తన మంత్రులను నియంత్రించలేకపోయారు ప్రభుత్వ సంస్థల సీఈఓలు, డెరైక్టర్లను ఎంపీలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు ప్రధాని అధికారాన్ని వినియోగించి ఉంటే స్కాం జరిగేది కాదు న్యూఢిల్లీ: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో తలపెట్టిన సంస్కరణలను.. ఆ శాఖ మంత్రులుగా పనిచేసిన శిబూసోరెన్, దాసరి నారాయణరావులు సహా పలువురు మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు అడ్డుకున్నారని.. ఆ సంస్కరణలు అమలైతే బొగ్గు కుంభకోణం జరగకుండా నిరోధించే అవకాశం ఉండేదని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేర్కొన్నారు. ‘‘బొగ్గు గనులకు బహిరంగ టెండర్లు పిలవాలన్న నా ప్రతిపాదనను ఈ ఇద్దరు మంత్రులూ తీవ్రంగా వ్యతిరేకించారు. నేను ప్రతిపాదించిన సంస్కరణల అమలుకు సంబంధించి దురదృష్టవశాత్తూ ప్రధానమంత్రి (మన్మోహన్సింగ్) తన మంత్రులను నియంత్రించలేకపోయారు’’ అని ఆయన చెప్పారు. 2005 డిసెంబర్లో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి పరేఖ్.. బొగ్గుశాఖ కార్యదర్శిగా తన అనుభవాలను ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్? - కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్స్ (ధర్మయుద్ధ సైనికుడా లేక కుట్రదారుడా? - బొగ్గు కుంభకోణం - ఇతర నిజాలు)’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ ఆవిష్కరించారు. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పరేఖ్‌ను కూడా నిందితుడిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. పుస్తకావిష్కరణ సందర్భంగా పరేఖ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బొగ్గు గనులను ఇంటర్నెట్ అధారిత వేలంలో పెట్టాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని మంత్రులు ఎలా తల్లకిందులు చేశారో చూశా. ప్రభుత్వ రంగ సంస్థలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, డెరైక్టర్లను ఎలా నియమించారో నేను మంత్రిత్వశాఖలో చూశాను. సీఈఓలు, డెరైక్టర్ల నియామకానికి బాహాటంగానే డబ్బులు అడిగారు. అధికారులను, ప్రభుత్వ సంస్థల సీఈఓలను ఎంపీలు బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు దండుకోవటం చూశా. ప్రభుత్వ అధికారులు నిజాయితీగా గౌరవప్రదంగా పనిచేయలేని పరిస్థితిని మనం కల్పించాం’’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ అధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఏ కొంచెమైనా సంస్కరణలు అమలు జరిగాయని చెప్పారు. ప్రధాని తన అధికారాన్ని వినియోగించినట్లయితే.. బొగ్గు కుంభకోణం జరిగేది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కుమారమంగళం బిర్లాతో కలిసి పరేఖ్ కుట్ర పన్నినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటం గురించి ప్రశ్నించగా.. ‘‘కుట్ర జరిగిందని సీబీఐ చెప్తోంది. కుట్ర జరగలేదని నేను చెప్పటం లేదు. అయితే.. కుట్ర జరిగిందీ అంటే.. అది నిర్ణయం తీసుకునే వ్యక్తుల మధ్య జరగాలి. తుది నిర్ణయం తీసుకున్నది ప్రధానమంత్రి. అంటే.. నేను కుట్రలో భాగస్వామిని అయితే.. ప్రధాని కూడా కుట్రలో భాగస్వామి కావాల్సి ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఈ పుస్తకం ఆవిష్కరించటం గురించి ప్రశ్నించగా.. ‘‘మన రాజకీయ వ్యవస్థ, సివిల్ సర్వీసెస్‌లలో పతనాన్ని గురించి నేనీ పుస్తకం రాశా’’ అని బదులిచ్చారు. పరేఖ్‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇస్తుంది: మాజీ కాగ్ ఇదిలావుంటే.. పరేఖ్‌కు బొగ్గు కుంభకోణంలో సీబీఐ క్లీన్ చిట్ ఇస్తుందని మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ అభిప్రాయపడ్డారు. పుస్తకావిష్కరణకు హాజరుకాలేకపోయిన ఆయన తన ప్రసంగాన్ని రాతపూర్వకంగా పంపించగా కార్యక్రమ నిర్వాహకులు చదివి వినిపించారు. ‘బొగ్గు శాఖకు చెందిన ఫైళ్లన్నిటినీ నేను పరిశీలించాను. పరేఖ్‌కు సంబంధించి ఎలాంటి నేరపూరిత ఉద్దేశమూ లేదు. పెద్ద చేపలు తప్పించుకుంటాయి. కొద్ది మంది నిజాయితీ అధికారులు మాత్రం వేధింపులకు గురవుతారు. అయినా.. వ్యవస్థపై నాకు నమ్మకముంది. సీబీఐ దర్యాప్తు పూర్తిచేశాక పరేఖ్‌పై నేరపూరిత ఉద్దేశాలు మోపజాలమన్న నిర్ధారణకు వస్తారని నేను విశ్వసిస్తున్నా’అని అన్నారు. ప్రధాని పారదర్శకంగా చేశారు: కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌కు తన మంత్రివర్గంలోని మంత్రులపై నియంత్రణ లేదంటూ పరేఖ్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. బొగ్గు గనుల కేటాయింపులను మన్మోహన్ మరింత పారదర్శకం చేశారని, ఈ విషయంలో ఐదుగురు కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొన్నారని ప్రధానిని సమర్థించింది. పరేఖ్ రాసిన పుస్తకాన్ని తాము ఇంకా చదవలేదని, దానిని అధ్యయనం చేశాక స్పందిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సూర్జేవాలా మీడియాతో పేర్కొన్నారు. సోనియా, రాహుల్ బదులివ్వాలి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాజకీయ అధికారం నామమాత్రమేనంటూ.. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు సంజయ్‌బారులు తమ పుస్తకాల్లో వెల్లడించిన అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మేం ఇప్పటివరకూ చెప్తున్న విషయాన్నే ఈ రెండు పుస్తకాలూ పునరుద్ఘాటించాయి. ఈ ప్రశ్నలకు బదులిచ్చే బాధ్యత నుంచి ఆ కుటుంబం తప్పించుకో జాల దు. పరేఖ్, బారులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయమిది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు సమాధానం చెప్పితీరాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలు గత పదేళ్లలో దేశాన్ని నాశనం చేశాయన్నారు. -
ప్రధానీ కుట్రదారే
* బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ సంచలన వ్యాఖ్యలు * మన్మోహన్‌ను కూడా బొగ్గు కేసులో చేర్చాలని డిమాండ్ * కేటాయింపుల్లో అక్రమాలు జరగలేదు: ‘సాక్షి’తో పరేఖ్ * నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా * ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ * హిందాల్కో సంస్థలో రూ. 25 కోట్లు స్వాధీనం! సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీకార్యదర్శి పీసీ పరేఖ్, ప్రధాని మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనన్నారు. ఆ శాఖను నిర్వహించిన మన్మోహన్‌నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘గనుల కేటాయింపు నేను ఒక్కడినే తీసుకున్న నిర్ణయం కాదు. బొగ్గు గనుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాన్నే ప్రభుత్వానికి సిఫార్సు చేశాను. ప్రధాని కార్యాలయం, అప్పటి బొగ్గు శాఖ మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ దాన్ని ఆమోదించారు. గనుల కేటాయింపులో ఆయనదే తుది నిర్ణయం. గనుల కోసం దరఖాస్తు చేసుకున్న కుమార మంగళం బిర్లా, సిఫార్సు చేసిన నేను.. ఇద్దరమూ కుట్రలో భాగస్వాములం అయితే, నా సిఫార్సుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి మూడో కుట్రదారుడు అవుతారు’ అని పరేఖ్ చెప్పారు. కేటాయింపులో కుట్ర జరిగిందని భావిస్తే ముగ్గుర్నీ దోషులుగానే పరిగణించాలన్నారు. అసలు కుట్రలో ప్రధాన భాగస్వామిగా కచ్చితంగా ప్రధానిని చేర్చాలని చెప్పారు. ఎందుకంటే తాను ప్రతిపాదన చేసినా.. ఆ శాఖ మంత్రిగా తుది సంతకం చేసే అధికారం మన్మోహన్‌కు ఉందన్నారు. నచ్చకపోతే ఆయన తిరస్కరించవచ్చని చెప్పారు. అయినా ప్రధానిని వదిలేసి తనను, బిర్లాను మాత్రమే ఎందుకు కుట్రదారులుగా చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో లోతైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలని సీబీఐని డిమాండ్ చేశారు. ‘దర్యాప్తులో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను’ అని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని పరేఖ్‌ను నిందితునిగా చేరుస్తూ అవినీతి నిరోధక చట్టాల ప్రకారం సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎనిదేళ్ల క్రితం ఆ కేటాయింపు నిష్పాక్షికంగా జరిగిందని పరేఖ్ వివరించారు. ఒడిశాలోని బొగ్గు గని కోసం అప్పట్లో హిందాల్కో, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ దరఖాస్తు చేసుకున్నాయని, ప్రభుత్వ కంపెనీ నైవేలీకి గని కేటాయించాలని బొగ్గు శాఖ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. తాము మొదట దరఖాస్తు చేసుకున్నందుకు గని తమకే కేటాయించాలిన బిర్లా కంపెనీ ప్రధానికి విజ్ఞప్తి చేసిందని ఆయన వెల్లడించారు. అప్పుడు తాను నైవేలీ, హిందాల్కోలను జాయింట్ వెంచర్‌గా రూపొందించాలని ప్రధానికి ప్రతిపాదించగా దానికి ఆయన అంగీకరించారన్నారు. కేటాయింపుల్లో ఇంత స్పష్టత ఉన్నపుడు ఈ కేసు నుంచి ప్రధానిని ఎందుకు తప్పించారో సీబీఐని అడగాలని కోరారు. అయితే తాము నిష్పాక్షికంగా, సరియైన నిర్ణయమే తీసుకున్నప్పటికీ.. దానిలో కుట్ర దాగుందని సీబీఐ ఎందుకు భావిస్తోందో తనకు అర్థం కావడంలేదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి పీఎంవో నుంచి ఏ విధమైన ఒత్తిళ్లు రాలేదని తెలిపారు. అయితే అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు చేతుల మీదుగానే దస్త్రాలన్నీ వెళ్లాయని, ఆయన పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని పరేఖ్ కోరారు. అయితే పరేఖ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పరేఖ్ తన వాదనను సీబీఐ ముందు వినిపించాలని చెప్పారు. పరేఖ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం అవుతాయని మంత్రి మనీశ్ తివారీ తెలిపారు. కాగా, మహానది కోల్‌ఫీల్డ్స్, నైవేలీ లిగ్నైట్‌కు తలాబిరా 2, 3 గనులు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత కుమార మంగళం బిర్లా, పరేఖ్‌ను కలిశారని, అనంతరం నిర్ణయంలో మార్పు జరిగిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీనిలో పరేఖ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. హిందాల్కో సంస్థలో సోదాలు చేసిన సీబీఐకి లెక్కల్లో చూపని రూ. 25 కోట్లు లభించాయని సమాచారం. ఢిల్లీలోని యూకో బ్యాంకు బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో సోదాలు చేసిన సీబీఐ డబ్బుతో పాటు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి తదుపరి విచారణకు ఇన్‌కం ట్యాక్స్‌కు కేసు బదిలీ చేసింది. ప్రధాని రాజీనామా చేయాలి: బీజేపీ బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్రపై ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానికి కూడా పాత్ర ఉందని పరేఖ్ విమర్శించడంపై తామేమీ ఆశ్చర్చపోలేదని, ప్రతీ ఫైలు ఆయన కనుసన్నల్లోంచే బయటకి వెళ్లాలి కాబట్టి ఈ స్కాంలో ఆయన పాత్ర కాదనలేనిదని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. పరేఖ్ ప్రతిపాదనలను ప్రభుత్వం కావాలనే పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులు జరిగిన సమయంలో ఆ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావుపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదనే సందేహం వ్యక్తం చేశారు. ప్రధానిని కూడా కుట్రదారుగానే పరిగణించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. బిర్లాపై కేసు దురదృష్టకరం: ఆనంద్ శర్మ కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చడం దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్య దేశంలో పెట్టుబడులు పెట్టే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుందని చెప్పారు. ఇటువంటి కఠిన చర్యలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని మరో మంత్రి రాజేశ్ పైలట్ అన్నారు. ప్రధానిపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలపై మరో మంత్రి మనీశ్ తివారీ ఎదురు దాడికి దిగారు. మన్మోహన్పై విమర్శలు చేస్తూ బీజేపీ సెల్ఫ్ ఫైరింగ్ చేసుకుంటోందని విమర్శించారు.