నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా అంటే.. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతుండటం, పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, నూతన ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకపోవడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసేందుకు సర్కారు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి–1తో ప్రస్తుత పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే గ్రామ పోరును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని అధికారులంటున్నారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, 4,932 వార్డు స్థానాలున్నాయి. అందులో ఇందల్వాయి మండలంలోని గంగారాం తండా, తిర్మన్‌పల్లి జీపీలకు పలు కారణాలతో ఎన్నికలు జరగలేదు. మరో 13 సర్పంచి స్థానాలు, 175 వార్డు స్థానాలకు ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడ్డాయి. సర్పంచులకు నెలకు రూ. 5వేల గౌరవవేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి చెక్‌పవర్ ఇచ్చింది.
రిజర్వేషన్లపై గ్రామస్థాయిలో..
జీపీలకు రిజర్వేషన్ల మార్పుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాత రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. పదేళ్లపాటు అవే రిజర్వేషన్లు ఉంటాయని చట్టంలో గత ప్రభుత్వం పొందుపర్చింది. ఆ సమయంలో రిజర్వేషన్లు కొందరికి ఖేదం. మరికొందరికి మోదంగా మారాయి. రిజర్వేషన్ల మార్పుపై గ్రామస్థాయి నుంచి ఒత్తిడి వస్తే తప్ప మార్చే పరిస్థితి లేదు.
సంకట స్థితిలో సర్పంచులు..
పంచాయతీ పాలకవర్గాలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తున్నారు. ఐదేళ్లలో తాము అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు రాకపోవడంతో కొందరు కూలీలుగా మారారని, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికమంది సర్పంచులు బీఆర్‌ఎస్‌లో ఉండిపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో సర్పంచులు సంకట స్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో పర్సన్ ఇన్‌ఛార్జికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలుమా ర్లు పర్సన్ ఇన్‌ఛార్జికి అవకాశమివ్వగా, కొన్నిసార్లు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచిచూడాలి. కాగా ఈవిషయమై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు.
ఆర్నెళ్లలోపే అవకాశం..!
జీపీ పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే ప్రస్తుతమున్న చట్టం ప్రకారం పంచాయతీలకు గ్రాంట్లు నిలిచిపోయే అవకాశముంది. పార్లమెంట్ ఎన్నికలు మే చివరి వారం వరకు ముగుస్తాయి. గతంలో పంచాయతీ ఎన్నికల తర్వాత పార్లమెంట్, స్థానిక సంస్థలు, (ఎంపీటీసీ, జెడ్పీటీసీ), మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment