సాక్షి, విశాఖపట్నం : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలు, రైతుల శ్రేయస్సు గురించి తపన పడేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చీడికాడలో రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రైతుల ప్రాణాలంటే చంద్రబాబుకు ఎన్నడూ లెక్కలేదని విమర్శించారు. గతంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
‘1978లో వైఎస్సార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీఎం అయ్యారు. అంతకాలం ఆయన ఏ పదవిలో లేరు. అయినా, రైతుల సమస్యలపై పోరాడారు. అప్పుల బాధతో వేలాది మంది రైతులు చనిపోతుంటే.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్సార్ నాడు సీఎంగా ఉన్న చంద్రబాబును నిలదీశారు. రైతులకు లక్ష రూపాయల చొప్పన రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ, వారికి రుణాలు మాఫీ చేస్తే అదే అలవాటవుంతుందని, లక్ష రూపాయలు మాఫీ చేస్తే మరింతమంది ఆత్మహత్య చేసుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బాబు వ్యాఖ్యలపై సీరియస్ అయిన వైఎస్సార్.. కోటి రూపాయలిస్తా నువ్ చనిపోతావా బాబూ అని కౌంటర్ వేశారు. రైతుల ప్రాణాల విలువ అర్థం కావడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీఎం అయిన తర్వాత తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై చేశారు. విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు లక్షన్నర రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. ఆ మహానేత ఎప్పుడూ రైతురాజుగా మారాలని ఆలోచించేవారు’ అని ప్రసంగం కొనసాగించారు. విజయమ్మ ఇంకా ఏం మాట్లాడారంటే..
ఆయనకు బ్లూప్రింట్ ఉండేదేమో..
‘విశాఖ జిల్లాను వైఎస్సార్ ఎన్నోసార్లు సందర్శించారు. ఇక్కడి ప్రజలను పేరుపెట్టి పిలిచేంత చనువు ఉండేది. అందుకే ప్రజలు, రైతుల సమస్యలేంటి.. వారికి ఏయే సంక్షేమ ఫలాలు అందాలి అనే విషయం వైఎస్సార్‌కు బ్లూప్రింట్‌లా ఉండేది కావచ్చు. మీ అందరి శ్రేయస్సును కోరుతూ.. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతులకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉత్తరాంధ్రలో జంఝావతి, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, మిగిలిపోయిన పనులను గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ అయిదేళ్లలో చంద్రబాబు వాటిని నిర్లక్ష్యం చేశారు. గత ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయొద్దు. ఇవి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు. చంద్రబాబు అయిదేళ్ల అరాచక పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు. రాజన్న పాలన మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సత్యవతిని, మాడుగుల ఎమ్మెల్యే అభర్థిగా ముత్యాల నాయుడుని గెలిపించాలి’ అని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment