సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న విజయమ్మ. చిత్రంలో షర్మిల
నర్సంపేట: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రతో తెలంగాణ ప్రభుత్వంలో అలజడి మొదలైందని దివంగత నేత వైఎస్సార్ సతీమణి వై.ఎస్.విజయమ్మ అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకుంది. యాత్ర 3,500 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా షర్మిలతో కలసి విజయమ్మ వైఎస్సార్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ గొప్ప ఆశయం, సంకల్పంతో యాత్ర సాగుతోందన్నారు. పాదయాత్రకు ప్రజలనుంచి మంచి ఆదరణ వస్తోందని చెప్పారు. ‘ఒక మహిళ పదేళ్ల కిందట 3,200 కిలోమీటర్లు నడిచింది, ఆ మహిళే ఇప్పుడు మళ్లీ 3,500 కిలోమీటర్లు నడిచింది’అని షర్మిలను ఉద్దేశించి అన్నారు.
దేశ చరిత్రలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. ఇది తల్లిగా తనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. షరి్మల వైఎస్సార్‌కు గారాలపట్టి అని చెప్పారు. వైఎస్ తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదని, షర్మిల ఎక్కడికి వెళ్లినా వైఎస్సార్‌ను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ రూ.1.40 లక్షల కోట్లతో 86 ప్రాజెక్టులు చేపట్టారన్నారు. దీంతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ గుడి కట్టుకున్నారన్నారు. తెలంగాణలో సంక్షేమం, సమన్యాయం లేవని, అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ మీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని, అందుకే షర్మిల ప్రశ్నించే నాయకురాలిగా మీ ముందుకు వచ్చారని చెప్పారు. షర్మిల ఆందోళనలు చేస్తుంటే మంగళవారం వ్రతాలు అని హేళన చేస్తున్నారని, కానీ తెలంగాణలో ఆమె ఒక ప్రభంజనంలా మారబోతోందని, దమ్ముంటే షర్మిలతో ఒక రోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే యుద్ధానికి ప్రజలు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. షర్మిలతో నిలబడి సరికొత్త ప్రభుతాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు పాలించే అర్హత పోయింది
Comments
Please login to add a commentAdd a comment