* విజయమ్మ అడుగు పెట్టకుండా అడ్డంకులు
* చంద్రబాబు పర్యటనకు పోలీసుల రెడ్ కార్పెట్
* తోక ముడుచుకున్న జిల్లా మంత్రులు
* ఆద్యంతం పోలీసు పహారా నడుమ టీటీడీ అధినేత పర్యటన
మొన్న..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నల్లగొండ జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దుల్లోనే మంత్రుల ప్రోద్బలంతో పోలీసులు అడ్డుతగిలారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆదేశాల మేరకు పోలీసులు ఆటో యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. రాత్రికి రాత్రే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి రాళ్లు వేశారు. వీటిని సాకుగా చూపి.. పోలీసులు రెచ్చిపోయి జిల్లాలో పర్యటించకుండా విజయమ్మను హైదరాబాద్ పంపించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
నిన్న..
రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించే చంద్రబాబుకు కాంగ్రెస్ నాయకులు రెడ్ కార్పెట్ పరచి జిల్లా పర్యటన కు స్వాగతిం చారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటన సజావుగా సాగేలా సహకరించారు. తెలంగాణ పౌరుడిగా సమైక్యవాదులను అడ్డుకున్నామని ప్రకటన చేసిన ఓ మంత్రి... చంద్రబాబును అడ్డుకోవడంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి మినహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కనీసం నినదించిన, నిరసన వ్యక్తం చేసిన దాఖలాలూ లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు ఇది పరాకాష్ట.
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఖాకీల పహారాలో సాగింది. దామరచర్ల మండలం విష్ణుపురంలోని ఇండియా సిమెంట్ కంపెనీ అతిథి గృహం నుంచి బయలుదేరింది మొదలు.. కట్టంగూరులో రాత్రి పర్యటన ముగిసే దాకా పోలీసులు చంద్రబాబును నీడలా వెన్నంటే ఉన్నారు. వందల సంఖ్యలో ఖాకీలు అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాగా, వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు. ఇది మినహా బాబు పర్యటనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి నిరసన వ్యక్తం కాలేదు.
ఈ ఘటన ద్వారా కాంగ్రెస్, టీడీపీల తెరవె నుక బాగోతం మరోసారి బట్టబయలైంది. జిల్లాలో గురువారం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు అడ్డుతగిలిన తీరు.. సజావుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన పర్యటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. విజయమ్మ పర్యటన సందర్భంగా సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి నానా రభస చేశారు. రెండు రోజులూ తన నియోజకవర్గంలోనే మకాం వేసి స్థానికులు, పక్క నియోజకవర్గాలకు చెందిన తన అనుయాయులను ఉసిగొల్పిన విషయం తెలిసిందే.
ఎస్పీని సైతం క్షేత్రంలోకి తీసుకొచ్చి పలు జిల్లాలకు చెందిన పోలీసులను మోహరించారు. ఎలాగైనా విజయమ్మను అడ్డుకోవాలన్న ముందస్తు వ్యూహంలో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేగాక పర్యటనను అడ్డుకుంటామని జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితోపాటు ఎంపీ కూడా ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి వారు తెలంగాణ అంశంపై ఎటూ తేల్చని చంద్రబాబు పర్యటన సాఫీగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా సహకరించడం విశేషం. తరచూ ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేసి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ఓ ఎంపీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే చంద్రబాబు తిరిగినా పట్టించుకోలేదు.
తెలంగాణవాదులను చితకబాదిన పోలీసులు
బాబు పర్యటన సందర్భంగా తెలంగాణవాదులపై పోలీ సులు లాఠీ ఝుళిపించారు. చంద్రబాబు కాన్వాయ్ దామరచర్లకు చేరుకోగానే తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలుపుతూ, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే సమయంలో పోలీసులు తెలంగాణవాదులపై లాఠీ ఝుళిపించారు.
విజయమ్మపై కక్ష.. చంద్రబాబుకు రక్ష...
Published Sat, Nov 2 2013 4:43 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement