ప్రధానీ కుట్రదారే | Coalgate scam: PM should be the first accused, says PC Parekh | Sakshi
Sakshi News home page

ప్రధానీ కుట్రదారే

Published Thu, Oct 17 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

ప్రధానీ కుట్రదారే

ప్రధానీ కుట్రదారే

* బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ సంచలన వ్యాఖ్యలు
* మన్మోహన్‌ను కూడా బొగ్గు కేసులో చేర్చాలని డిమాండ్
* కేటాయింపుల్లో అక్రమాలు జరగలేదు: ‘సాక్షి’తో పరేఖ్
* నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా
* ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
* హిందాల్కో సంస్థలో రూ. 25 కోట్లు స్వాధీనం!
 
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీకార్యదర్శి పీసీ పరేఖ్, ప్రధాని మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనన్నారు. ఆ శాఖను నిర్వహించిన మన్మోహన్‌నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

‘‘గనుల కేటాయింపు నేను ఒక్కడినే తీసుకున్న నిర్ణయం కాదు. బొగ్గు గనుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాన్నే ప్రభుత్వానికి సిఫార్సు చేశాను. ప్రధాని కార్యాలయం, అప్పటి బొగ్గు శాఖ మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ దాన్ని ఆమోదించారు. గనుల కేటాయింపులో ఆయనదే తుది నిర్ణయం. గనుల కోసం దరఖాస్తు చేసుకున్న కుమార మంగళం బిర్లా, సిఫార్సు చేసిన నేను.. ఇద్దరమూ కుట్రలో భాగస్వాములం అయితే, నా సిఫార్సుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి మూడో కుట్రదారుడు అవుతారు’ అని పరేఖ్ చెప్పారు.

కేటాయింపులో కుట్ర జరిగిందని భావిస్తే ముగ్గుర్నీ దోషులుగానే పరిగణించాలన్నారు. అసలు కుట్రలో ప్రధాన భాగస్వామిగా కచ్చితంగా ప్రధానిని చేర్చాలని చెప్పారు. ఎందుకంటే తాను ప్రతిపాదన చేసినా.. ఆ శాఖ మంత్రిగా తుది సంతకం చేసే అధికారం మన్మోహన్‌కు ఉందన్నారు. నచ్చకపోతే ఆయన తిరస్కరించవచ్చని చెప్పారు. అయినా ప్రధానిని వదిలేసి తనను, బిర్లాను మాత్రమే ఎందుకు కుట్రదారులుగా చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో లోతైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలని సీబీఐని డిమాండ్ చేశారు. ‘దర్యాప్తులో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను’ అని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని పరేఖ్‌ను నిందితునిగా చేరుస్తూ అవినీతి నిరోధక చట్టాల ప్రకారం సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు  చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎనిదేళ్ల క్రితం ఆ కేటాయింపు నిష్పాక్షికంగా జరిగిందని పరేఖ్ వివరించారు. ఒడిశాలోని బొగ్గు గని కోసం అప్పట్లో హిందాల్కో, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ దరఖాస్తు చేసుకున్నాయని, ప్రభుత్వ కంపెనీ నైవేలీకి గని కేటాయించాలని బొగ్గు శాఖ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు.

తాము మొదట దరఖాస్తు చేసుకున్నందుకు గని తమకే కేటాయించాలిన బిర్లా కంపెనీ ప్రధానికి విజ్ఞప్తి చేసిందని ఆయన వెల్లడించారు. అప్పుడు తాను నైవేలీ, హిందాల్కోలను జాయింట్ వెంచర్‌గా రూపొందించాలని ప్రధానికి ప్రతిపాదించగా దానికి ఆయన అంగీకరించారన్నారు. కేటాయింపుల్లో ఇంత స్పష్టత ఉన్నపుడు ఈ కేసు నుంచి ప్రధానిని ఎందుకు తప్పించారో సీబీఐని అడగాలని కోరారు. అయితే తాము నిష్పాక్షికంగా, సరియైన నిర్ణయమే తీసుకున్నప్పటికీ.. దానిలో కుట్ర దాగుందని సీబీఐ ఎందుకు భావిస్తోందో తనకు అర్థం కావడంలేదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి పీఎంవో నుంచి ఏ విధమైన ఒత్తిళ్లు రాలేదని తెలిపారు. అయితే అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు చేతుల మీదుగానే దస్త్రాలన్నీ వెళ్లాయని, ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని పరేఖ్ కోరారు. అయితే పరేఖ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పరేఖ్ తన వాదనను సీబీఐ ముందు వినిపించాలని చెప్పారు. పరేఖ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం అవుతాయని మంత్రి మనీశ్ తివారీ తెలిపారు.

కాగా, మహానది కోల్‌ఫీల్డ్స్, నైవేలీ లిగ్నైట్‌కు తలాబిరా 2, 3 గనులు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత కుమార మంగళం బిర్లా, పరేఖ్‌ను కలిశారని, అనంతరం నిర్ణయంలో మార్పు జరిగిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దీనిలో పరేఖ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. హిందాల్కో సంస్థలో సోదాలు చేసిన సీబీఐకి లెక్కల్లో చూపని రూ. 25 కోట్లు లభించాయని సమాచారం. ఢిల్లీలోని యూకో బ్యాంకు బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో సోదాలు చేసిన సీబీఐ డబ్బుతో పాటు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి తదుపరి విచారణకు ఇన్‌కం ట్యాక్స్‌కు కేసు బదిలీ చేసింది.
 
ప్రధాని రాజీనామా చేయాలి: బీజేపీ
బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్రపై ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానికి కూడా పాత్ర ఉందని పరేఖ్ విమర్శించడంపై తామేమీ ఆశ్చర్చపోలేదని, ప్రతీ ఫైలు ఆయన కనుసన్నల్లోంచే బయటకి వెళ్లాలి కాబట్టి ఈ స్కాంలో ఆయన పాత్ర కాదనలేనిదని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. పరేఖ్ ప్రతిపాదనలను ప్రభుత్వం కావాలనే పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్  విమర్శించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులు జరిగిన సమయంలో ఆ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావుపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదనే సందేహం వ్యక్తం చేశారు. ప్రధానిని కూడా కుట్రదారుగానే పరిగణించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.  
 
బిర్లాపై కేసు దురదృష్టకరం: ఆనంద్ శర్మ
కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్య దేశంలో పెట్టుబడులు పెట్టే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుందని చెప్పారు. ఇటువంటి కఠిన చర్యలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని మరో మంత్రి రాజేశ్ పైలట్ అన్నారు. ప్రధానిపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలపై మరో మంత్రి మనీశ్ తివారీ ఎదురు దాడికి దిగారు. మన్మోహన్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ సెల్ఫ్ ఫైరింగ్ చేసుకుంటోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement