సంస్కరణలకు మసి పూశారు | Soot reforms | Sakshi
Sakshi News home page

సంస్కరణలకు మసి పూశారు

Published Tue, Apr 15 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

సంస్కరణలకు మసి పూశారు

సంస్కరణలకు మసి పూశారు

నాటి బొగ్గు మంత్రులు సోరెన్, దాసరి అడ్డుకున్నారు  బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ ఆరోపణలు
 
 ప్రధాని తన మంత్రులను నియంత్రించలేకపోయారు
 ప్రభుత్వ సంస్థల సీఈఓలు, డెరైక్టర్లను ఎంపీలు బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు
 ప్రధాని అధికారాన్ని వినియోగించి ఉంటే స్కాం జరిగేది కాదు

 
 న్యూఢిల్లీ: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో తలపెట్టిన సంస్కరణలను.. ఆ శాఖ మంత్రులుగా పనిచేసిన శిబూసోరెన్, దాసరి నారాయణరావులు సహా పలువురు మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు అడ్డుకున్నారని.. ఆ సంస్కరణలు అమలైతే బొగ్గు కుంభకోణం జరగకుండా నిరోధించే అవకాశం ఉండేదని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేర్కొన్నారు. ‘‘బొగ్గు గనులకు బహిరంగ టెండర్లు పిలవాలన్న నా ప్రతిపాదనను ఈ ఇద్దరు మంత్రులూ తీవ్రంగా వ్యతిరేకించారు. నేను ప్రతిపాదించిన సంస్కరణల అమలుకు సంబంధించి దురదృష్టవశాత్తూ ప్రధానమంత్రి (మన్మోహన్‌సింగ్) తన మంత్రులను నియంత్రించలేకపోయారు’’ అని ఆయన చెప్పారు. 2005 డిసెంబర్‌లో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి పరేఖ్.. బొగ్గుశాఖ కార్యదర్శిగా తన అనుభవాలను ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్? - కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్స్ (ధర్మయుద్ధ సైనికుడా లేక కుట్రదారుడా? - బొగ్గు కుంభకోణం - ఇతర నిజాలు)’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ ఆవిష్కరించారు. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పరేఖ్‌ను కూడా నిందితుడిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే.

పుస్తకావిష్కరణ సందర్భంగా పరేఖ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బొగ్గు గనులను ఇంటర్‌నెట్ అధారిత వేలంలో పెట్టాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని మంత్రులు ఎలా తల్లకిందులు చేశారో చూశా. ప్రభుత్వ రంగ సంస్థలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, డెరైక్టర్లను ఎలా నియమించారో నేను మంత్రిత్వశాఖలో చూశాను. సీఈఓలు, డెరైక్టర్ల నియామకానికి బాహాటంగానే డబ్బులు అడిగారు. అధికారులను, ప్రభుత్వ సంస్థల సీఈఓలను ఎంపీలు బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు దండుకోవటం చూశా. ప్రభుత్వ అధికారులు నిజాయితీగా గౌరవప్రదంగా పనిచేయలేని పరిస్థితిని మనం కల్పించాం’’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ అధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఏ కొంచెమైనా సంస్కరణలు అమలు జరిగాయని చెప్పారు. ప్రధాని తన అధికారాన్ని వినియోగించినట్లయితే.. బొగ్గు కుంభకోణం జరిగేది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కుమారమంగళం బిర్లాతో కలిసి పరేఖ్ కుట్ర పన్నినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం గురించి ప్రశ్నించగా.. ‘‘కుట్ర జరిగిందని సీబీఐ చెప్తోంది. కుట్ర జరగలేదని నేను చెప్పటం లేదు. అయితే.. కుట్ర జరిగిందీ అంటే.. అది నిర్ణయం తీసుకునే వ్యక్తుల మధ్య జరగాలి. తుది నిర్ణయం తీసుకున్నది ప్రధానమంత్రి. అంటే.. నేను కుట్రలో భాగస్వామిని అయితే.. ప్రధాని కూడా కుట్రలో భాగస్వామి కావాల్సి ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఈ పుస్తకం ఆవిష్కరించటం గురించి ప్రశ్నించగా.. ‘‘మన రాజకీయ వ్యవస్థ, సివిల్ సర్వీసెస్‌లలో పతనాన్ని గురించి నేనీ పుస్తకం రాశా’’ అని బదులిచ్చారు.
 
పరేఖ్‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇస్తుంది: మాజీ కాగ్


 ఇదిలావుంటే.. పరేఖ్‌కు బొగ్గు కుంభకోణంలో సీబీఐ క్లీన్ చిట్ ఇస్తుందని మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ అభిప్రాయపడ్డారు. పుస్తకావిష్కరణకు హాజరుకాలేకపోయిన ఆయన తన ప్రసంగాన్ని రాతపూర్వకంగా పంపించగా కార్యక్రమ నిర్వాహకులు చదివి వినిపించారు. ‘బొగ్గు శాఖకు చెందిన ఫైళ్లన్నిటినీ నేను పరిశీలించాను. పరేఖ్‌కు సంబంధించి ఎలాంటి నేరపూరిత ఉద్దేశమూ లేదు. పెద్ద చేపలు తప్పించుకుంటాయి. కొద్ది మంది నిజాయితీ అధికారులు మాత్రం వేధింపులకు గురవుతారు. అయినా.. వ్యవస్థపై నాకు నమ్మకముంది. సీబీఐ దర్యాప్తు పూర్తిచేశాక పరేఖ్‌పై నేరపూరిత ఉద్దేశాలు మోపజాలమన్న నిర్ధారణకు వస్తారని నేను విశ్వసిస్తున్నా’అని అన్నారు.

 ప్రధాని పారదర్శకంగా చేశారు: కాంగ్రెస్

 ప్రధాని మన్మోహన్‌కు తన మంత్రివర్గంలోని మంత్రులపై నియంత్రణ లేదంటూ పరేఖ్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. బొగ్గు గనుల కేటాయింపులను మన్మోహన్ మరింత పారదర్శకం చేశారని, ఈ విషయంలో ఐదుగురు కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొన్నారని ప్రధానిని సమర్థించింది. పరేఖ్ రాసిన పుస్తకాన్ని తాము ఇంకా చదవలేదని, దానిని అధ్యయనం చేశాక స్పందిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సూర్జేవాలా మీడియాతో పేర్కొన్నారు.
 
 సోనియా, రాహుల్ బదులివ్వాలి


 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాజకీయ అధికారం నామమాత్రమేనంటూ.. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు సంజయ్‌బారులు తమ పుస్తకాల్లో వెల్లడించిన అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మేం ఇప్పటివరకూ చెప్తున్న విషయాన్నే ఈ రెండు పుస్తకాలూ పునరుద్ఘాటించాయి. ఈ ప్రశ్నలకు బదులిచ్చే బాధ్యత నుంచి ఆ కుటుంబం తప్పించుకో జాల దు. పరేఖ్, బారులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయమిది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు సమాధానం చెప్పితీరాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలు గత పదేళ్లలో దేశాన్ని నాశనం చేశాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement