సంపాదకీయం
తొమ్మిదేళ్ల తన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ప్రకటనల మోత మోగిస్తున్న చంద్రబాబు నాయుడు ఖంగు తినేలా ఆయన నిర్వాకం మరోసారి బట్టబయలైంది. బాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల విభాగం బాధ్యతలను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీసీ పరేఖ్ తాజాగా వెలువరించిన ‘క్రూసేడర్ ఆర్ కాన్‌స్పిరేటర్?’ పుస్తకం నిజాం షుగర్స్‌ను బాబు తెగనమ్మిన తీరును సోదాహరణంగా వివరిం చింది. ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు ఎదురైన ఎన్నో అనుభవాలను ఆయన గ్రంథస్థం చేశారు. తనపై ఎవరు ఆరోపణలు చేసినా బాబు ఒకటే జవాబు చెబుతారు. ‘నాపై ఎన్నో విచారణలు జరిగాయి. ఒక్కదాన్లో కూడా నన్ను తప్పుబట్టలేదు. కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారు. అన్నీ కొట్టేశారు. ప్రభుత్వం ఎన్నో సభా సంఘాలను నియమించింది. ఏ ఒక్కటీ నన్ను దోషిగా చెప్పలేదు’ అంటారు. ఈ మాటలన్నిటిలోనూ అర్ధ సత్యాలూ, అసత్యాలూ ఉన్నాయని తరచు నిరూపణ అవుతూనే ఉన్నా ఆయన తన బాణీ మార్చరు. ఇప్పుడు పరేఖ్ పుస్తకం మరొక్కసారి బాబు మాటల్లోని డొల్లతనాన్ని వెల్లడించింది.
నిజాం షుగర్స్ సంస్థ చరిత్ర చాలా ఉన్నతమైనది. 90 ఏళ్లనాటి ఆ సంస్థ లక్షలాదిమంది చెరకు రైతులపాలిట కల్పవల్లి. ఎన్నడో 1921లో బోధన్‌లో తొలి యూనిట్ మొదలయ్యాక ఇది ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలుగా విస్తరించింది. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమగా పేరుప్రఖ్యాతులున్నాయి. దీనికి నష్టాలొస్తున్నాయన్న సాకుతో 2002లో బాబు ప్రభుత్వం ప్రైవేటీకరిం చింది. నిజాం షుగర్స్ అమ్మకం వ్యవహారం గురించి నిజానికి 2004లోనే కాగ్ నిశితంగా విమర్శించింది. లక్షలాదిమంది రైతుల కల్పవల్లిగా ఉంటున్న ఈ సంస్థ క్రమేపీ నష్టాల్లోకి జారుకుంటున్నప్పుడు ఆదుకోవా ల్సిందిపోయి, పునరుద్ధరించాల్సిందిపోయి నష్టాల సాకుతో 1,042.27 ఎకరాలను కేవలం రూ. 3.35 కోట్లకు రాసి చ్చేసిన వైనాన్ని ఎండగట్టింది. అటు తర్వాత 2006లో సభా సంఘం సైతం యూనిట్ల అమ్మకంలో బాబు ప్రభుత్వం చేసిన మాయను గణాంకాల సహితంగా తూర్పారబట్టింది. రెండేళ్లపాటు విచారణ జరిపి రూపొందించిన విలువైన నివేదిక అది.
నిజాం షుగర్స్ సంస్థ ఆస్తులను తెగనమ్మడంలో చాలా లొసుగు లున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడంలో బాబుకు దేశంలోనే ఎవరూ సాటిలేరని వామపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల ఉసురుతీసి వేలాదిమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను వీధులపాలు చేసిన ఘనత బాబుకు దక్కుతుందని వివిధ సందర్భాల్లో ఆ పార్టీలు తెలిపాయి. అయితే, నిజాం షుగర్స్‌ను అమ్మకానికి పెట్టిన తీరు ప్రపంచబ్యాంకు అధికారులకే కళ్లు తిరిగేలా చేసిందని సభా సంఘం వెల్లడించింది. వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు విక్రయించడా నికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఓపెన్ టెండర్ విధానంలో బిడ్లను ఆహ్వా నించి వచ్చిన ప్రతిపాదనల్లో మేలైనదేదన్న పరిశీలన చేస్తారు. అనంతరం నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వేరే పద్ధతి అనుసరించాలంటే అందుకు మంత్రివర్గం ఆమోదం అవసరమవుతుంది. కానీ, నిజాం షుగర్స్ విష యంలో బాబు ఈ క్రమానికి తూట్లు పొడిచారు. అనుకూలమైనవారితో కేబినెట్ సబ్ కమిటీ నియమించి, అడ్వొకేట్ జనరల్ సలహాను సైతం పెడచెవినబెట్టి తాను అనుకున్న వ్యక్తులకు బాబు కట్టబెట్టారు. ఈలోగా తమది ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారినా ఎవరికీ తెలియకుండా హడా వుడిగా భూముల్ని బదిలీచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఆరోజుల్లోనే రూ. 300 కోట్ల నష్టం జరిగిందని సభా సంఘం తేల్చింది. ఇప్పుడు ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలుంటుంది.
పరేఖ్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకి ఏమీ కాదు. ఆర్ధికంగా భారంగా మారిన సంస్థలను అమ్మేస్తేనే ఆర్ధిక సాయం చేస్తామన్న ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఆయనకేమీ పేచీలేదు. అందువల్లే ‘అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక’ నిజాం షుగర్స్ యూనిట్లను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆయన నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రెండు మిల్లులనూ, ఒక డిస్టిలరీని అమ్మారు కూడా. ఆ మూడింటి విషయంలోనూ మెరుగైన ధర లభించిందని, అటు తర్వాతే బాబు సర్కారు జోక్యంతో వ్యవహారం వక్రమార్గంలోకి జారుకున్నదని పరేఖ్ చెబుతున్నారు. నష్టజాతక సంస్థలను అమ్మడమంటే వాటిపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలను వీధులపాలు చేయడమేనని ప్రజాస్వామిక సంస్థలు విశ్వసిస్తాయి. నష్టాలకు దారితీస్తున్న పరిస్థితులను నిజాయితీగా అధ్యయనంచేసి, తగిన చర్యలు తీసుకుంటే అలాంటి సంస్థలు మళ్లీ పునరుజ్జీవం పొంద డం సాధ్యమేనని చెబుతాయి. ఈ వాదనతో విభేదించే పరేఖ్‌వంటివారిని కూడా బాబు చర్యలు ఆశ్చర్యపరిచాయి.
ఇందులోకి గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ హఠాత్తుగా చొరబడటం, నిబంధనల బాదరబందీ లేకుండా ఆస్తులన్నిటినీ ఆ సంస్థకు నామమాత్రపు ధరకు కట్టబెట్టడం ఆయనను దిగ్భ్రమపరిచింది. అసలు నిజాం షుగర్స్ సంస్థ నష్టాల్లోకి జారుకున్న తీరుపై విచారణ జరిపిస్తే ఇంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్క నిజాం షుగర్స్ అనే కాదు...రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు, ఒంగోలు, విశాఖ డెయిరీలు, ఆల్విన్ వంటి ఎన్నో సంస్థలు హఠాత్తుగా నష్టాల్లోకి జారుకుని నాశనమైపోయాయి. ఏ ప్రయోజనాలాశించి, ఎవరిని ఉద్ధరించడానికి వీటన్నిటి ఉసురూ తీశారో, లక్షలాదిమందిని రోడ్లపాలు చేశారో బాబు సంజాయిషీ ఇవ్వాలి. ‘ఆయనొస్తేనే ఉద్యోగాలొస్తాయండీ...’అని చానెళ్లలో ఊదరగొడుతున్నం దుకైనా తన సచ్చీలత ఏపాటిదో నిరూపించుకోవాలి.
ఏమంటారు బాబూ!
Published Wed, Apr 16 2014 1:51 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement