అనంతపురం/కర్నూలు(వైఎస్సార్ సర్కిల్): అధికారం కోసం ఆడబిడ్డలపై అభాండాలు వేస్తావా అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు నీకంత చులకనైపోయారా? అని నిప్పులు చెరిగారు. వారి గౌరవంతో రాజకీయాలు చేస్తావా అంటూ మండిపడ్డారు. ఈ రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలకైనా పాల్పడే అవకాశముందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల, కర్నూలు జిల్లా పత్తికొండలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే..
మన ఆడబిడ్డల జీవితాలతో ఆడుకునే సీఎం అవసరమా?
చంద్రబాబే అసలు రౌడీ. అధికారం కోసం ఎన్ని కుట్రలైనా పన్నుతాడు. ఆడ్డబిడ్డలపై అభాండాలు వేయడానికి సైతం ఆయన వెనుకాడటం లేదు. నంద్యాల ఉప ఎన్నికప్పుడు చంద్రబాబు చెప్పినట్లుగా వినలేదని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు రోజాతో సంబంధం అంటగట్టాలని పురమాయించాడట. మంత్రులు, ఎమ్మెల్యేలకు వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై ఆదేశాలు కూడా జారీ చేశాడట. అసలు ఈ ముఖ్యమంత్రికి ఏమైనా బుద్ధి ఉందా? ఆడపిల్లల గౌరవంతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? షర్మిలమ్మపై కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అవి కూడా బాలకృష్ణ ఆఫీస్ నుంచి వచ్చినట్లు తెలిసింది. బాలకృష్ణకు ఆడబిడ్డల్లేరా? బాలకృష్ణకు అనంతపురం జిల్లా ప్రజలంతా బుద్ధి చెప్పాలి. ఆడబిడ్డ జీవితాలతో ఆడుకునే మనిషి ముఖ్యమంత్రిగా ఉండాలా? ఓసారి ఆలోచించండి. ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయముంది. చంద్రబాబు ఎన్ని డ్రామాలైనా ఆడతాడు. సానుభూతి కోసం గుండెపోటు అనో, మరేదో అనో పడిపోయే అవకాశముంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి.
వైఎస్సార్ చేసిన మేలు గుర్తు లేదా?
కరువులో రాజస్తాన్ తర్వాత అనంతపురం జిల్లాది.. దేశంలోనే రెండోస్థానం. ఈ జిల్లా కోసం రాజశేఖరరెడ్డిగారు చాలా కష్టపడ్డారు. కేవలం 5 ఏళ్ల 3 నెలల కాలంలోనే అనంతపురం కోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడి రైతులకు ఇచ్చినంత ప్రాధాన్యం ఏ జిల్లాకూ ఇవ్వలేదు. ఈ జిల్లా నా పుట్టినిల్లు కూడా. ఇంతటి అభిమానం కనబరిచినా కూడా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి నాకు అవమానం ఎదురైంది. కేవలం 2 స్థానాల్లోనే గెలిపించారు. రాజశేఖరరెడ్డిగారు చేసిన మేలును అనంతపురం ప్రజలు మరిచిపోయారా? అని చాలా బాధపడ్డా. ఈసారైనా వైఎస్సార్ పాలనను, జగన్ కష్టాన్ని గుర్తు తెచ్చుకొని.. అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టదా?
ఈ జిల్లాలో హంద్రీ–నీవా సహా ఎన్నో ప్రాజెక్టులను రాజశే ఖరరెడ్డిగారే ప్రారంభించారు. హంద్రీ–నీవాలో 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులను మాత్రం బాబు పూర్తి చేయలేదు. నీళ్లులేక, గిట్టుబాటు ధరల్లేక అనంతపురం జిల్లా రైతులు అల్లాడిపోతున్నారు. వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకూ ఆ కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వలేదు.
సీఎం సంతకానికీ విలువ లేకుండా పోయింది..
ఆనాడు ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్సార్ మొదటి సంతకం చేశారు. అది వెంటనే అమలు జరిగింది. కానీ చంద్రబాబు ఐదు సంతకాలు చేస్తే.. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. సీఎం సంతకానికీ విలువ లేకుండా పోయింది. పైగా ఎన్నికల ముందు 650 హామీలిచ్చాడు. వాటిని కూడా పట్టించుకున్న దాఖలా లేదు. రుణమాఫీ పేరుతో రైతుల్ని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని ముంచేశాడు. బాబు వస్తేనే జాబు అన్నాడు. రెండు లక్షలకు పైగా ఖాళీలున్నా.. ఈ ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.
బాబుకు ఓట్ల కోసమే బీసీలు..
చంద్రబాబుకు ఓట్ల కోసమే బీసీలు గుర్తుకొస్తారు. ఈ ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చంద్రబాబు ఏం చేశాడు? దళితులపై దాడులు చేయించాడు, భూములు లాక్కున్నాడు. మైనార్టీలను కరివేపాకులా వాడుకుని వదిలేశాడు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ చంద్రబాబు లేఖ రాశాడని జస్టిస్ ఈశ్వరయ్య గారు చెబుతున్నారు. చంద్రబాబుకు బీసీలు అంత చులకనగా కనిపిస్తున్నారా? బీసీలకు న్యాయం చేసింది ఆనాడు వైఎస్సార్ అయితే.. నేడు జగన్ మాత్రమే. బీసీలకు 41 ఎమ్మెల్యే సీట్లు, 7 ఎంపీ సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీదే. అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను కూడా బీసీలకే కేటాయించాం. బీసీ వర్గానికి చెందిన వెంకటప్ప పేరు మీద రాజశేఖరరెడ్డిగారు విద్యాలయం పెట్టారు. అందులో వేలాది మంది ఉచితంగా చదువుకుంటున్నారు.
టీడీపీ గెలిస్తే మళ్లీ కరువే..
పత్తికొండ బాగా వెనుకబడిన ప్రాంతం. రాజశేఖరరెడ్డి గారి కాలంలో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది. చంద్రబాబు పాలనలో వర్షాలు అసలే పడవు. ఇందాక ఒకాయన చెబుతున్నాడు నాకు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో అన్ని స్థానాల్లో వేరే పార్టీ గెలిస్తే.. ఇక్కడ మాత్రమే టీడీపీ గెలిచిందంట. ఆ తర్వాత జిల్లా మొత్తం వర్షాలు పడినా.. ఇక్కడ మాత్రం చినుకు కూడా పడలేదట. టీడీపీ గెలిచినా.. చంద్రబాబు వచ్చినా కరువు కూడా వెనుకే వస్తుంటుంది. ఈసారి ఈ అమ్మకు మాట ఇస్తారా? ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారా? అని అడుగుతున్నా.
ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే వ్యక్తి అన్న ఎలా అవుతాడు?
అన్న అంటే ఎప్పుడూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలవాలి. జగన్‌లా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండాలి. వారి సమస్యలపై పోరాడాలి. ప్రజలు కష్టపడకుండా చూడాలి. ఈ ఐదేళ్లలో ఏమీ ఒరగబెట్టని చంద్రబాబు పెద్దన్న ఎలా అవుతాడు? పసుపు–కుంకుమ అంటూ చంద్రబాబు చెప్పే మాయ మాటలకు మోసపోవద్దు. జగన్ సీఎం అయితే ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా అక్కచెల్లెమ్మలకే అందజేస్తాడు. రైతులకు పెట్టుబడి కోసం ఏటా రూ.12,500 వేలు ఇస్తాడు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాడు. సీపీఎస్ రద్దు చేస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment