వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న విజయమ్మ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘షర్మిలమ్మ అడ్రస్ ఈరోజు పాలేరు అయింది. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా చెప్పుకునే అడ్రస్ అవుతుంది ఈ కార్యాలయం’అని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్‌నగర్‌లో పాలేరు నియోజకవర్గ వైఎస్సార్ తెలంగాణ పార్టీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను మీ బిడ్డను, మీతో ఉంటాను అని.. పాలేరు ప్రజలకు ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేసిన షర్మిలమ్మను ఆశీర్వదించాలి’అని కోరారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదనే వారికి ఆమె ప్రేమ.. తెలంగాణలో షర్మిలమ్మ ఉనికి పోయిందనే వారికి ఆమె మానవత్వమే జవాబు చెబుతుందని పేర్కొన్నారు.
వైఎస్‌ది జగమంత కుటుంబం
పాలేరు నియోజకవర్గం వేదికగా నిర్మిస్తున్న పార్టీ కొత్త కార్యాలయం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8న ప్రారంభించనున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ తన కుటుంబాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించారని ఆమె చెప్పారు. ఆయనది జగమంత కుటుంబమని, రాజశేఖరరెడ్డి కుటుంబం అంటేనే ప్రజల కుటుంబమని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల ప్రయత్నం చేస్తోందని అన్నారు.
షర్మిలమ్మ పాలేరులో పోటీకి నిర్ణయించుకోవడం యాదృచ్ఛికం కాదని, అది దైవేచ్ఛగా భావిస్తున్నామని తెలిపారు. తమకు పులివెందుల ఎలాగో.. షర్మిలకు పాలేరు కూడా అలాగేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment