Susheel Kumar Shide
-
'ఐఎస్ఐ గాలం వేసిందన్నవార్తలు నిరాధారం'
ముజాఫర్‌నగర్: పాకిస్థాన్ అనుబంధంగా పనిచేస్తున్నఐఎస్ఐ మైనార్టీ యువతకు గాలం వేసి నగరంలో అల్లర్లకు కారణమైందన్న వార్తలను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఖండించారు.ముజాఫర్ నగర్ లో గతంలో జరిగిన అల్లర్లతో ఐఎస్ఐకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మైనార్టీ కుటంబాల్లోని యువతను పాకిస్థాన్ పక్కదోవ పట్టిస్తూ అల్లర్లకు కారణమవుతుందన్నరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభలో నిలదీసింది. బీజేపీ సభ్యుడు ప్రకాశ్ దేవకర్ లేవనెత్తిన ఈ అంశంపై షిండే రాత పూర్వంగా సమాధానం ఇచ్చారు. ముస్లిం యువతను ఐఎస్ఐ కలిసిందన్న దానిపై ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. ముజాఫర్ నగర్ అల్లర్లకు ముస్లిం యువతను పాకిస్తాన్ గాలం వేస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పుడు పెద్ద దుమారం లేచింది. దీనిపై రాహుల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశం తాజాగా రాజ్యసభలో చర్చకు దారి తీయడంతో హోంమంత్రి షిండే సమధానం ఇచ్చారు. -
తదుపరి సమావేశాల్లో తెలంగాణ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో పెడుతుందని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ బిల్లుతోపాటు మత హింస నిరోధక బిల్లును కూడా వచ్చే సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు తెస్తామని పేర్కొన్నారు. అయితే సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం, ఆయన నుంచి బిల్లు అభిప్రాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్లడం, ప్రస్తుతం బిల్లు అసెంబ్లీలో ఉండటం తెలిసిందే. మత హింస నిరోధక బిల్లును బుధవారంతో ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెట్టడానికి కేంద్రం ప్రయత్నించి విఫలమైంది. ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
స్వలింగ సంపర్కంపై ఆర్డినెన్స్ ఉండదు:షిండే
బెంగళూరు: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును నిలువరించడానికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టంచేశారు. శనివారం బెంగళూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. సుప్రీం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్‌ను తీసుకు రాదలచుకోలేదని చెప్పారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం నిరాశ కలిగించిందని, ఇక ఈ అంశాన్ని పార్లమెంటు పరిష్కరిస్తుందని సోనియా.. స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనే తాను ఏకీభవిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని, దాన్ని సరి చేయించడానికి అవసరమైన అన్ని మార్గాలనూ పరిశీలిస్తామని చెప్పింది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని, రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావించింది. అయితే షిండే ప్రస్తుతానికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే ఆలోచన ఏది ప్రస్తుతానికి లేదని తేల్చిచెప్పారు. అంతకు ముందు యలహంకలో జాతీయ గూఢచర్య గ్రిడ్ విపత్తు పునశ్చేతన కేంద్రానికి (నాట్‌గ్రిడ్) షిండే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశంలో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడంలో నాట్‌గ్రిడ్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. గూఢచర్య, భద్రతా సిబ్బంది అవిశ్రాంతంగా సేవలందిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదుల బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. ఇలాంటి సమయాల్లో టెక్నాలజీ కొరత ప్రతిబంధకంగా మారుతోందన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి నాట్‌గ్రిడ్ ఎంతో సహాయకారి కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో ముందున్న బెంగళూరు నగరం నాట్‌గ్రిడ్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమని ఆయన చెప్పారు. -
ఎంత టైమిస్తారో తెలీదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్ద ఉందని, బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి ఆయన రాష్ర్ట శాసనసభకు ఎంత సమయం ఇస్తారో తనకు తెలీదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే విషయమై ఇంకా ఏమీ ఆలోచించలేదని చెప్పారు. ప్రస్తుత సమావేశాలపైనే తమ దృష్టి కేంద్రీకృతమై ఉందని, ఈ సమావేశాల్లోనే బిల్లును పెట్టడానికి ప్రయత్నిస్తామని అన్నారు. తెలంగాణ సహా మొత్తం మూడు కీలక బిల్లుల్ని శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపారు. హోంశాఖ నెలవారీ నివేదిక విడుదలకు ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విభజనపై పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు వస్తుందని మీరు ఆశిస్తున్నారా? అని అడగ్గా.. ‘బిల్లుకు ముందుగా కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇస్తుంది. కేబినెట్ నుంచి అది రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పడానికి వీలుగా కొంత సమయం ఇస్తారు. ఆయన ఎంత సమయం ఇస్తారనేది నాకైతే తెలియదు. ఆ తర్వాత బిల్లు తిరిగి రాష్ట్రపతికి వస్తుంది. రాష్ర్టపతి దాన్ని మా మంత్రిత్వశాఖకు పంపిస్తారు. సిఫారసుల ప్రకారం అప్పుడు మేం మళ్లీ కేబినెట్‌కు పంపిస్తాం. చివరగా బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుంది..’ అంటూ షిండే సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 కింద రాష్ట్రాన్ని విభజించాలని మీరు నిర్ణయించారు, ఇలా చేయడం తప్పుడు ఉదాహరణ కాబోదా? అన్న ప్రశ్నకు.. ‘కాదు.. అది తప్పుడు నిదర్శనం అవ్వదు..’ అని జవాబిచ్చారు. రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నామని, రాష్ట్రం నుంచి తీర్మానం లేకుండానే రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని చట్టం అనుమతిస్తోందని చెప్పారు. బిల్లును అసెంబ్లీకి పంపుతున్నామని, పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుందని షిండే వ్యాఖ్యానించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు చర్చకొస్తుందా అని అడగ్గా, ‘చూద్దాం.. ఈ సమావేశాల్లోనే బిల్లును పెట్టడానికి ప్రయత్నిస్తాం’ అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందే తెలుసునని, 2004 ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశం ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, హైదరాబాద్‌పై ప్రత్యేక నిబంధనలు, రాష్ట్రంలో అదనపు బలగాల మోహరింపు అంశాలపై ప్రశ్నలకు షిండే స్పందిస్తూ.. ‘‘పోలవరం ప్రాజెక్టును మేమే కడతామని హామీ ఇచ్చాం. ఆర్ఆర్ ప్యాకేజీ కూడా మేమే ఇస్తామన్నాం. కేంద్రమే దాన్ని పూర్తిచేస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారమేం పడదు. హైదరాబాద్ హోదా విషయంలో ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. అందులో ఎలాంటి మార్పు లేదు.’’ అని చెప్పారు. సభలో అంతా గందరగోళం: కాంగ్రెస్ ఎంపీలే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇవ్వడంపై మాట్లాడుతూ.. అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని షిండే చెప్పారు. క్రమశిక్షణా రాహిత్యం లాంటిది ఏమైనా ఉంటే పార్టీ ఆ విషయమై జాగ్రత్త తీసుకుంటుందన్నారు. ‘అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని స్పీకర్ ఈ రోజు సభలో చెప్పారు. కానీ సభలో ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు. అక్కడంతా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో తెలీని అయోమయ పరిస్థితి ఏర్పడింది. దాంతో సభను వాయిదా వేశారు’ అని అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించడం, అనుమతించక పోవడంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. స్పీకర్‌పై విపక్షం అవిశ్వాసానికి సిద్ధమవుతున్న అంశాన్ని దృష్టికి తేగా.. ‘ఈ విషయమై ఇప్పటివరకూ ఏ నోటీసు అక్కడ అందలేదు. స్పీకర్ తన బాధ్యతలను నిర్వర్తిస్తారు, ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. తనకు అందినవాటిపై స్పీకర్ చర్య తీసుకుంటారు కదా’ అంటూ జవాబిచ్చారు. తెలంగాణ సహా మూడు కీలక బిల్లులు: ఈ శీతాకాల సమావేశాల్లో మూడు కీలక బిల్లులు.. జన లోక్‌పాల్, మతహింస, తెలంగాణ బిల్లుల్ని సభ ముందుంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు షిండే తెలిపారు. ఈ విషయమై తమ ఆలోచన స్పష్టంగా ఉందని, ఈ మూడు బిల్లుల్ని పార్లమెంటు ముందుంచాలని అనుకుంటున్నట్టు చెప్పారు. జన లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిందని, తర్వాత రాజ్యసభకు వెళ్లగా ఎగువ సభ దాన్ని సెలక్ట్ కమిటీకి నివేదించిందని తెలిపారు. సెలెక్ట్ కమిటీ కొన్ని సవ రణలు సిఫారసు చేయగా.. సవరణలతో కూడిన బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఈ బిల్లును తక్షణమే చేపట్టాల్సిందిగా కోరుతూ సంబంధిత మంత్రి రాజ్యసభకు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. మతహింస సంబంధిత బిల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. ఇటీవల దీనిపై విసృ్తత చర్చ జరిగిందన్నారు. బిల్లు విషయంలో అభ్యంతరాలున్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నేరుగా తనను సంప్రదించవచ్చని, తనకు లేదా తన మంత్రిత్వశాఖ అధికారులకు సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందిస్తూ.. గెలుపోటములు అనేవి కొత్త విషయం కాదని, అవి జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఎన్నికలన్నాక అవి సహజమేనంటూ కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం గుర్తుచేశారు. ఫలితాలను విశ్లేషిస్తామని సోనియూగాంధీ, రాహుల్ చెప్పారన్నారు. నెలాఖరు వరకూ రాష్ట్రంలోనే బలగాలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించామని.. బలగాలను నెలాఖరు వరకు రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయించామని షిండే చెప్పారు. శాంతిభద్రతల నిమిత్తం ఇప్పటికే అదనంగా మోహరించిన 95 కంపెనీల బలగాలు (ఆర్ఏఎఫ్-4, సీఆర్పీఎఫ్-50, బీఎస్ఎఫ్-33, సీఐఎస్ఎఫ్-8) డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన హోంశాఖ నెలవారీ నివేదికను విడుదల చేశారు. ‘‘రాష్ట్రానికి బలగాల విషయానికొస్తే, ఎక్కడైతే శాంతిభద్రతల సమస్య ఉంటుందని ముందే ఊహిస్తామో, అక్కడ బలగాలను మోహరించడం, పరిస్థితి అదుపులోకి రాగానే బలగాలను అక్కడినుంచి ఉపసంహరించడమనేది సాధారణ ప్రక్రియ’ అని చెప్పారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఆధునిక ఫైరింగ్ రేంజ్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు షిండే తెలిపారు. అకాడమీలో ఫైరింగ్ రేంజ్ నిర్మాణం కోసం నవంబర్ 26న రూ. 3.19 కోట్లను విడుదల చేశామని చెప్పారు. కాగా, హెలెన్, లెహర్ తుపాన్లకు సంబంధించి ముందుగానే రాష్ట్రానికి హెచ్చరికలు పంపామని.. దాంతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళాలను మోహరించామని తెలిపారు. -
తెలంగాణ నోట్ ఆలస్యం!
-
తెలంగాణ నోట్ ఆలస్యం!
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ వారం, పదిరోజులు ఆలస్యమయ్యే అవకాశముంది. తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను కేంద్ర హోంశాఖ ఇంకా ఖరారు చేయలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. నోట్ ముసాయిదాకు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంకా ఆమోదం తెలపలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని వెల్లడించింది. ఏకే ఆంటోనీ కమిటీ నివేదిక కోసం షిండే వేచిచూస్తున్నారని పేర్కొంది. అలాగే ముసాయిదాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుంచి వారి ఆమోదం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ముసాయిదా ఖరారయ్యాక న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతారు. అక్కడి నుంచి కేబినెట్ ముందుకు వస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు తెలంగాణ నోట్ వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ ఇంకా సిధ్దం కాలేదని, తుదిమెరుగులు దిద్దుకోలేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నిన్న ఢిల్లీలో చెప్పారు. తెలంగాణ నోట్ అక్టోబర్ మొదటివారంలో కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్న అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రుల అభ్యంతరాలపై ఆంటోనీ కమిటీ రూపొందించే సిఫార్సులను కేబినెట్ నోట్లో చేర్చాలన్నది తమ డిమాండ్ అనీ, అయినా, అన్ని అంశాలను నోట్లో చేర్చలేరని, కేబినెట్ ముందుంచే నోట్ సంక్షిప్తంగా ఉంటుందని ఆమె అన్నారు. -
టీ-నోట్ తయారు కాలేదు..
షిండే మాతో చెప్పారు: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ రూపొందించాల్సిన కేబినెట్ నోట్ ఇంకా తయారు కాలేదని సుశీల్‌కుమార్ షిండే తమకు చెప్పినట్లు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను తెలుసుకుని, పరిష్కారాలు చూపేందుకు ఏర్పాటైన ఆంటోనీ నేతృత్వంలోని కమిటీతో అన్ని అంశాలను చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు హామీ ఇచ్చారని వారు శనివారం మీడియాకు చెప్పారు. సీమాంధ్రప్రాంత కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాయపాటి సాంబశివరావు, కె.వి.పి.రామచంద్రరావులు శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 40 నిమిషాలపాటు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలపై దృష్టిపెడతాం. అక్కడి ప్రజల మనోభావాలు, సమస్యలను తెలుసుకుంటున్న ఆంటోనీ కమిటీతో నేనూ చర్చిస్తా. కమిటీతో చర్చించాకే కేబినెట్ నోట్ తయారవుతుంది. ఇప్పటివరకు కేబినెట్ నోట్ తయారు కాలేదు. ఇరు ప్రాంతాల బాగోగులు కోరుకుంటున్నాం. ఆ దిశగానే ముందుకు వెళతాం అని షిండే మాతో చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట షిండే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విభజనపై కేబినెట్ నోట్ సిద్ధమైందని, దాన్ని తానింకా చూడలేదని పేర్కొ నడం తెలిసిందే. నోట్ సిద్ధమైందని షిండే స్పష్టంచేయగా.. శనివారం ఆయన్ను కలిసిన అనంతరం సీమాంధ్ర నేతలు నోట్ ఇంకా సిద్ధం కాలేదని షిండే తమకు చెప్పారంటూ మీడియాతో పేర్కొనటం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజనమీద కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పార్టీ ప్రతినిధులను ఎక్కడికక్కడ గట్టిగా నిలదీస్తున్నారని షిండేకు సీమాంధ్ర నేతలు వివరించినట్లు తెలిసింది. ఫలితంగా తాము సొంత నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నట్టు సమాచారం. కాగా కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ టీ-నోట్ ఇంకా తయారు కాలేదని, ఆంటోనీ కమిటీతో అన్ని అంశాలపై చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు తెలిపారన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని ప్రజల మనోభావాల్ని షిండేకి వివరించామని కిల్లి కృపారాణి చెప్పారు. -
రాష్ట్ర విభజన ఆపమని కేంద్ర మంత్రి షిండేకు విజయమ్మ లేఖ
-
విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి:
-
విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోందని.. ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ మొదటి నుంచీ చెప్తున్నట్లుగా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజయమ్మ శుక్రవారం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజన అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయంటూ తీవ్ర ఆందోళన, విచారం వ్యక్తం చేశారు. ఇది మౌలిక న్యాయసూత్రాలకు విరుద్ధమని, వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎంలు విభజనకు పూర్తిగా వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించటమేనని తప్పుపట్టారు. ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఆపివేయాలని, విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రికి విజయమ్మ రాసిన లేఖ పూర్తి పాఠం... ‘‘గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే గారికి, మేం పదే పదే ఆందోళనలు వ్యక్తంచేసినప్పటికీ.. రాష్ట్రంలో 60 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రూపకల్పనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మేం మీడియా ద్వారా తెలుసుకున్నామని మీకు తెలియజేయటానికి విచారిస్తున్నాం. ఇది మౌలిక న్యాయసూత్రాలను విస్మరించటమే అవుతుంది. రాష్ట్ర విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఐ(ఎం)లు వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే అవుతుంది. ఈ అన్యాయాన్ని ఆపాలని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని మేం పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కేవలం ఓట్లు, సీట్ల కోసం మాత్రమే ఈ అన్యాయం చేయటానికి కేంద్రం ముందుకు వెళ్లటం దురదృష్టకరం. కనీసం ఇప్పటికైనా.. మా రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ అన్యాయాన్ని ఆపివేయాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. వైఎస్సార్సీపీగా మేం గతంలోనే చెప్పినట్లు ఈ విభజన చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ’’ కృతజ్ఞతలతో వై.ఎస్.విజయమ్మ