దాసరి జయంతి సందర్భంగా కేక్ కట్ చేస్తున్న దృశ్యం
‘‘నరసింహారావుగారు (దర్శకుడు) మాట్లాడి, దాసరిగారి పేరిట రామ సత్యనారాయణ ఓ ఈవెంట్ చేశారు. రేపు మేం చేయబోతున్నాం అన్నారు. నేనేం అంటున్నానంటే... వచ్చే ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫున దాసరిగారి జయంతిని అందరూ ఒక్కటై, ఒకే వేడుకలా జరుపుకునేలా ΄్లాన్ చేద్దాం. బయటివాళ్లు కావాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.
ఇండస్ట్రీలో వేరు వేరు కుంపట్లు పెట్టి, గురువు (దాసరి నారాయణరావు) గారి పేరుని మనం చెడగొట్టొద్దు. గురువుగారి పేరును నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగాల్సింది.
కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ తేదీని ఈ నెల 19కి మార్చామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ వేడుక కొత్త తేదీ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా సినీ కార్మికుల సంక్షేమంలో టాలీవుడ్ నంబర్ వన్‌గా ఉందంటే కారణం దాసరిగారే’’ అన్నారు సి. కల్యాణ్.
‘‘డైరెక్టర్స్ డే ఈవెంట్ సక్సెస్ కావడానికి శ్రమిస్తున్న యువ దర్శకులకు ధన్యవాదాలు’’ అన్నారు వీరశంకర్. ‘‘దాసరిగారి పేరిట రామసత్యనారాయణ ఈవెంట్ చేశారు. మే 5న మేం చేస్తున్నాం. దర్శకుల సంఘం చేయనున్న ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు రేలంగి నరసింహారావు. నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకులు ఎన్. శంకర్, సముద్ర, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment