సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు కళ్లకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయని, అందుకే చంద్రబాబు ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో పడ్డారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమిలో తన తప్పేమీ లేదని, తన పాలన గానీ, తాను తీసుకున్న నిర్ణయాలు గానీ ఓటమికి కారణం కాదని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారన్నారు. ఈవీఎంలలో లోపాలు, కేంద్ర ఎన్నికల సంఘం పోకడలు, కమిషన్ సహాయ నిరాకరణ వల్లే ఫలితాలు ఇంత ఘోరంగా వచ్చాయని చెప్పుకోవడానికి చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారని సజ్జల అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత హూందాగా ఉండాల్సిన తరుణంలో చంద్రబాబు వ్యవహారశైలి చూస్తే సాకులు వెతికే పనిలో ఉన్నారనే విషయం అర్థమవుతోందన్నారు. నిజంగా ఈవీఎంల పనితీరుపై చంద్రబాబుకు సందేహాలుంటే వివిధ రాజకీయ పక్షాలతో కలిసి పోరాడవచ్చని, అయితే ఈవీఎం దొంగతనం కేసులో నిందితుడు అయిన వేమూరి హరిప్రసాద్ సలహాతో వ్యవస్థపై పోరాడటం ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలపై ప్రజెంటేషన్ ఇచ్చి ఆయా రాజకీయ పార్టీల అనుమానాలను నివృత్తి చేసిందని సజ్జల తెలిపారు. దేశంలో ఒక స్వతంత్ర సంస్థ అయిన ఈసీ మార్గదర్శకాలకు లోబడే ఎన్నికలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల పక్రియ మరింత ముందుకు..
వీవీప్యాట్ల ఏర్పాటుతో ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు వెళ్లిందన్నారు. ఎన్నికలు అనే ఆట ముగిసిందన్నారు. అంపైర్ ఆట నిర్వహించిన తరువాత అభ్యంతరాలను వ్యక్తం చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఓవైపు చంద్రబాబు అంటూనే ఈ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు సాధిస్తామని మరోవైపు చెబుతున్నారని సజ్జల విమర్శించారు. ఫలితాలు వెలువడక ముందే చంద్రబాబు టీడీపీకి విజయం చేకూర్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ విశ్లేషిస్తే వైఎస్సార్ సీపీ ఘన విజయం ఖాయమనే విషయం తెలిసి పోతోందని.. అందుకే చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నారని ఆయన అన్నారు.
పార్టీ నేతలను కాపాడుకోవడానికే..
పసుపు–కుంకుమ, పింఛన్లు ఇచ్చినా కూడా ఓటమి పాలయ్యామంటే.. ఎన్నికల వ్యవస్థ లోపాలు, ఈసీ వ్యవహారశైలే కారణమంటూ వారి పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారన్నారు. టీడీపీ ఓటమి ఖాయమైన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలను కాపాడుకోవడానికి ఆయన ఇలా చేస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు కర్నూలులో సమీక్ష నిర్వహించినపుడు ఆ పార్టీ సీనియర్ నేతలు, పోటీ చేసిన అభ్యర్థులు కూడా పూర్తిగా హాజరుకాలేదన్నారు. ఫలితాలకు ముందే చంద్రబాబును ఆ పార్టీ నేతలు పట్టించుకోవడం మానేశారని చెప్పారు. టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఆయన నిరాశాతో ఉన్నారనేది స్పష్టం అవుతోందన్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హూందాగా వ్యవహరించాలని, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని చెప్పారు. కానీ చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా నిర్భయంగా ఓట్లు వేశారన్నారు. తమ పార్టీకి కూడా అనేక నోటీసులు ఎన్నికల సంఘం ఇస్తే వాటికి సమాధానాలు ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment