బాబు విన్యాసాలతో ప్రజాస్వామ్యం ఖూనీ   | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు విన్యాసాలతో ప్రజాస్వామ్యం ఖూనీ  

Published Sat, Apr 27 2019 3:39 AM | Last Updated on Sat, Apr 27 2019 3:39 AM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ ముగిశాక సీఎం చంద్రబాబు రోజుకోరకంగా నాటకాలాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మీద ఆయనకు ఆజన్మాంతం హక్కు ఉన్నట్టు, కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనే వ్యవస్థ ఆ హక్కును పూర్తిగా తీసేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టు రోజుకో విన్యాసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. తన హక్కులను రాజ్యాంగ సంస్థల ద్వారా కాలరాస్తున్నారనేలా తన అనుకూల మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌ పూర్తయ్యాక.. ఫలితాలు వెలువడేంత వరకూ ఆ వ్యవధిలో ప్రభుత్వ వ్యవహారాలన్నీ అధికారులు చూసుకోవాలని, ఈలోపు ఏ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా వారికి అవసరమైన వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం వేదిక సిద్ధం చేస్తే బాగుంటుందని.. కానీ చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  

ఏ లోకంలో ఉన్నారో అర్థం కావడం లేదు 
పోలింగ్‌ ముగిశాక హుందాగా ఉండాల్సిన వ్యక్తి గంగవెర్రులెత్తి ఏదో జరిగిపోయిందంటూ ఆందోళన చెందడమేంటని ప్రశ్నించారు. తాను నెల పాటు సమీక్షలు జరపకపోతే.. రేపు రాష్ట్రంలో ఏవైనా గందరగోళ పరిస్థితులు తలెత్తి నష్టపోతే అందుకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ నష్టాన్ని ఖర్చులతో సహా న్యాయపరంగా ఎన్నికల కమిషన్‌ నుంచి రాబట్టుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లేఖ ఇలా రాసిందెవరని, చంద్రబాబు దానిపై ఎలా సంతకం చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను సమీక్ష చేయకుంటే పోలవరం ఖర్చులు పెరిగిపోతాయని కూడా లేఖలో పేర్కొన్నారని.. ఇదంతా చూస్తే అసలు చంద్రబాబు ఏ లోకంలో ఉన్నారో అర్థంకావడం లేదన్నారు.  

పైకి పోలవరం.. లోపల బిల్లుల క్లియరెన్స్‌లు 
సమీక్షల పేరుతో ఇంకా దోచుకుందామనే చంద్రబాబు చూస్తున్నారని.. అందుకే ‘నా సమీక్షలు ఆపుతారా?’ అంటూ ప్రశ్నిస్తున్నారని సజ్జల విమర్శించారు. పోలవరంపై ఆయన చేసిన సమీక్షల తీరు చూస్తే పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసుకుని వాటిపై తనకు రావాల్సినవి రాబట్టుకునేందుకేనని అర్థమవుతోందన్నారు. పేరుకు మాత్రం పోలవరం ప్రాజెక్టు, మంచినీటి సరఫరా అంశాలపై సమీక్ష అని చెబుతున్నారని.. పోలవరంపై సమీక్ష సాగాక అధికారులు మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు అవసరమవుతాయని చెప్పగానే తర్వాత చూద్దాంలే అంటూ చంద్రబాబు లేచి వెళ్లిపోయారని చెప్పారు. 

బాబు సమీక్షలు పెట్టి ఉంటే వారు చనిపోయేవారు కాదట! 
రాష్ట్రంలో పిడుగులు పడి ఏడుగురు చనిపోయారని, ఒక వేళ చంద్రబాబు కనుక సమీక్షలు నిర్వహించి ఉంటే నివారణ చర్యల ద్వారా పిడుగులను ఆపి ఏడుగురి ప్రాణాలు కాపాడి ఉండేవాళ్లమని ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారని.. ఐదేళ్లలో పిడుగుపాటు బారిన పడకుండా చంద్రబాబు ఎంతమందిని కాపాడారని సజ్జల ప్రశ్నించారు. లేఖలో తన 40 ఏళ్ల అనుభవాన్ని ఏకరవు పెట్టుకున్నారని, తానేం చేసినా ఎవరూ అడగకూడదని, అడ్డుతగలరాదన్నట్టుగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మే 23న ఫలితాలొచ్చాక 26న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలనుకుంటారని తాము పూర్తివిశ్వాసంతో ఉన్నామని.. అయితే జూన్‌ 8 వరకూ సీఎంగా ఉంటానని చంద్రబాబు ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు చండీగఢ్‌కు వెళుతున్నారని, తర్వాత ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌కు వెళతారటని.. ఉత్తరాది భాష రాని బాబు అక్కడికెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఆయనకు పార్లమెంటులో సభ్యులెవరూ ఉండరుగనక.. రేపు వారి మద్దతు అవసరం గనకే.. తనను హింసిస్తున్నారన్న భావనను చంద్రబాబు తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఈవీఎంల మీద రచ్చ చేయడం, కేసుల నుంచి తప్పించుకోవడం, పార్టీని నిలబెట్టుకోవడం.. ఇవే ప్రస్తుతం చంద్రబాబు లక్ష్యాలని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.   

లావాదేవీలున్నందునే సీఆర్డీఏపై సమీక్ష 
రాజధాని విషయంలో లావాదేవీలున్నందునే సీఆర్డీఏపై రివ్యూ చేశారని, నెల రోజుల్లోనే ఏదో భవనం కట్టేసినట్టుగా సమీక్షించారని మండిపడ్డారు. శాంతిభద్రతల సమీక్ష పేరుతో టీడీపీ నేతలపై ఉన్న కేసుల మాఫీకి సీఐడీ శాఖపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు చూస్తున్నారని.. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందోనన్న భయంతోనే టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న కేసులు మూసేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్‌ సీఎంగా ఉన్నపుడు 2009 ఎన్నికల్లో పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి 23 రోజుల వ్యవధి ఉందని, అప్పుడు ఆయన ఏనాడూ ఇలా సమీక్షలు నిర్వహించలేదని సజ్జల గుర్తుచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement