షిండే మాతో చెప్పారు: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ రూపొందించాల్సిన కేబినెట్ నోట్ ఇంకా తయారు కాలేదని సుశీల్‌కుమార్ షిండే తమకు చెప్పినట్లు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను తెలుసుకుని, పరిష్కారాలు చూపేందుకు ఏర్పాటైన ఆంటోనీ నేతృత్వంలోని కమిటీతో అన్ని అంశాలను చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు హామీ ఇచ్చారని వారు శనివారం మీడియాకు చెప్పారు. సీమాంధ్రప్రాంత కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాయపాటి సాంబశివరావు, కె.వి.పి.రామచంద్రరావులు శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
40 నిమిషాలపాటు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలపై దృష్టిపెడతాం. అక్కడి ప్రజల మనోభావాలు, సమస్యలను తెలుసుకుంటున్న ఆంటోనీ కమిటీతో నేనూ చర్చిస్తా. కమిటీతో చర్చించాకే కేబినెట్ నోట్ తయారవుతుంది. ఇప్పటివరకు కేబినెట్ నోట్ తయారు కాలేదు. ఇరు ప్రాంతాల బాగోగులు కోరుకుంటున్నాం.
ఆ దిశగానే ముందుకు వెళతాం అని షిండే మాతో చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట షిండే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విభజనపై కేబినెట్ నోట్ సిద్ధమైందని, దాన్ని తానింకా చూడలేదని పేర్కొ నడం తెలిసిందే. నోట్ సిద్ధమైందని షిండే స్పష్టంచేయగా.. శనివారం ఆయన్ను కలిసిన అనంతరం సీమాంధ్ర నేతలు నోట్ ఇంకా సిద్ధం కాలేదని షిండే తమకు చెప్పారంటూ మీడియాతో పేర్కొనటం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర విభజనమీద కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పార్టీ ప్రతినిధులను ఎక్కడికక్కడ గట్టిగా నిలదీస్తున్నారని షిండేకు సీమాంధ్ర నేతలు వివరించినట్లు తెలిసింది. ఫలితంగా తాము సొంత నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నట్టు సమాచారం. కాగా కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ టీ-నోట్ ఇంకా తయారు కాలేదని, ఆంటోనీ కమిటీతో అన్ని అంశాలపై చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు తెలిపారన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని ప్రజల మనోభావాల్ని షిండేకి వివరించామని కిల్లి కృపారాణి చెప్పారు.