శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరులో వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం
ఎటు చూసినా అన్యాయం, అబద్ధం,మోసపూరిత పాలన రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి..ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రి కూడలి, కనిగిరి చర్చి సెంటర్, మార్కాపురం పాత బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు సభల్లో విజయమ్మ ఏమన్నారంటే..
– కందుకూరు, కనిగిరి, మార్కాపురం
కందుకూరు సభలో....
‘‘ది వంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో మీ అందరి సంక్షేమం, అభివృద్ధి కోసమే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించింది. రాజశేఖరరెడ్డిని మీ భుజాలపై మోసి నాయకుడిగా చేశారు. ఆయన కూడా సీఎం అయ్యాక ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుని వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేశారు. జగన్ కూడా తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటున్నాడు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత వచ్చిన పాలన చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఆయన మరణం వల్ల నాకు, నా కుటుంబానికి జరిగిన నష్టం కంటే ఈ రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువగా ఉందనిపిస్తోంది. జగన్ మాట కోసమే నిలబడ్డాడు. తన కష్టాలను పక్కనపెట్టి సమైక్య రాష్ట్రం నుంచి ప్రత్యేక హోదా దాకా ప్రతి సమస్యపైనా పోరాడాడు. జగన్ చేసిన పోరాటాలు ఏవీ చంద్రబాబుకు గుర్తు రావడం లేదా?
మాపై ఎందుకంత పగ?
ఇటీవల మా కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు. నా మరిదిని పోగొట్టుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. 20 ఏళ్ల కిందట వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారు. ఆరోజు ఆయన్ను చంపినవారికి ఎవరు సాయం చేశారో, ఎవరు కాపాడారో మనమంతా చూశాం. తొమ్మిదేళ్ల క్రితం వైఎస్సార్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. నాలుగు నెలల క్రితం జగన్‌ను హత్య చేయాలనుకున్నారు. గుండుసూది కూడా ప్రవేశించలేని విశాఖ ఎయిర్‌పోర్టులోకి కత్తులు ఎలా వెళ్లాయని అడుగుతున్నా. జగన్ ఇంటిని వదిలిపెట్టి నెలల తరబడి ప్రజల్లో తిరిగారు. మా కుటుంబంపై ఎందుకంత పగ? ఎందుకంత శత్రుత్వమో దేవుడికే తెలియాలి. మీ ఆశీర్వాద బలమే జగన్‌ను నడిపిస్తోంది.
ప్రాణాలు పోసే కుటుంబం మాది
వాళ్ల చిన్నాన్న చనిపోతే జగన్ ఏదో చేశాడని నిందలు వేస్తున్నారు. అన్యాయంగా మాట్లాడుతున్నారు. మా కుటుంబం ఇంట్లో వారికే కాదు.. బయటివారికి కూడా ప్రాణం పెడుతుంది. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక కూడా రాజారెడ్డి హంతకుల పట్ల చట్టం తన పని తాను చేస్తుందని వదిలేశారు. అలాంటి వ్యక్తిత్వం మాది. వివేకానందరెడ్డి మృతిపై సీబీఐ దర్యాప్తు లేదా మూడో పార్టీతో విచారణ జరిపించాలని మేం కోరాం. మరి సీబీఐ విచారణకు ఆదేశించడానికి చంద్రబాబుకు భయమెందుకు? నాడు పరిటాల రవి హత్యకు గురైతే జగనే కారణమంటూ చంద్రబాబు అసెంబ్లీలో నానా యాగీ చేశారు. వైఎస్సార్ ఆరోజు తన కుమారుడు అని కూడా చూడకుండా జగన్ తప్పు చేస్తే ఉరి తీయమని అసెంబ్లీలో సవాల్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించారు. చంద్రబాబు అలిపిరిలో బాంబుదాడికి గురైతే వైఎస్సార్ తీవ్రంగా ఖండించడంతోపాటు మావోయిస్టులకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు. మరి చంద్రబాబు పుత్రరత్నానికి వివేకానందరెడ్డి చనిపోయారంటే పరవశంగా ఉందట. చంద్రబాబు ఎంతసేపూ జగన్.. జగన్ అంటూ జపం చేస్తున్నారు. ఆయన ఎంత జపం చేస్తే అంత ఆశీర్వాదమని నేను చెబుతున్నా.
నాయకుడంటే ఏం చేశారో చెప్పగలగాలి..
ఐదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబుకు ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రజలు గుర్తుకొచ్చారు. ఆయన ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి 70 శాతం పనులు పూర్తి చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. గుండ్లకమ్మ ప్రాజెక్టును 98 శాతం పూర్తి చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధికి నిధులిచ్చారు. కానీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది.
నవరత్నాలతో అందరి సంక్షేమం
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా జగన్ నవరత్నాల పథకాలను ప్రకటించాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వైఎస్సార్ ఆసరా పథకం కింద ఆదుకోవడంతోపాటు మళ్లీ సున్నా వడ్డీ రుణాల విప్లవాన్ని తెస్తాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాడు. చికిత్స వ్యయం రూ.1,000 దాటిన ప్రతి వ్యాధికీ ఆరోగ్యశ్రీ వర్తింపచేసి దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం కల్పిస్తాడు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి ఏటా మే నెలలో రూ. 12,500 చొప్పున అందచేస్తాం. వ్యవసాయాన్ని పండుగ చేయడమే జగన్ లక్ష్యం. జగన్ ఏదైనా చెబితే కచ్చితంగా చేస్తాడు. ఏదైనా అనుకుంటే అది సాధిస్తాడు. ఒక్క అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తెచ్చి మీ అందరి అవసరాలు తీరుస్తాడు.
కనిగిరి సభలో..
వైఎస్సార్‌సీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న 25 మందిని ఎంపీలుగా గెలిపించుకుని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. 25 మందిని ఎంపీలుగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎల్లయ్య ఉన్నా.. పుల్లయ్య ఉన్నా ఎవరున్నా సరే ప్రత్యేక హోదా సాధిస్తాం. హోదా ఇచ్చేవారికే మా మద్దతు ఉంటుంది. ఎన్నికలు రాగానే చంద్రబాబు ఎవరెవరితో కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలి. చంద్రబాబు బీజేపీతో అంటకాగినప్పుడు.. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని మాపై విమర్శలు చేశాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ చెంతకు చేరుకుని బీజేపీ, కేసీఆర్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తున్నాడు. అసలు కేసీఆర్‌కు, మన రాష్ట్రానికి సంబంధం ఏమిటి?
జగన్ వస్తే రయ్ రయ్ మంటూ 108
వైఎస్సార్ హయాంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయి. ఆయన్ను పోగొట్టుకున్న తరువాత మీరంతా పడుతున్న కష్టాలు మాకు తెలుసు. చంద్రబాబు గత ఎన్నికల్లో 650కిపైగా వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అగ్రిగోల్డ్ బాధితులకు మా పార్టీ అండగా ఉంటుంది. ఇప్పుడు 108 వాహనాలు కుయ్ కుయ్ మంటూ రావట్లేదు. జగన్ వస్తే రయ్ రయ్ మంటూ వస్తాయి. మీకోసమే జగన్ ఇంత మొండిగా ముందుకు వెళ్తున్నాడు.
వైఎస్సార్‌కు విజయమ్మ నివాళి
వేంపల్లె: వైఎస్ విజయమ్మ అంతకుముందు శుక్రవారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం సభలో..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2 వేలు చేస్తామని రెండేళ్ల క్రితమే నవరత్నాల పథకాల్లో జగన్ ప్రకటించడంతో చంద్రబాబు ఎన్నికల ముందు పింఛన్ పెంచాడు. జగన్ పెంచుతామని ప్రకటన చేయకపోతే అసలు చంద్రబాబు పెంచేవారా?
ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు..
వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచార సభల్లో ఒంగోలు, నెరు వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డితోపాటు కందుకూరు, కనిగిరి, మార్కాపురం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మానుగుంట మహీధరరెడ్డి, బుర్రా మధుసూధన్ యాదవ్, కుందురు నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాతలు పెట్టుకుంటే నక్క.. పులి కాలేదు
ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తున్నారు. జగన్ రెండేళ్ల క్రితమే నవరత్నాల పథకాలను ప్రకటించాడు. వాటిని కాపీ కొట్టి నేను చేస్తా అంటూ చంద్రబాబు చెబుతున్నాడు. ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి కాలేదు. పులి పులే.. నక్క నక్కే అవుతుంది. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment