బస్తర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్న రాహుల్
రాజ్యాంగం విషయంలో బీజేపీపై రాహుల్ విమర్శలు
జగ్దల్‌పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్‌సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.
‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు.
ఆదివాసీ.. వనవాసీ
‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు.
మేమొస్తే రైతు రుణమాఫీ
మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment