అన్యాయానికి జవాబు చెబుదాం!: విజయమ్మ | We will say answer to Injustice by wining in all elections, calls Ys Vijayamma | Sakshi
Sakshi News home page

అన్యాయానికి జవాబు చెబుదాం!: విజయమ్మ

Published Thu, Mar 13 2014 2:33 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

అన్యాయానికి జవాబు చెబుదాం!: విజయమ్మ - Sakshi

అన్యాయానికి జవాబు చెబుదాం!: విజయమ్మ

* వైఎస్సార్‌సీపీ 3వ ఆవిర్భావ దినోత్సవంలో శ్రేణులకు విజయమ్మ పిలుపు
* వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించండి
* సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దాం.. సువర్ణయుగం తీసుకొద్దాం
* ఎన్నో పార్టీలు పుట్టుకొస్తున్నా.. వైఎస్సార్ సీపీ ఒక్కటే ప్రజల తరఫున పోరాడుతోంది
* ఏ ప్రాంతంలో ఉన్నా అంతా తెలుగువారమే.. రెండు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం పార్టీ పాటుపడుతుంది

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘నాలుగున్నరేళ్లుగా మనం ఎన్నో అవమానాలకు, అన్యాయాలకు గురయ్యాం.  వాటన్నింటికీ ఈరోజు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని చేకూర్చడం ఈరోజు మన ముందున్న కర్తవ్యం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుండి కృషి చేయాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి మూడేళ్లయిన సందర్భంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో ఆమె మాట్లాడారు.
 
  ‘శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇక రెండు నెలలే ఉంది, మీ మనిషిగా, జగన్ తల్లిగా, మహానేత వైఎస్ భార్యగా ఇవాళ ప్రజలందరికీ ఒకే ఒక మాట చెబుతున్నా... వైఎస్ గుణాలను పుణికిపుచ్చుకుని తన తండ్రి కలలను నెరవేర్చడానికి ముందుకు వస్తున్న జగన్‌ను ఆశీర్వదించండి’ అని కోరారు. వైఎస్‌లోని దీక్ష, పట్టుదల జగన్‌లో ఉన్నాయని, నాలుగున్నరే ళ్ల పోరాటంలో జగన్‌ను చూసినపుడల్లా వైఎస్‌ను చూసినట్లే అనిపిస్తూ ఉందని ఆమె అన్నారు. ఇవాళ ఎన్నో పార్టీలు పుట్టుకొస్తున్నాయని, కానీ వైఎస్సార్ సీపీ ఒక్కటే విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతోందని అన్నారు.
 
 మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పోరాడాలి..
 అందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ఒకేసారి తెచ్చినా మొక్కవోని విశ్వాసంతో ఘన విజయం సాధించేందుకు పోరాడాలని విజయమ్మ పిలుపునిచ్చారు. విభేదాలుంటే తాత్కాలికంగా పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఎన్నికల వల్లనే వ్యవస్థాపక దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకొంటున్నామని, ఎన్నికల తరువాత  అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ సీపీయే కనుక ఆరోజు ప్రజల మధ్య ఘనంగా ప్రమాణస్వీకారోత్సవం జరుపుకొందామని విజయమ్మ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు.
 
 ఎన్నో ఇబ్బందులు పడ్డాం..
 వైఎస్ మరణించిన నాలుగున్నరేళ్లలో లెక్కలేనన్ని ఇబ్బందులు పడి ఎన్నో పోరాటాలు చేశామని విజయమ్మ అన్నారు. జైల్లో ఉండి కూడా జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన చేత యాత్రలు, దీక్షలు, షర్మిల చేత పాదయాత్రలు చేయించారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేశామన్నారు. పోరాటాల్లోనే పుట్టిన వైఎస్సార్ సీపీ ఇప్పటికీ అదే బాటలో నడుస్తోందని విజయమ్మ అన్నారు. పార్టీ పెట్టినపుడు తనతో వచ్చే వారికి మూడేళ్లు కష్టాలు తప్పవని జగన్ అన్నారని, ఆ తరువాత 30 ఏళ్ల పాటు సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని కూడా పేర్కొన్నారని, దాన్ని సాకారం చేసుకుందామని అన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో తెచ్చిన అధికారాన్ని అనుభవించిన ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా ప్రజలను విస్మరించి, ఇపుడు డిపాజిట్ కోల్పోయే స్థితి తెచ్చుకుందన్నారు.
 
 బాబు ప్రజలకు ఒక్క మంచి పనైనా చేశారా?
 తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు తన పాలనలో ప్రజలకు పనికి వచ్చే ఒక్క మంచి పనైనా చేశారా అని విజయమ్మ ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టుగాని, ఒక్క ఫ్యాక్టరీగాని ఆయన నిర్మించలేదన్నారు. తన పాలన ను తిరిగి తెస్తానని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారని విజయమ్మ విమర్శించారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ , అవిశ్వాసం వంటి విషయాల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పనిచేశారన్నారు. ఇది చాలక లేఖను ఇచ్చి రాష్ట్ర విభజనకు సహకరించారని ఆమె దుయ్యబట్టారు. చివరి వరకూ పదవిని అంటిపెట్టుకున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు తాను సమైక్య చాంపియన్ అని చెబుతున్నారన్నారు.
 
 విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి విడదీశాయన్నారు. విభజనకు వ్యతిరేకంగా మనం సుప్రీంకోర్టులో పోరాడుతున్నామన్నారు. భూభాగాన్ని విడదీసినా తెలుగువారిని వేరు చేయలేరని ఏ ప్రాంతం వారికి కష్టం వచ్చినా మరో ప్రాంతం వారు ఆదుకుంటారని జగన్ చెప్పారని ఆమె గుర్తు చేశారు. అలాగే ఇరు ప్రాంతాల ప్రజల హృదయాల నుంచి వైఎస్‌ను తుడిచి వేయలేరన్నారు.
 
 ‘‘ఈరోజు నేను నా కుమారుడి తరఫున మీ అందరికీ మాట ఇస్తున్నా.. రెండు ప్రాంతాల్లో ఉన్నా అందరమూ తెలుగు వారమే.. మనదంతా తెలుగుజాతి. ఏరోజు కూడా మనంతట మనం విడిపోలేదు. జర్మనీ, బ్రిటిష్ వారికి యుద్ధం వస్తే వారి కోసం మనల్ని ఒకప్పుడు విడదీశారు. ఈరోజు అదే ఇటలీ వాళ్లు ఓట్లు, సీట్ల కోసం విడగొట్టారు. అయినా రెండు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ పాటుపడుతుంది.’’
 - వైఎస్ విజయమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement