స్వలింగ సంపర్కంపై ఆర్డినెన్స్ ఉండదు:షిండే
బెంగళూరు: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును నిలువరించడానికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టంచేశారు. శనివారం బెంగళూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. సుప్రీం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్‌ను తీసుకు రాదలచుకోలేదని చెప్పారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం నిరాశ కలిగించిందని, ఇక ఈ అంశాన్ని పార్లమెంటు పరిష్కరిస్తుందని సోనియా.. స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనే తాను ఏకీభవిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని, దాన్ని సరి చేయించడానికి అవసరమైన అన్ని మార్గాలనూ పరిశీలిస్తామని చెప్పింది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని, రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావించింది. అయితే షిండే ప్రస్తుతానికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే ఆలోచన ఏది ప్రస్తుతానికి లేదని తేల్చిచెప్పారు. అంతకు ముందు యలహంకలో జాతీయ గూఢచర్య గ్రిడ్ విపత్తు పునశ్చేతన కేంద్రానికి (నాట్‌గ్రిడ్) షిండే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశంలో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడంలో నాట్‌గ్రిడ్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. గూఢచర్య, భద్రతా సిబ్బంది అవిశ్రాంతంగా సేవలందిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదుల బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. ఇలాంటి సమయాల్లో టెక్నాలజీ కొరత ప్రతిబంధకంగా మారుతోందన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి నాట్‌గ్రిడ్ ఎంతో సహాయకారి కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో ముందున్న బెంగళూరు నగరం నాట్‌గ్రిడ్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమని ఆయన చెప్పారు.