బోధన్: ‘‘లాభాల్లో నడిచే నిజాం షుగర్స్‌ను ప్రైవేటీకరించి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నాడు, అలాంటి పరిస్థితి మీకు (ఎన్డీఎస్‌ఎల్ ప్రైవేట్ యాజమాన్యం) రావాలని కోరుకోవడం లేదు.. ఎన్డీఎస్‌ఎల్(నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్) లేఆఫ్ నుంచి రావాల్సిన బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించండి’’అని కార్మికులు డిమాండ్ చేశారు. ఒక్కసారిగా బాబు ప్రస్తావన విని ఎన్డీఎస్‌ఎల్ సీఈవో సుబ్బరాజు, పర్సనల్ ఆఫీసర్ శ్రీధర్‌రాజు, స్థానిక అధికారి రమేష్ అవాక్కయ్యారు.
ఫ్యాక్టరీ మూసివేత వల్ల తమ జీవితాలు అన్యాయమయ్యాయని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని, బిచ్చమెత్తుకుని బతకాల్సిన దుస్థితి వచ్చిందని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల వేతన, ఇతర బకాయిల చెల్లింపునకు సంబంధించి సెటిల్‌మెంట్ చేసేందుకు ఎన్డీఎస్‌ఎల్ అధికారులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఫ్యాక్టరీలో సమావేశం నిర్వహించారు. బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీల కార్మికులు హాజరయ్యా రు. 2015 డిసెంబర్ 23న ప్రైవేట్ యాజమాన్యం బోధన్, ముత్యంపేట(జగిత్యాల), ముంబోజిపల్లి (మెదక్) యూనిట్లను మూసివేసిన విషయం తెలిసిందే.
రాతపూర్వక ఒప్పందం మేరకు ఇవ్వండి
ఎన్డీఎస్‌ఎల్ సీఈవో సుబ్బరాజు చర్చను ప్రారంభిస్తూ 2021లో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2015 డిసెంబర్ 23 కట్ డేట్ (లేఆఫ్ ప్రకటించిన తేదీ) నిర్ధారించి ఏడాదికి 15 రోజుల చొప్పున కార్మికుడి సర్విసు మేరకు వేతనంతో కూడిన బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన అసంబద్ధమైందని కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీ మూసివేతకు గురైతే ఏడాదికి 45 రోజుల చొప్పున వేతనం చెల్లించాలని యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఉందని, దీంతో పాటు, లేబర్ కోర్టు తీర్పు ప్రకారం 15 రోజులు కలుపుకుని 60 రోజుల చొప్పున వేతన బకాయిలు ఇవ్వాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వాటా 49 శాతం ప్రైవేట్ కంపెనీ వాటా 51 శాతంతో జాయింట్ వెంచర్‌లో నడుస్తున్నందున చర్చల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉందా? అన్ని ప్రశ్నించారు. చర్చల అనంతరం కార్మికుల డిమాండ్‌ను ఎండీ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
చర్చల వెనుక ఏదో కుట్ర ఉంది..
చర్చల వెనుక ప్రైవేట్ యాజమాన్యం ఏదో కుట్ర పన్నుతోందని కార్మిక నాయకులు రవి శంకర్‌గౌడ్, ఉపేందర్, కుమార స్వామిలు ఆరోపించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని పక్కన బెట్టి ఎన్నికల సమయంలో దొంగ చాటు చర్చలెందుకని ప్రశ్నించారు. మూడు ఫ్యాక్టరీలకు సంబంధించి రూ. 2వేల కోట్ల ఆస్తులు కబళించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్డీఎస్‌ఎల్‌ను రీ ఓపెనింగ్ చేయలేం..
తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్టరీ టే కోవర్ చేస్తుందని స్పష్టత ఇచ్చినందున రీ ఓపెనింగ్ చేయలేమని ఎన్‌డీఎస్‌ఎల్ సీఈవో సుబ్బారావు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment