శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ
సాక్షి, శ్రీకాకుళం: ‘అమాయకులపై దాడులు చేయించేది నువ్వు.. ప్రజల భూములు కబ్జా చేసేది నువ్వు’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీదే రౌడీ రాజ్యమని నిప్పులు చెరిగారు. తునిలో రైలు తగలబెట్టింది నువ్వు కాదా అంటూ మండిపడ్డారు. రాజధాని భూముల వ్యవహారాన్ని చూస్తే అసలు కబ్జాదారులు ఎవరో తేలుతుందన్నారు. మీరు మాట్లాడతారా విలువల గురించి అంటూ దుయ్యబట్టారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు, రాజాం నియోజకవర్గం రేగిడిలో విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే..
మాకు తెలిసిందల్లా పేదలకు ఆస్తులు పంచడమే..
చంద్రబాబు అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నాడు. జగన్‌కు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్లేనని అంటున్నాడు. జగన్‌కు ఓటేస్తే ఆత్మహత్య కాదు.. ప్రాణం పోస్తాడని చెబుతున్నా. నా బిడ్డకు ఓటేస్తే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడు. విశాఖలో పోయినసారి కూడా చంద్రబాబు ఇలాగే విషప్రచారం చేశాడు. ఎవరు కబ్జాదారులో రాజధానికి పోయి చూద్దాం రండి. రాజశేఖరరెడ్డిగారు తన ఆస్తులు పంచేవారే గానీ.. కబ్జాలు చేసే వ్యక్తి కాదు. రెండు ఎకరాల నుంచి ఈ స్థాయికి ఆస్తులు కూడబెట్టిన నువ్వు మాట్లాడుతున్నావా మా గురించి? ఎంతెంత భూములు కబ్జా చేశారో.. ఎన్నెన్ని ఆస్తులు బినామీలకు అప్పగించారో తేల్చుకుందాం రాజధానికి రండి.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదు. నా బిడ్డ కాదు రౌడీ. నువ్వే రౌడీ. తునిలో రైలు తగలబెట్టింది నువ్వు కాదా? రాజధానిలో పంటలకు నిప్పు పెట్టింది నువ్వు కాదా? అసెంబ్లీలో నా బిడ్డ ప్రజా సమస్యలపై మాట్లాడటం మొదలుపెట్టగానే.. 10 మందితో నా భర్తను, బిడ్డను తిట్టించింది నువ్వు కాదా? మీ అంతు తేలుస్తాం అంటూ బెదిరించేది నువ్వు కాదా? వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నది నువ్వు కాదా? ఇదేనా ప్రజాస్వామ్యం? నీకు అసలు విలువలెక్కడున్నాయి? రాజశేఖరరెడ్డి గారు గానీ, జగన్ గానీ ప్రాణం పోసే వారే గానీ తుంచేవారు కాదు. నమ్ముకున్న వాళ్ల కోసం ఎంతదాకైనా పోరాడుతాం.
తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేని నువ్వా మాట్లాడేది?
జగన్ తన తల్లిని, చెల్లిని బయటకు తీసుకొస్తున్నాడని చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. మీకు ప్రేమలు, విలువలు తెలియవేమో. ఆనాడు జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు.. మాకు అండగా ఉన్న ప్రజల కోసం మేము బయటకి వస్తున్నాం. చంద్రబాబు కనీసం తన తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేదు. పోనీ తన తమ్ముడినైనా ప్రేమగా చూసుకున్నాడంటే అదీ లేదు. పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ను మంచిగా చూసుకున్నాడంటే అది కూడా చేయలేదు. నిర్దాక్షిణ్యంగా ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకొని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయనకు ప్రేమ ఎవరిమీదనైనా ఉందంటే అది ఒక్క లోకేశ్ మీదే. అందుకే ఏ అర్హత లేని తన కొడుకు లోకేశ్‌కు మూడు మంత్రి శాఖలు కట్టబెట్టాడు. ఇలాంటి వ్యక్తికి మా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? నమ్ముకున్న వారి కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తిత్వం నా భర్త వైఎస్సార్‌ది, నా కుమారుడు జగన్‌ది. నాన్న నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లాడని జగన్ కూడా ఎప్పుడూ చెబుతుంటాడు. ఆ కుటుంబం కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను.
రైతుల్ని జైల్లో పెట్టించాడు..
ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన 200 మంది రైతులపై కేసులు పెట్టించాడు. 40 రోజులు జైల్లో పెట్టించాడు. పింఛన్ కోసం ప్రజలు కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. నిర్వాసిత గ్రామాల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే భవిష్యత్ అంధకారమవుతుందనే విషయం గుర్తుంచుకోండి. తిత్లీ తుపాను బాధితులకు చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్నాడు. ఇలా చెల్లని చెక్కులిస్తే ఎవరినైనా జైలులో పెడతారు. చంద్రబాబుపైనా కేసులు వేసి కోర్టుకీడ్చండి. జైలుకు పంపండి.
ఈసారి మోసపోవద్దు..
ఈరోజు న్యాయానికి, అన్యాయానికి.. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. రాజశేఖరరెడ్డిగారి పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు మనమంతా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ నేడు చంద్రబాబు పాలనలో మట్టి నుంచి ఇసుక దాకా.. బొగ్గు నుంచి భూముల దాకా టీడీపీ నేతలు దేన్నీ వదలడం లేదు. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి మీరు మోసపోవద్దు. చంద్రబాబు మళ్లీ అవే అబద్ధపు హామీలిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలిచ్చాడు. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీలనే చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతానని జగన్ అంటే తానూ ఇస్తానంటున్నాడు. ఈ ఐదేళ్లలో పింఛన్ ఎందుకు పెంచలేదని చంద్రబాబును నిలదీయండి. పెద్దకొడుకంటే ఎన్నికలప్పుడే ఇస్తాడా అని ప్రశ్నించండి. ఈ ఐదేళ్లలో పసుపు కుంకుమ ఎందుకివ్వలేదని అడగండి. మళ్లీ బాబును నమ్మితే అరాచక పాలన కొనసాగుతుందనే విషయం గుర్తుంచుకోండి.
విశ్వసనీయతకు మారుపేరు జగన్..
విలువలు, విశ్వసనీయతకు జగన్ మారుపేరు. చంద్రబాబులా ఎమ్మెల్యేలను లాగేసుకోలేదు. ఎవరు తన దగ్గరికి వస్తానన్నా.. ముందు గెలిచిన పార్టీకి, పదవికి రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసేవాడు. అలాంటి విలువలు చంద్రబాబుకు లేవు. జగన్‌పై నిరంకుశంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆస్తులు అటాచ్ చేయించారు. అన్నీ తట్టుకుని నిలబడ్డాడు. తనకొచ్చిన కష్టాన్ని ఏనాడూ మీతో చెప్పుకోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసమే తపించాడు. హోదా కోసం నిరాహార దీక్షలు చూశాడు. నమ్మిన జనం కోసం ఎంతకైనా పోరాడే తత్వం జగన్‌ది. వైఎస్సార్‌లానే సంక్షేమ ఫలాలు అందిస్తానని జగన్ భరోసా ఇస్తున్నాడు. ఇచ్చిన మాట తప్పడు.
జగన్ పొత్తు ప్రజలతోనే..
జగన్ బీజేపీతోనూ, కేసీఆర్‌తోనూ పొత్తు పెట్టుకున్నాడని చంద్రబాబు పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. జగన్ సింహం లాంటివాడు. సింహం ఎప్పుడూ ఒంటరిగానే వస్తుంది. ప్రజలతో మాత్రమే జగన్ పొత్తు పెట్టుకున్నాడు. మీరు ఆశీర్వదించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయండి. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి. పాలకొండ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి, పాతపట్నం అభ్యర్థి రెడ్డి శాంతి, రాజాం అభ్యర్థి కంబాల జోగులు, అరకు, శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థులు గొడ్డేటి మాధవి, దువ్వాడ శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి.
ఏది అరాచకత్వం?
నా బిడ్డ ఏ అరాచకమూ చేయలేదు. కాంగ్రెస్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. నమ్ముకున్న వారి కోసం పార్టీ పెట్టుకున్నాడు. ఇది అరాచకత్వమా? ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించడం జగన్ అరాచకత్వమా? తనపై హత్యాయత్నం జరిగినా కూడా.. రాష్ట్రంలో గొడవలు చెలరేగకూడదని చిరునవ్వుతో వెళ్లిపోవడం అరాచకత్వమా? ఓదార్పు యాత్ర, పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలవడం అరాచకత్వమా? వీళ్ల మాటలు విన్నప్పుడల్లా నాకు చాలా బాధనిపిస్తోంది. అందుకే మీ దగ్గర చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మీకంటే పెద్ద ఆప్తులు లేరు మాకు. నేను మీ దగ్గరకు వచ్చినందుకు కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కర్నీ చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment