‘రాష్ట్రాన్ని విభజించేశారు.. కానీ పేదలు బతకడానికి అభివృద్ధి కూడా కావాలి. కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యం అన్ని వసతులూ కల్పించాలి.
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఉద్ఘాటన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఏలూరు: ‘రాష్ట్రాన్ని విభజించేశారు.. కానీ పేదలు బతకడానికి అభివృద్ధి కూడా కావాలి. కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యం అన్ని వసతులూ కల్పించాలి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి కూడా తండ్రిలానే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పేదలకు సేవ చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు. జగన్ ఆప్రాంతంలో సీఎం అయినా.. ఇక్కడ కూడా మీ సంతోషంలో, బాధల్లో, కష్టాలు, కన్నీళ్లలో పాలుపంచుకుంటాడు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ప్రచారంలో భాగంగా రెండో రోజయిన మంగళవారం ఆమె కొత్తగూడెం, సత్తుపల్లిలలో పర్యటించారు. పలుచోట్ల ప్రసంగించారు. ఇక్కడితో ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మనసున్న నాయకులనే ఎన్నుకోవాలని.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇచ్చే నాయకులకే పట్టం కట్టాలని ఆమె పిలుపునిచ్చారు.