పిల్లి వచ్చే... ‘వెలుగు’ భద్రం! | Chandrababu Lantern Stunts On Current Charges Article By Vardelli Murali | Sakshi
Sakshi News home page

పిల్లి వచ్చే... ‘వెలుగు’ భద్రం!

Published Sun, Apr 3 2022 12:51 AM | Last Updated on Sun, Apr 17 2022 12:44 AM

Chandrababu Lantern Stunts On Current Charges Article By Vardelli Murali - Sakshi

నూరు ఎలుకల్ని భోంచేసిన పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరిందట! రైతన్నపై మోయలేని కరెంటు భారాన్ని మోపినందుకు నిరసనగా ఊరేగిన జనంపై కాల్పులు జరిపి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నారు. వారే ఇప్పుడు లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నారు. గురువుకు నామం పెట్టి అతని సర్వస్వాన్ని దోచుకొని పోయిన ఆషాఢభూతి (పంచతంత్రం కథ) గురుపూజోత్సవం జరిపితే ఎట్లా వుంటుంది? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణ మైన ‘‘నమ్మకద్రోహులు, ఔరంగజేబులు’’ ఇప్పుడాయన ఆద ర్శాలకు స్తోత్ర కైవారాలు సమర్పిస్తుంటే అట్లానే ఉంటున్నది.

ఇప్పుడు లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నవారి చేతులకు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఎవ్వరిదా రక్తం? ఎక్కడిదా రక్తం? చంద్రబాబు పోలీసులు పేల్చిన తుపాకీ తూటాలు నవయువకుడైన కామ్రేడ్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి దేహాన్ని చీల్చినప్పుడు స్రవించిన రక్తధార. ఇంకా వెచ్చగా వున్నది. చంద్రబాబు బందూకులకు బరిగీసి ఎదురొడ్డి నిలబడి నప్పుడు ప్రజాసంఘాల నేత కామ్రేడ్‌ రామకృష్ణ చిందించిన రక్తపు చారికలు. ఇంకా తడారలేదు. కాంగ్రెస్‌ కార్యకర్త బాలాస్వామి తనువు నుంచి పిండేసిన మండే నెత్తురు. ఇంకా చల్లారనే లేదు. ‘‘అమరుల రుధిర ధారలురా, ఆరని అగ్నిజ్వాలలురా, నాల్కలు చాచే నాగులురా, అవి అంతం చూసే ఆగునురా’’ అన్నాడొక కవి.

ఇప్పుడు ఊరేగుతున్న బషీర్‌బాగ్‌ హంతకుల చేతుల కంటిన నెత్తుటి మరకలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి చేతుల్లోని గుడ్డి లాంతర్లను ఆ మరకలు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబుకు తనదైన ఒక ఫిలాసఫీ ఉండేది. ఆ ఫిలాసఫీని ఆయన బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఒక పుస్తకాన్ని కూడా అచ్చేసి పంచుకున్నారు. ఆ ఫిలాసఫీ ఆధారంగా చంద్ర బాబుకు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రసాదించాయి. వ్యవసాయం దండగ అనేది ఆ ఫిలాసఫీలో ఒక భాగం. అందుకు తగ్గట్టుగానే ఆయన రైతు వ్యతిరేక విధానాలను అవలంబించేవారు. వ్యవసాయంలో బతుకులను ఈదలేక పెద్దఎత్తున రైతులు ఆ రంగం నుంచి తప్పుకోవాలి. రెక్కలమ్ముకోవడం తప్ప మరే గత్యంతరమూ లేని రిజర్వు లేబర్‌గా వారు పట్టణ మార్కెట్‌లలో నిలబడి పోవాలి. పారిశ్రామికులకు, వ్యాపారులకు చీప్‌లేబర్‌  సుల భంగా దొరకాలి. ఇదీ ధ్యేయం. 

ఆ విధానానికి అనుగుణంగా వ్యవసాయ రంగంపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని మోయలేనంతగా మోపారు. సమయానికి బిల్లులు చెల్లించలేకపోతే స్టార్టర్లను, మోటర్లను విద్యుత్‌ సిబ్బంది ఎత్తుకెళ్లేవారు. ఇంటి తలుపుల్ని తీసుకొనిపోయిన ఉదాహరణలు కోకొల్లలు. రైతులపై దొంగ కేసులు బనాయిం చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అవమాన భారాలు తట్టు కోలేక ఎందరో రైతులు ఆత్మహత్యల బాటను ఎంచుకున్నారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకిం చారు. అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకొనే రోజులు వస్తాయని ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఒక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను శాంతిభద్రతల సమస్యగా పరిగణించాలని చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రదర్శన బషీర్‌బాగ్‌ ప్రాంతాన్ని చేరుకునేసరికి పోలీసు బల గాలు అడ్డగించాయి. హెచ్చరికలు లేకుండానే వారి తుపాకులు గర్జించాయి. చురుగ్గా ఉన్న కార్యకర్తలపై పోలీసులు గురి చూసి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండకు కారకుడైన జనరల్‌ డయ్యర్‌ లాంటివాడు మాత్రమే చేయగలిగిన అమానుషకాండ ఇది.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో సంభవించిన ఓటమిని ఆ పార్టీ నిభాయించుకోలేక పోతున్నది. ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించింది. ప్రమోటర్ల పాలిటి కల్పతరువులాంటి ప్రాజెక్టది. అందులోని కుంభకోణానికి ఇప్పుడు అడ్డుకట్ట పడింది. తెలుగుదేశం పెద్దలకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. మనసు మనసులో ఉండటం లేదు. న్యాయాన్యాయ విచికిత్సతో పనిలేదు. ధర్మాధర్మ విచక్షణ జాన్తా నై. తక్షణ కర్తవ్యం అధికారంలోకి రావడం. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను తాము ఉద్దేశించిన విధంగా పిండుకోవాలి. ఇందుకు ఏకైక మార్గం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించి తాము అధికారంలోకి రావడం. అలా జరగాలంటే దానికి రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి: ఏదో అద్భుతం జరిగి దేవుడు ప్రత్యక్షమైతే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి తమను ఎక్కించాలని కోరుకోవడం. ఇదంత సులభం కాదు. రెండోది: ఎన్ని మాయోపాయాలైనా ప్రయోగించి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించాలి. వచ్చే ఎన్నికల్లో గెలవాలి. ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లెవేస్తే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ ప్రాపగాండా సూత్రాన్ని ఆ పార్టీ బాగా వంట పట్టించుకున్నది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో రైతు సెంటిమెంట్‌ను రంగరించింది. రక్త కన్నీరు నాటకాన్నీ, రైతుబిడ్డ సినిమానూ ఏకకాలంలో ప్రదర్శించింది. అనుకున్నంతగా రక్తి కట్టలేదు. రోజుకో బట్టను కాల్చి అధికార పార్టీ మీద వేయడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో దానికో కరెంటు తీగ దొరికింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెరుగు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు పొరుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో ఈ నెల నుంచి ఛార్జీలు పెరుగు తున్నాయి. ఆ పెంపు మా దగ్గరే తక్కువని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో రూ. 1,400 కోట్లను మాత్రమే పెంచు తున్నామనీ, మరో 700 కోట్లు ట్రూఅప్‌ భారమనీ, ఈ రెండు భారాలూ చంద్రబాబు పాప ఫలితాలనీ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు.

కనీసం అరడజనుసార్లు సుదీర్ఘమైన వివరణలు ఇచ్చారు. వారి వాదాన్ని బలపరిచే గణాంకాలను కూడా విడుదల చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఇందులోని లోతుపాతులపై తార్కికంగా చర్చించే పరిస్థితి లేదు. యురేకా! కరెంటు తీగ దొరికింది. పట్టండి లాంతర్లు.. ఎత్తండి గొంతులు అన్నదొక్కటే ప్రస్తుతం తెలుగుదేశం క్యాంప్‌ వ్యూహం. వీలైతే విష్ణువర్ధన్‌ రెడ్డినీ, రామకృష్ణనూ మరిచిపోయి కమ్యూనిస్టులూ, బాలా స్వామిని మరిచిపోయి కాంగ్రెస్‌ వారూ తమతో కలిసి ఈ పోరాటంలో పాల్గొనాలని బహుశా నేడో రేపో తెలుగుదేశం పార్టీ ఒక పిలుపును కూడా ఇవ్వవచ్చు.

మన దగ్గర జరిగే విద్యుదుత్పత్తిలో థర్మల్‌దే పెద్ద వాటా. ఇది బొగ్గు ఆధారిత ఉత్పత్తి. మార్కెట్లో బొగ్గు ధరలు గడిచిన కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. ఏడెనిమిదేళ్ల కిందట ఒక టన్ను విదేశీ బొగ్గు 7 వేల రూపాయలకు దొరికేది. ఇప్పుడది రూ. 18 వేల పైమాటే. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగింది. మనం ఉత్పత్తి చేసుకున్న లేదా కొనుగోలు చేసిన థర్మల్, హైడల్‌ మాత్రమే సరిపోదు. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహించడానికి సౌర, గాలిమరల విద్యుత్తును కూడా కొంతమేర కొనుగోలు చేయాలి. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ సోలార్, విండ్‌ ప్లాంట్లతో కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నది. ఈ ఒప్పందాలను పీపీఏ (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు)లు అంటున్నారు. ఈ పీపీఏలలో బాబు ప్రభుత్వం ఒక మతలబు చేసింది.

అప్పటికి మార్కెట్లో ఉన్న ధర కంటే రెట్టింపు ధరకు పీపీఏలు కుదుర్చుకున్నది. ఈ రెట్టింపు ధరను పాతికేళ్లపాటు భరించాలి. ఒప్పందం కుదుర్చుకున్నది కూడా సెకీ (ఎస్‌ఈసీఐ) లాంటి ప్రభుత్వ సంస్థతో కాదు. ప్రైవేట్‌ సంస్థలతో. ప్రైవేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా ఒప్పందం చేసుకున్నా రంటే గూడుపుఠాణీ ఉన్నట్టే కదా! ఈ పొరపాటును సరిదిద్ద డానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ. 4.88 కాకుండా మార్కెట్‌ ధర ప్రకారం యూనిట్‌కు రూ. 2.43 చెల్లిస్తామని ప్రతిపాదించింది. ప్రైవేట్‌ వాళ్లు వచ్చే లాభాన్ని ఎందుకు వదులుకుంటారు! వాళ్లు కోర్టుకెక్కారు. ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆమేరకే చెల్లింపులు చేయాలని కోర్టు చెప్పింది. ఫలితంగా విద్యుత్‌ పంపిణీ చేసే సంస్థలైన డిస్కమ్‌లపై 7,866 కోట్ల రూపాయల భారం పడింది. నిరంతరం విద్యుత్‌ సరఫరా (24గీ7) చేయడం కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు ఐదు రూపాయల చొప్పున చెల్లించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

అట్లాగే వ్యవసాయ రంగానికి పగటి పూటే తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తామన్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వాగ్దానం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ అంశాన్ని సమీక్షించడం జరి గింది. ఒకవేళ అవసరమైనంత విద్యుత్‌ అందుబాటులో ఉన్నా కూడా తొమ్మిది గంటలపాటు పగటిపూట నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవసరమైన ఫీడర్లు వగైరాలతో కూడిన మౌలిక వ్యవస్థ అందుబాటులో లేని విషయం బయటపడింది. రైతుకు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేస్తానని చెప్పడమే తప్ప అందుకు అవసరమైన మౌలిక వసతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ఒక నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించుకొని ఈ రంగంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ఈరకంగా వేలకోట్ల భారం పడినప్పటికీ అందులో రూ.1,400 కోట్లను మాత్రమే వినియోగ దారునికి బదిలీ చేశామన్నది డిస్కమ్‌ల వాదన.

ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో మరో 700 కోట్ల పద్దు ఉన్నది. దీన్ని సర్దుబాటు ఛార్జీలు అంటారు. రాబోయే ఏడాదికి సంబంధించి విద్యుత్‌ పంపిణీ సంస్థలు ముందస్తు అంచనాలు వేసుకుంటాయి. తమ పరిధిలో వివిధ రంగాల వారీగా ఎంత మేరకు విద్యుత్‌ డిమాండ్‌ ఉండవచ్చును? దాన్ని ఎక్కడెక్కడి నుంచి (థర్మల్, హైడల్, గ్యాస్, విండ్, సోలార్‌) ఎంతమేరకు సమీకరించుకోవాలి? ఎంతమేరకు ఖర్చవుతుంది. సరఫరా – పంపిణీ వ్యయమెంత ఉండవచ్చును? ఏ కేటగిరీకి ఎంత రేటుకు విద్యుత్‌ను సరఫరా చేయాలి? వగైరా లెక్కలతో వార్షిక ఆదాయ–వ్యయ నివేదికల (ఏఆర్‌ఆర్‌)ను విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రూపొందిస్తాయి.

వాటిని విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పిస్తాయి. నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పుచేర్పులతో గానీ, యథాతథంగా గానీ చార్జీలను నిర్ణయిస్తూ మండలి (ఈఆర్‌సీ) ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏడాది గడిచిన తర్వాత చూసినప్పుడు ఆదాయ వ్యయాలు అంచనాల మేరకు ఉండవచ్చు లేదా వ్యయం పెరగ వచ్చు. అట్లా ఖర్చు పెరిగినప్పుడు ట్రూ అప్‌ పేరుతో పెరిగిన ఖర్చును వినియోగదారులకు బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. ఒకవేళ ఖర్చు తగ్గినట్టయితే ట్రూ డౌన్‌ పేరుతో తగ్గిన మేరకు వినియోగదారులకు జమ చేయాలి. ఇప్పుడు ట్రూ అప్‌ పేరుతో 700 కోట్లను ఏపీఈఆర్‌సి వినియోగదారులపై వేసింది. ఈ ట్రూ అప్‌ ఛార్జీల జన్మ వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించాలి.

2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్ర బాబు ప్రభుత్వం రూ. 3,977 కోట్ల ట్రూ అప్‌ క్లెయిమ్‌లను పరిష్కరించకుండా వదిలివేసింది. ప్రభుత్వ రంగంలోని జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసి అధిక ధరలకు ప్రైవేట్‌ వాళ్ల నుంచి కొనుగోలు చేయించింది. దీంతో విద్యుత్‌ వ్యయం పెరిగి డిస్కమ్‌ల నడ్డి విరిగినట్లయింది. ఈఆర్‌సీ నిర్దేశించిన సబ్సిడీని కూడా చంద్ర బాబు ప్రభుత్వం భరించలేదు. ఫలితంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం భారీగా రుణాలు తీసుకోవలసి వచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి డిస్కమ్‌ల అప్పులు 29,703 కోట్లు. ఆయన దిగిపోయే నాటికి 68,596 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ హామీ లేకుండా తీసుకున్న అప్పులు కూడా మూడు రెట్లు పెరిగాయి. డిస్కమ్‌లు తీవ్ర సంక్షోభంలోకి కూరుకునిపోయాయి. బాబు వాటి పుట్టి ముంచారు. ఇప్పుడు వాటిని గట్టెక్కించడానికి కొంతమేరకు ట్రూఅప్‌ అవసరమైందని ప్రభుత్వం చెబుతున్నది.

చంద్రబాబు ఐదేళ్లపాటు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా, ట్రూఅప్‌ ఛార్జీలు వేయకుండా మేనేజ్‌ చేయగలిగారని తెలుగు దేశం పార్టీ వారు చెపుతున్నారు. చంద్రబాబు ఛార్జీలు పెంచ లేదన్నది తప్పు. ఆయన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో పదమూడుసార్లు ఛార్జీలు పెంచారు. ఇందులో ఎక్కువసార్లు గృహవినియోగంపైనే భారం మోపారు. కొన్ని సార్లు మాత్రమే గృహ వినియోగదారుల జోలికి పోకుండా పారిశ్రామిక – వాణిజ్య వర్గాల ఛార్జీలు పెంచారు. చివరిసారి అధికారంలో ఉన్నప్పుడు ట్రూఅప్‌ ఛార్జీలు వేయకుండా ఎందుకున్నారనే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం వినబడుతున్నది.

చంద్రబాబు తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచే విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించే ఉద్దేశంతో ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలోనే విద్యుత్‌ బోర్డు ట్రాన్స్‌కో–జెన్‌కోలుగా ముక్కలైంది. వీటిని పూర్తిగా ప్రైవేటీ కరించే కర్తవ్యాన్ని ఆయన తొమ్మిదేళ్లకాలంలో చేయలేక పోయారు. కానీ ఆ కోర్కె మిగిలే ఉన్నది. వాటిని నిండా మునిగేలా సంక్షోభంలోకి నెట్టివేసి ఆ తర్వాత కారుచౌక బేరంతో ప్రైవేట్‌కు కట్టబెట్టే ఆలోచనతోనే చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని వామపక్ష విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఫిలాసఫీని అర్థం చేసుకున్న వారికి ఈ వాదనలో నిజమున్నదనే అభిప్రాయం కలుగుతుంది.

విద్యుత్‌ రంగ సంస్కరణల క్రమంలో లక్షలాది రైతు కుటుంబాలను ‘షాక్‌’కు గురిచేసిన పాలకుడు చంద్రబాబు. అంతంతమాత్రపు వ్యవసాయంలో కరెంటు బిల్లుల కల్లోలం రేపిన రోజులు ఆయన హయాంలోనివే. బషీర్‌బాగ్‌ రక్తపు మరకల చేతుల్లో జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేస్తే జనం హర్షించరు.

తెలుగుదేశం పార్టీ ‘నలభయ్యో వార్షికోత్సవాలు’ ఈ వారమే హైదరాబాద్‌లో జరిగాయి. ఎన్టీఆర్‌ ఆదర్శాల బాటలో పయనిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటన ఎటువంటి వ్యాఖ్యానం అవసరం లేని ఒక పెద్ద జోక్‌. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని మరొక్కసారి డిమాండ్‌ చేశారు. ఆయన మాటల్లోనే చంద్రబాబు రాష్ట్రపతులను ఎంపిక చేసిన వ్యక్తి. ప్రధానులను ఎన్నిక చేయడంలో చక్రం తిప్పిన వాడు.

ఒక్క భారతరత్న అవార్డును ఎన్టీఆర్‌కు ఇప్పించలేక పోయాడా అన్న అనుమానం సభికుల్లో పొడసూపకుండా ఉంటుందా? ఈ సభలో చంద్రబాబు చేసిన అతి ముఖ్యమైన రాజకీయ ప్రకటన ఒకటుంది. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లను యువతకే కేటాయిస్తారట. ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోకి సరైన అర్థంలోనే వెళ్లింది. 40 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తారు. ఇంకో 40 శాతం పొత్తుల పేర్లతో ఇతర పార్టీలకు ఇస్తారు. పాత కాపులకు మిగిలేది 20 శాతం మాత్రమే. ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా లోకేశ్‌బాబు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు పార్టీలో ఇరవైశాతం మాత్రమే మిగులుతారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement