తదుపరి సమావేశాల్లో తెలంగాణ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో పెడుతుందని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ బిల్లుతోపాటు మత హింస నిరోధక బిల్లును కూడా వచ్చే సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు తెస్తామని పేర్కొన్నారు. అయితే సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు.
తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం, ఆయన నుంచి బిల్లు అభిప్రాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్లడం, ప్రస్తుతం బిల్లు అసెంబ్లీలో ఉండటం తెలిసిందే. మత హింస నిరోధక బిల్లును బుధవారంతో ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెట్టడానికి కేంద్రం ప్రయత్నించి విఫలమైంది. ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.