గే సెక్స్ వల్లే భూకంపాలు!
ఘనా దేశంలో హోమోసెక్సువల్స్ మీద పెరుగుతున్న దాడులను ముస్లిం మత పెద్ద ఒకరు సమర్థించారు. అసలు గే సెక్స్ అనేది అల్లాను అవమానిస్తుందని, దానివల్లే భూకంపాలు వస్తున్నాయని ఆయన అన్నారు. కుమాసి నగరంతో పాటు రాజధాని అక్రాలో స్వలింగ సంపర్కుల మీద జోంగో వర్గానికి చెందినవాళ్లు దాడులు చేస్తున్నట్లు కథనాలు రావడంతో ముస్లిం మత గురువు అయిన మల్లమ్ అబ్బాస్ మహ్మూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మగవాళ్ల మధ్య లైంగిక సంబంధం ఉంటే అల్లా చాలా చిరాకు పడతారని, దానివల్లే భూకంపాలు వస్తాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
తమ మీద దాడులు జరుగుతాయన్న ఆందోళనతో పలువురు గే పురుషులు ఇళ్లు వదిలిపెట్టి పారిపోయారు. సొడోమ్, గొమొర్రా నగరాల్లో స్వలింగ సంపర్కం ఎక్కువ కావడం వల్లే అల్లా ఆ రెండు పురాతన నగరాలను నాశనం చేశారని మహ్మూద్ చెప్పారు. పవిత్ర ప్రబోధాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ తరహా చర్యలను మన వర్గాల్లో అనుమతించాలా అని ప్రశ్నించారు. అలాంటి ఇడియట్లను జోంగో వర్గం నుంచి తరిమేయడం తమకు చాలా సంతోషమని కూడా చెప్పారు. ఘనా దేశంలో హోమోసెక్సువాలిటీ నేరం.