సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూత పడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) ఆస్తులను విక్రయించి బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయి లు చెల్లించాల్సిందిగా సుమారు నాలుగున్నర ఏళ్ల క్రితం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) తీర్పుని చ్చింది. నిజాం షుగర్స్ పునరుద్ధర ణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్ర యం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేదని గతంలోనే స్పష్టం చేసింది.
ఎన్‌సీఎల్‌టీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా ఏళ్ల తరబడి నిజాం దక్కన్ షుగర్స్ భవితవ్యం కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్‌డీఎస్‌ఎల్‌ను తిరిగి తెరిపిస్తామంటూ ‘పునరుద్ధరణ కమిటీ’ని ప్రకటించింది.
ఈ కమిటీలో మరో మంత్రి దామోదర రాజనర్సింహ సహ చైర్మన్‌గా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్‌తో పాటు ఆర్థిక, పరిశ్రమ లు, వ్యవసాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ను తిరిగి తెరవడం లక్ష్యంగా ఏర్పాటైన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేర ఫలిస్తాయనే చర్చ జరుగుతోంది.
చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరం
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటైన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్‌ఎస్‌ఎల్) 1990వ దశకం నాటికి నష్టాల బాట పట్టింది. నష్టాల నుంచి నిజాం షుగర్స్‌ను గట్టెక్కిస్తామనే నెపంతో 2002లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 51 శాతం వాటాను డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. దీంతో దశాబ్దాల తరబడి ఎన్‌ఎస్‌ఎల్‌గా పేరొందిన నిజాం షుగర్స్ ఎన్‌డీఎస్‌ఎల్‌గా పేరు మార్చుకుంది.
ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా అప్పగించడంపై అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఎన్‌డీఎస్‌ఎల్‌ను మూసివేస్తున్నట్లు 2015 డిసెంబర్‌లో యాజమాన్యం ప్రకటించింది. పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.
అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్‌డీఎస్‌ఎల్‌ను నడిపేందుకు 2015 ఏప్రిల్‌లో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డెల్టా పేపర్ మిల్లుకు చెందిన 51 శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా జీఓఎంఎస్ 28ను కూడా జారీ చేసింది.
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఎన్‌డీఎస్‌ఎల్
అప్పులు పెరిగినందున దివాలా పరిశ్రమగా గుర్తించాలని ఎన్‌డీఎస్‌ఎల్ 2017లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించాలని కోరడంతో రుణదాతలతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్‌సీఎల్‌టీ లిక్విడేటర్‌ను కూడా నియమించింది. 2017 అక్టోబర్ నుంచి 2018 సెపె్టంబర్ వర కు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలే దు.
పరిశ్రమ కొనుగోలుకు ముందుకు వ చ్చిన కొన్ని సంస్థలు ఎన్‌డీఎస్‌ఎల్ ఆస్తులు, అప్పులు పరిశీలించి వెనకడుగు వేశాయి. నాలుగున్నరేళ్ల క్రితం సంస్థకు రూ.360 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ కూడా అంతే ఉన్నట్లు తేలింది. సంస్థ పునరుద్ధరణ, అమ్మకం ప్రయత్నాలు కొలి క్కి రాకపోవడంతో ఎన్‌సీఎల్‌టీ లిక్విడేషన్‌కు అనుమతిచ్చింది.
ఎన్‌సీఎల్‌టీ తీర్పుపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఎన్‌డీఎస్‌ఎల్‌పై ఇప్పటికే హౌజ్‌కమిటీ, కార్యదర్శుల కమిటీ వంటివి ఏర్పాటైనా సంస్థ మనుగడపై స్పష్టత ఇవ్వ లేకపోయాయి. ఈ నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్‌ను పునరుద్ధరిస్తామంటూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment