grama pachayathi
-
పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే..
నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా అంటే.. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతుండటం, పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, నూతన ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకపోవడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసేందుకు సర్కారు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి–1తో ప్రస్తుత పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే గ్రామ పోరును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని అధికారులంటున్నారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, 4,932 వార్డు స్థానాలున్నాయి. అందులో ఇందల్వాయి మండలంలోని గంగారాం తండా, తిర్మన్‌పల్లి జీపీలకు పలు కారణాలతో ఎన్నికలు జరగలేదు. మరో 13 సర్పంచి స్థానాలు, 175 వార్డు స్థానాలకు ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడ్డాయి. సర్పంచులకు నెలకు రూ. 5వేల గౌరవవేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి చెక్‌పవర్ ఇచ్చింది. రిజర్వేషన్లపై గ్రామస్థాయిలో.. జీపీలకు రిజర్వేషన్ల మార్పుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాత రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. పదేళ్లపాటు అవే రిజర్వేషన్లు ఉంటాయని చట్టంలో గత ప్రభుత్వం పొందుపర్చింది. ఆ సమయంలో రిజర్వేషన్లు కొందరికి ఖేదం. మరికొందరికి మోదంగా మారాయి. రిజర్వేషన్ల మార్పుపై గ్రామస్థాయి నుంచి ఒత్తిడి వస్తే తప్ప మార్చే పరిస్థితి లేదు. సంకట స్థితిలో సర్పంచులు.. పంచాయతీ పాలకవర్గాలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తున్నారు. ఐదేళ్లలో తాము అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు రాకపోవడంతో కొందరు కూలీలుగా మారారని, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికమంది సర్పంచులు బీఆర్ఎస్లో ఉండిపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో సర్పంచులు సంకట స్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో పర్సన్ ఇన్ఛార్జికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలుమా ర్లు పర్సన్ ఇన్ఛార్జికి అవకాశమివ్వగా, కొన్నిసార్లు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచిచూడాలి. కాగా ఈవిషయమై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. ఆర్నెళ్లలోపే అవకాశం..! జీపీ పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే ప్రస్తుతమున్న చట్టం ప్రకారం పంచాయతీలకు గ్రాంట్లు నిలిచిపోయే అవకాశముంది. పార్లమెంట్ ఎన్నికలు మే చివరి వారం వరకు ముగుస్తాయి. గతంలో పంచాయతీ ఎన్నికల తర్వాత పార్లమెంట్, స్థానిక సంస్థలు, (ఎంపీటీసీ, జెడ్పీటీసీ), మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
నిలిచిన ఈ–సేవలు..! సమ్మె బాటలో ఈ–పంచాయతీ సిబ్బంది
సూర్యపేట్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట నమ్మె చేస్తున్నారు. వీరి సమ్మె బుధవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా గ్రామ పంచాయతీల్లో ఈ–సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సేవల్లో వేగం పెంచేందుకే.. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీలను మంజూరు చేసింది. ఇందులో సేవలందించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. అయితే వారికి వేతనాలు గ్రామపంచాయతీలే చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందన్న నమ్మకంతో ఉద్యోగులు తమ డిమాండ్లతో సమ్మె బాటపట్టారు. 63 మంది ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆధారంగా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం ఈ–పంచాయతీ కార్యక్రమాన్ని 2014–15లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)లను, తర్వాత గ్రామాల్లో క్లస్టర్ల వారీగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థ ద్వారా వీరిగా కంప్యూటర్ ఆపరేటర్లనను నియామకాలు జరిగాయి. ఆపరేటర్లందరికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పరిపాలన నిధుల కింద 10శాతం కేటాయించింది. నెలకు రూ.8వేలకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీపీఎంతో పాటు ఈ–పంచాయతీ, ఆర్జేసీ ఆపరేటర్లు 63 మంది పని చేస్తున్నారు. జిల్లాలో ఒక్కో ఆపరేటర్ 8 నుంచి 10 గ్రామ పంచాయతీల్లో చేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తూ అనుసంధానకర్తలుగా వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి తమకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ–పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. జిల్లా స్థాయిలో పనిచేసే డీపీఎంలకు పే స్కేల్ అమలు చేయాలి. గ్రామాల్లో పని చేసే ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించి వేతనం చెల్లించాలి. మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఉద్యోగ సిబ్బందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగి మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. -
బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్
కామారెడ్డి: సీఎం కేసీఆర్ సార్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాను.. బిల్లులు చెల్లి స్తారా లేదా ఆత్మహత్య చేసుకొని చావమంటారా అంటూ బీఆర్ఎస్కు చెందిన ఉపసర్పంచ్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండలంలోని బీబీపేటకు చెందిన సాయినాథ్ గత ఎన్నికల్లో 13వ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఉమ్మడి మండలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. సుమారు రూ. 1.50 లక్షల వరకు నిధులు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిన సాయినాథ్ వాట్సప్‌లో తన వాయిస్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధు లు రావడం లేదని, ఎన్నికల కోడ్ వస్తే నిధులు వి డుదల కావని పేర్కొన్నారు. తన చావుతో అయినా జీపీ వ్యవస్థను ఆదుకోవాలంటు ఆదుకోవాలంటు వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్ నంబర్ ట్రేస్చేసి హైదరాబా ద్లో పట్టుకొన్నారు. అతని మిత్రులకు గ్రామానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
గ్రామాల్లో ఆస్తి పన్ను ఏటా 5 శాతం పెంపు జీవో బాబు సర్కారుదే
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను (ఇంటి పన్ను) ఏటా ఐదు శాతం చొప్పున పెంచాలని 2002లో చంద్రబాబు సర్కారు జీవో 98 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రకారం అధికారుల స్థాయిలోనే గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏటా ఇంటి పన్ను పెంచుకుంటూ వెళ్లింది. ఐదేళ్లలో పెంచిన ఇంటి పన్నుల భారం రూ.266 కోట్లు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో ప్రకారమే ఈ ఏడాది కూడా గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తున్నా రాజకీయ విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేదో ప్రజలపై కొత్తగా పన్ను భారం మోపుతున్నట్లు అపోహలు సృష్టించేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు రెట్లు పెరుగుదల... 2013–14లో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మొత్తం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు లక్ష్యం రూ.157.96 కోట్లు కాగా 2018–19 నాటికి రూ.423.69 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్లలో ఇంటి పన్ను లక్ష్యం దాదాపు మూడు రెట్లు పెరిగింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే కూడా అధికంగా గత సర్కారు ఇంటి పన్ను భారం మోపింది. చదవండి: విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి నాటి జీవో ప్రకారమే.. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇంటి విలువపై రూ.వందకు 12 పైసల నుంచి ఒక్క రూపాయి మధ్య ఇంటి పన్నును సంబంధిత గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని నిర్ధారించుకోవచ్చు. 2000–2001లో ఇంటి విలువ ఆధారంగా ప్రస్తుతం పన్ను నిర్ధారణ జరుగుతోంది. అప్పుడు నిర్ధారించిన ఇంటి పన్ను ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతోంది. కొత్తగా ఇంటి విలువ నిర్ధారణ జరిగే వరకు 2000–2001 నాటి ఇంటి విలువ ఆధారంగానే పన్ను వసూలు చేయాలని టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో 98లో పేర్కొన్నారు. ఎన్నికల భయంతో ప్రయోగం వాయిదా 2017–18లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత సర్కారు ప్రయోగాత్మకంగా అప్పటి ధరల ప్రకారం ఆస్తి విలువను నిర్ధారించి కొత్తగా ఇంటి పన్ను వసూలు చేసింది. ఈ నిర్ణయంతో ఒక్కో యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్ను ఒకేసారి రెండు రెట్లకు పైగా పెరిగినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో పశ్చిమ గోదావరి తరహాలోనే అప్పటి విలువ ఆధారంగా కొత్తగా ఇంటి పన్ను నిర్ధారణకు నాటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్ కసరత్తు చేపట్టారు. చదవండి: అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లను కొత్తగా సర్వే చేసి అప్పటి విలువ ప్రకారం లెక్కకట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల భయంతో ఇంటి పన్ను పెంపును గత సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2019లోనే పంచాయతీల్లో ఇంటి పన్ను రెండు మూడు రెట్లు పెరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. 2014–19 గ్రామాల్లో ఇంటి పన్ను పెరిగిన తీరు ఆర్థిక ఏడాది వసూలు లక్ష్యం రూ.కోట్లలో 2013–14 157.96 2014–15 186.33 2015–16 257.95 2016–17 299.60 2017–18 369.40 2018–19 423.69 -
వర్క్ ఫ్రమ్ హోం ఇంకాస్త కొత్తగా..
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ (ఇంటి నుంచే పనిచేసే విధానం) బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామాలకు మంచి సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్లను సమకూర్చాలని స్పష్టం చేశారు. దీనివల్ల అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయంతో పాటు విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మొదటి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని చేపట్టి ఆగస్టు 15న భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఆలోగా స్థలాలను గుర్తించి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఐటీ, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు మేలు జరిగేలా... ప్రాథమిక, మాథ్యమిక విద్యతోపాటు డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు నిరంతర ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మార్చి నాటికి డిజిటల్ లైబ్రరీలు ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని, దీనివల్ల అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. హై క్వాలిటీ ఇంటర్నెట్.. డిజిటల్ లైబ్రరీల భవనాల్లో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్, డెస్క్‌టాప్ బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్, హై క్వాలిటీతో అన్ లిమిలెడ్ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్, స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులో తేవాలని సీఎం జగన్ ఆదేశించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్‌టాప్ టేబుళ్లు, సిస్టం చెయిర్స్, విజిటర్ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్లు, ఐరన్ ర్యాక్స్, వార్తా పత్రికలు, మేగజైన్స్ డిజిటల్ లైబ్రరీల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్ ఉపకరణాల కోసం దాదాపు రూ.140 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హాజరైన మంత్రి మేకపాటి, ఉన్నతాధికారులు.. సమీక్షలో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ ఎం.నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల్లో సదుపాయాలిలా.. ► మూడు డెస్క్‌టాప్‌లు ► యూపీఎస్ ► డెస్క్‌టాప్ బార్కోడ్ ప్రింటర్ ► స్కానర్ ► లేజర్ ప్రింటర్ ► సాఫ్ట్వేర్ ► యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ► హై క్వాలిటీతో అన్ లిమిలెడ్ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ ► స్టోరేజీ కోసం డేటా సెంటర్లు ► టేబుళ్లు, కుర్చీలు తదితరాలతో మౌలిక వసతులు -
ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు
పల్లెల అభివృద్ధి, పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి నెలకు రూ.2లక్షల నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు తెలిపారు. గురువారం ఆయన దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సాక్షి, సిర్పూర్: పల్లెల్లో అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెలకు రూ.2 లక్షలు మంజూరు చేస్తుంనది కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పే ర్కొన్నారు. దహెగాం మండలంలోని ఇట్యాల, కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో గురువారం ఆయన 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలును పరి శీలించారు. ముందుగా ఇట్యాల ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. గ్రామంలో పలు కాలనీల్లో పర్యటించారు. డ్రెయినేజీలు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది జ్వరాలు వచ్చే అవకాశముందన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో అధికారులతో పాటు గ్రామస్తులు భాగస్వాములు కావాలని సూచిం చారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో పర్యటించారు. కోత్మీ ర్లో మొక్కలను నాటారు. బీబ్రాలో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హేమంత్‌కుమార్, ఎంపీపీ కంబగౌని సులోచన, తహసీల్దార్ సదా నందం, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచులు మురారీ, తరనుం సుల్తానా, క్రిష్ణమూర్తి, ఇట్యాల, బీబ్రా ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, శంకర్, పశువైద్యాధికారి పావని, ఈజీఎస్ ఏపీవో చంద్రయ్య, ఈవోపీఆర్డీ రాజేశ్వర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంతో ష్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్‌రాజు, నాయకులు సురేష్, సోను తదితరులు పాల్గొన్నారు. -
ముందే ‘మ్యూటేషన్’
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో ఇకపై భూమి క్రయ, విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు తప్పనిసరిగా మ్యూటేషన్ ఫీజు భరించాల్సిందే. దీంతో ఆస్తులు కొనుగోలు చేసేవారు ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ భారాన్ని మోయాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి గెజిట్ జారీ అయ్యింది. ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతోపాటు మున్సిపాలిటీల్లో పలు గ్రామాల విలీనం జరిగిన విషయం విదితమే. ఈ విలీనం జరిగిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించి భూ క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రధానంగా ఆ గ్రామాల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంపై స్పష్టత రాకపోవడంతో ఈ జాప్యం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 0.5 శాతం మ్యూటేషన్ ఫీజు సాధారణంగా ఆస్తుల కొనుగోలు సమయంలో ఇరు పార్టీలు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కొనుగోలుదారు భూమి మార్కెట్ విలువపై 4శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో ఏ భూమికైనా ఇదే విధంగా ఉంటుంది. మున్సిపాలిటీలో మాత్రం పేరు మార్పిడికి సంబంధించి అదనంగా మ్యూటేషన్ ఫీజు భూమి విలువ మీద 0.5శాతం కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే తీసుకోవడం జరుగుతుంది. గ్రామపంచాయతీలో రిజిస్ట్రేషన్ తర్వాత నేరుగా జీపీ కార్యాలయంలో మ్యూటేషన్ ఫీజు చెల్లించి చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనం చేశారు. వాటికి సంబంధించి ఆగస్టు 2 తర్వాత రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రధానంగా ఆయా వార్డు, బ్లాక్, విస్తీర్ణం వివరాలపై స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం వ్యక్తమైంది. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఆయా గ్రామాల్లో అప్పటినుంచి రిజిస్ట్రేషన్లను జరపడంలేదు. ఈ నేపథ్యంలో క్రయవిక్రయాలు చేసుకునే వారిలో ఆందోళన వ్యక్తమైంది. విలీన గ్రామాలు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన అనుకుంట గ్రామాన్ని వార్డు నెం.13లో కలిపారు. అర్లి(బి) జీపీలోని బెల్లూరి, నిషాన్ఘాట్ గ్రామాలను వార్డు నెం.3లో, రాంపూర్(ఆర్)ను వార్డు నెం.32లో, బట్టిసావర్గాం జీపీలోని ఎన్‌హెచ్‌బీ కాలనీ, టైలర్స్‌కాలనీ, పోలీసు కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్షిప్, ఆదర్శ్‌కాలనీ, భగత్‌సింగ్ కాలనీలను వార్డు నెం.27లో విలీనం చేశారు. మావల గ్రామపంచాయతీ పరిధిలోని దస్నాపూర్, దుర్గానగర్, కేఆర్కే కాలనీ, వికలాంగుల కాలనీలో మిగిలిన భాగంతోపాటు అటెండర్ కాలనీ, కృష్ణానగర్, ఇందిరమ్మ కాలనీలను వార్డు నెం.19లో విలీనం చేశారు. మార్కెట్ విలువ పాత పద్ధతే.. ఆయా గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైనప్పటికీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రస్తుతం పాత విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులతో కలిపి మార్కెట్ రివిజన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ప్రతి రెండేళ్లకోసారి భూములకు సంబంధించి రివిజన్ చేసి మార్కెట్ విలువలను సవరించడం, పెంచడం జరుగుతుంది. ప్రస్తుతానికి విలీన గ్రామాల్లో పాత విలువలోనే రిజిస్ట్రేషన్ చేయనుండడంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లో క్రయ, విక్రయాల పరంగా రిజిస్ట్రేషన్ విలువలో భారీ తేడాలు వచ్చే అవకాశం లేదు. అదనంగా మ్యూటేషన్ ఫీజును మాత్రమే భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఆస్తి పన్ను పరంగా కూడా మూడేళ్ల వరకు ఎలాంటి మార్పుచేర్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ విలువలు మాత్రం రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఏదైన నిర్ణయం తీసుకుంటే సవరణ చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. సీసీఏలో నమోదు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో త్వరలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం జరుగుతుంది. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం విషయంలో స్పష్టత వచ్చింది. ఆన్లైన్లో ఈ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం మున్సిపాలిటీలోని వార్డుల్లో జతచేస్తూ సీసీఏలో నమోదు చేయాల్సి ఉంది. సోమవారం దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. – జయవంత్‌రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య
పెద్దవూర, న్యూస్‌లైన్ : భార్యతో గొడవ పడి వ్యక్తి విద్యుత్ తీగలు పట్టుకుని ఓ యువకు డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దబావితండాకు చెందిన రమావత్ బిచ్యా-బుజ్జి దంపతుల మొదటి కుమార్తె లక్ష్మీని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలోని బుడ్డతండాకు చెందిన లావూరి నెహ్రూ(27)కి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. ఆర్థికంగా లేకపోవడంతో జీవనోపాధి కోసం నెహ్రూ భార్యాపిల్లలతో సహా ఒంగోలుకు వెళ్లి అక్కడ ఆటోను నడుపుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సుద్దబావితండాలో మఠం (పెద్దల) పండగకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పండగను బంధుమిత్రులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. పూటుగా మద్యం సేవించిన నెహ్రూ తన భార్య లక్ష్మీతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయా డు. రాత్రి 10.30 గంటల సమయం లో తాను చనిపోతున్నానని బంధువులకు, స్నేహితులతోపాటు భార్య, మా మ, తోడల్లుడులకు ఫోన్ చేశాడు. వా రు నెహ్రూ కోసం పరిసరాలలో వెతికా రు. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి తిరిగొచ్చారు. మండలంలోని తుమ్మచెట్టు స్టేజీ సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నెహ్రూది పులి వచ్చే కథ.. గతంలోనూ నెహ్రూ రెండు మూడు సార్లు తాను చనిపోతున్నానని ఫోన్లు చేసి ఉరుకులు పరుగులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో అతడు బంధువులు విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులు వ్యక్తి చని పోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృతుడి సెల్ఫోన్లో ఉన్న నంబ ర్లకు ఫోన్ చేసి మృతుడు నెహ్రూగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నా రు. మృతుడి భార్య లక్ష్మీ ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తాడిపర్తి శేషుబాబు తెలిపారు. -
మా‘నీరు’ మహాప్రభో!
జమ్మికుంట, న్యూస్‌లైన్: అది జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రం.. కానీ గుక్కెడు మంచినీటికి నోచుకోని దైన్యం. గ్రామపంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా.. ఆపై నగర పంచాయతీగా హోదా మారింది కానీ.. అంతకుమించి అభివృద్ధి మాత్రం జరగలేదు. దశాబ్దాలుగా జమ్మికుంట పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నా.. ఎవరికీ పట్టడం లేదు. రూ.65కోట్లతో ప్రణాళిక రూపొం దించిన శాశ్వత మంచినీటి పథకానికి అతీగతీ లేదు. మ రో నాలుగు నెలల్లో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పదవీకాలం ముగియనుంది. కానీ గత ఎన్నికల సమయంలో వారిచ్చిన హామీకి ఇంతవరకు మోక్షం లభించకపోవడం గమనార్హం. రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంచినీటి పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మోక్షమెన్నడు..? జమ్మికుంట పట్టణ ప్రజల కోసం యాభై సంవత్సరాల క్రితం మండలంలోని విలాసాగర్ వాగు నుంచి పైపులైన్ వేసి మానేరు నుంచి నీరందిస్తున్నారు. నాటి జనాభాకు అనుగుణంగా 450 నల్లా కనె క్షన్ల కోసం పైపులైన్ వేశారు. జమ్మికుంట వ్యాపార కేంద్రంగా మారడం, పట్టణ జనాభా పెరగడం వల్ల తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం పట్టణంలో 5,400 నల్లా కనెక్షన్లు ఉండగా.. జనాభా 30 వేలు దాటింది. దీంతో 20 వార్డుల్లో నాలుగురోజుకోసారి నీరందిస్తున్నారు. వేసవిలో నీటికి కటకట తప్పడం లేదు. ప్రజలు వ్యవసాయబావులు, మినరల్‌వాటర్ ప్లాంట్లను ఆశ్రరుుస్తున్నారు. పట్టణ జనాభా ఆధారంగా ప్రతీ వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీరివ్వాలనే నిబంధనలు ఉన్నా.. కనీసం పది లీటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. పట్టణ ప్రజలకు రోజుకు 23 గ్యాలన్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 4గ్యాలన్లు మాత్రమే అందిస్తున్నారంటే.. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగురోజులకోసారి అందిస్తున్న నీళ్లు సైతం పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా కావడం లేదు. పిట్టలవాడ, కేశవాపురం, మోత్కులగూడెం, దుర్గాకాలనీ, ఆబాది జమ్మికుంట ప్రాంతాల్లో సరైన పైపులైన్ల నిర్మించకపోవడం వల్ల నీటి కటకటాలు తప్పడం లేదు. నీటి లభ్యత లేదట! గత ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టణ ప్రజలకు నీటి సమస్య పరిష్కారిస్తామంటూ హామీ ఇచ్చారు. వారు మానేరు నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా దాహార్తి తీర్చేందుకు రూ.65 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ని వేదికలు సమర్పించారు. 40 ఏళ్ల వరకు తాగునీటి సమ స్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించారు. దీంతో భూగర్భజలాల శాఖ అధికారులు నీటి సరఫరాపై ఆరునెలల క్రితం సర్వే జరిపారు. 40 ఏళ్ల వరకు నీటి సరఫరా చేసే సామర్థ్యం లేదంటూ నివేదికలను పక్కన పెట్టినట్లు సమాచారం. పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని మానేరు ద్వారా 25 ఏళ్ల వరకు మాత్రమే శాశ్వత నీటి సమస్య తీరుతుందని, ఆ తర్వాత సమస్య మళ్లీ ఉత్పన్నమవుతుందని భూగర్భజల శాఖ వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రూ.65 కోట్ల నిధుల మంజూరులో జాప్యం జరుగుతోం దని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే పట్టుబట్టి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంచినీటి పథకాన్ని సాధించాల్సిన అవసరముందని ప్రజలు అంటున్నారు. -
మొక్కుబడి సభలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల కు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన గ్రామసభలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. గతంలో ఇచ్చి న దరఖాస్తులకు మోక్షం లభించలేదని, సమస్యలకు పరి ష్కారం చూపని సభలు ఎందుకని ప్రజలు బహిష్కరిస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. ఘెరావ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అధికారులు రాక, మరికొన్ని చోట్ల ప్రజలు రాక వెలవెలబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఉన్నచోట సభలను వాయిదా వేశారు. వీటిని ఈనెల 18 తర్వాత నిర్వహించనున్నారు. ఏడాదికి నాలుగుసార్లు.. గతంలో గ్రామసభలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేవారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన ఆరంభమైనప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3వ తేదీల్లో గ్రామసభలు నిర్వహించాలని పేర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. అక్టోబర్‌లో ఒకసారి గ్రామసభలు నిర్వహించారు. జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించాలని కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ కాగా, గ్రామసభలు జరుగుతున్నాయి. గతంలో అధికారులు సభల్లో తప్పనిసరి పాల్గొనాలని నిబంధన ఉండేదికాదు. అయితే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారి, విభాగ పంచాయతీ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి అధికారులతో గ్రామసభ నిర్వహించాలని కమిషనర్ సూచించడం, ఈ మేరకు కలెక్టర్, డీపీవోలు కూడా క్షేత్రస్థాయి అధికారులు కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు. చర్చించే అంశాలు ఇవే.. గ్రామపంచాయతీలకు సంబంధించిన 29 అంశాలను గ్రామసభలో చర్చించేందుకు క్షేత్రస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 17 శాఖల క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనే విధంగా జిల్లా అధికారులు చూడాలని పేర్కొన్నారు. అయితే గతంలో సభల్లో చెప్పిన సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో గ్రామీణుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతుంది. దీంతో కొన్నిచోట్ల నిధులు లేని సభలెందుకంటూ బహిష్కరిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఒకరిద్దరు క్షేత్రస్థాయి అధికారులు మినహాయిస్తే అన్ని శాఖల నుంచి సిబ్బంది పాల్గొనడం లేదు. సభలో పంచాయతీ వార్షిక లెక్కలు, ఆడిట్ రిపోర్ట్, గతేడాది పాలన నివేదిక, బడ్జెట్, వార్షిక నివేదికలు లేని కొత్త పన్నుల కార్యక్రమాలు, కొత్త పన్నులు విధించుట, పన్నుల పెంపుకు కార్యక్రమాలు, పథకాలు, లబ్ధిదారులను, ప్రాంతాలను గుర్తించుట వంటివి ముఖ్య ఉద్దేశం. వీటితోపాటు తాగునీటి సమస్య, పారిశుధ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయ సమస్యలు, విద్యుత్ సరఫరా, చిన్ననీటి పారుదల, రోడ్లు, కల్వర్టులు, నీటి మార్గాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనితీరు తదితర అంశాలను ఇందులో చర్చించవచ్చు. డీపీఓ పోచయ్య వివరణ.. ఒకే పంచాయతీలో రెండు మూడు చోట్ల గ్రామసభలు ఉండడంతో అన్నిచోట్ల అధికారులు పాల్గొనలేకపోతున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించి అధికారులు గైర్హాజరైన పక్షంలో మండల అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. తద్వారా అధికారులపై చర్యలు తీసుకుంటాం. అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కమిషనర్‌తోపాటు కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రామీణులు గ్రామసభలను ఉపయోగించుకోవాలి. ముందుగా నిధులు విడుదల అనేది ఉండదు. సభలో ప్రస్తావించి తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపిన పక్షంలో దానికి ఉన్నతాధికారులు పరిశీలించి నిధులు విడుదల చేస్తారు. -
ఇక పకడ్బందీగా గ్రామసభలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఇకపై గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇన్నాళ్లూ మొక్కుబడిగా సభలు నిర్వహిస్తూ ప్రధాన శాఖల మండలాధికారులు గైర్హాజరు కావడంతో ఆయూ గ్రామాల ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఇకపై గ్రామసభలకు మండలాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరయ్యేవారి వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించాలని ఇటీవల జీవో 791 జారీ చేసింది. హాజరైన, గైర్హాజరైన అధికారులు, చర్చించిన అంశాలపై నివేదిక సమర్పించే బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనుంది. తద్వారా మండలస్థారుు అధికారుల పనితీరును అంచనా వేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలున్నాయి. ఇటీవల పాలకవర్గాలు ఏర్పడడంతో పంచాయతీల వారీగా అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో గ్రామసభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, వాటి ద్వారా ఆశించిన మేర ప్రయోజనం చేకూరకపోవడంతో ఈ సారి సభలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో జీవో నంబర్ 791 జారీ చేసింది. గతంలో గ్రామ సభలకు మండలస్థాయి అధికారులు రాకున్నా కొనసాగించేవారు. దీంతో గ్రామ ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఏయే అధికారులు సభలకు హాజరయ్యారనే సమాచారం ఉన్నతాధికారుల వద్ద లేకుండా పోయింది. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే గ్రామ సభలకు విధిగా హాజరు కావాలి. గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రెరుునేజీ, రోడ్లు తదితర అంశాలపై చర్చించాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సభలకు హాజరైన, గైర్హాజరైన అధికారుల వివరాలు, చర్చించిన అంశాలతో పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి ప్రతీ గ్రామసభకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది. కార్యదర్శులకు చిక్కులు తప్పవా..? తాజా జీవోతో పంచాయతీ కార్యదర్శులకు అదనపు పనిభారం, ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నారుు. జిల్లా వ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలకు సుమారు 190 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరు నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారాలను చూస్తున్నారు. ఇప్పటికే ఇది తమ తలకు మించిన భారంగా భావిస్తున్నారు. 791 జీవోతో గ్రామ సభలకు హాజరుకాని మండల అధికారులపై రిపోర్టు ఇవ్వడం అదనపు పనిభారంగా మారనుంది. దీనికితోడు నివేదిక ఇవ్వడం ద్వారా మండల అధికారుల ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై సీరియస్‌గా స్పందిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పవని, ఈ జీవో తమకు పరోక్షంగా కష్టాలు తప్పవని భావిస్తున్నారు. -
గుర్తింపు పంచాయితీ!
ఐటీఏడీఏ అధికారుల నిర్లక్ష్యం.. కొండంత అలసత్వం..గిరిజనుల పాలిట శాపమై కూర్చుకుంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాలు తప్పుకోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు దరిచేరే మార్గం కనిపించకుండా పోయింది. ఏజెన్సీ గ్రామపంచాయతీల గుర్తింపు వివాదమైంది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కుల కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. ఇదేమి అన్యామంటూ ప్రశ్నిస్తున్నారు. అచ్చంపేట, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాం తంలోని ఏజెన్సీ గ్రామాలపై ఐటీడీఏ అధికారులకు స్పష్టత కొరవడింది. నాలుగు గ్రామ పం చాయతీలను ఈ జాబితా నుంచి తొలగించడం పై ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ధ్రువీకరణ ప్రకారం ఏజెన్సీ గ్రా మ పంచాయతీలకు సంబంధించిన వివరాలను తమకు పంపించాలని ఈ ఏడాది ఆరంభంలో గిరిజన సంక్షేమశాఖ కమిషన్ కోరింది. దీనిపై స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు 27 గ్రామ పంచాయతీల పరిధిలో 68 గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించి పంపించారు. ఇందులో లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అప్పాపూర్ చెంచుపెంట అనుబంధగా గ్రామంగా ఉంది. అయితే అప్పాపూర్ను గ్రామపంచాయతీగా గుర్తించి దీని కింద 20 చెంచుపెంటలను చేర్చారు. అప్పాపూర్ను పంచాయతీ నుంచి తొలగిస్తే 26 గ్రామ పంచాయతీలను ఐటీడీఏ గుర్తించిన జాబితాగా పరిగణంలోకి తీసుకోవచ్చు. ఇది వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 30 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ కింద ఉండేవి. ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలను ఏజెన్సీ జాబితా నుంచి తొలగించారు. బల్మూర్ మండలం లక్ష్మిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బిల్లకల్లును ఏజెన్సీగా గుర్తించి పంచాయతీ హెడ్క్వార్టరును విస్మరించారు. రాజ్యాంగంలో ఇలా.. ఏజెన్సీ యాక్టు (12-07-1950లో వచ్చింది) ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్డ్‌లో ఆర్టికల్ 244లో తొమ్మిది జిల్లాలో 107 మండలాల పరిధిలో 5948 గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించారు. అందులో మహబూబ్ నగర్ జిల్లాలోని నోటిఫైడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతాలుగా అమ్రాబాద్ మండలంలో తుర్కపల్లి పంచాయతీ మినహా 17 , లింగాల మండలంలోని నాలుగు, అచ్చంపేటమండలంలో ఆరు, బల్మూర్ మండలంలో నాలుగు పంచాయతీలు ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటించారు. నిబంధనలు ఇవి... ఏజెన్సీ పంచాయతీల విస్తరణ (పీసా) నిబంధనలు ప్రకారం ఇచ్చిందా? లేదంటే భారత రాజ్యాంగం ప్రకటించిన జాబితా ఇచ్చారా అన్నది స్పష్టత లేదు. ఐటీడీఏకు ఏజెన్సీ గ్రామాలను గుర్తించే అధికారం ఉందా...! ఉంటే ఏజెన్సీ గిరిజనేతరుల హక్కుల పోరాట సమితి 513 రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఈప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. పొంతన లేని సమాచారం గిరిజన సంక్షేమశాఖకు అందించడంతో ఏజెన్సీ వాసులు అయోమయానికి గురువుతున్నారు. కనీస అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామాలను ఏజెన్సీలుగా గుర్తిం చాల్సి ఉన్నా పాలకులకు అవేమీ పట్టడం లేదు. కొందరి స్వార్థం కోసం వసతులు, సౌకర్యాలు ఉన్నా.. వాటిని ఏజెన్సీలుగా ఎంపిక చేశారు. నే తల మాటలు నమ్మిన అధికారులు మారుమూల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలను విస్మరించారు. ప్రస్తుతం ఇది ఉద్యోగులకు వరం కాగా చెంచు గిరిజనులకు కీడు చేస్తుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏజెన్సీ గ్రామాలకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నా నిధులు..గిరిజనులకు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ గ్రామ పంచాయతీల గుర్తింపు విమర్శలకు తావిస్తోంది. ఎన్నికలు ఎలా నిర్వహించారు... ఈ ఏడాది జూన్ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అచ్చంపేట మండలంలోని 7, బల్మూర్ మండలలో 4, అమ్రాబాద్ మండలలో 17, లింగాల మండలంలో రెండు చొప్పున మొత్తం 30 గ్రామపంచాయతీలను షెడ్యూల్డు ఏరియా కింద ఎస్టీలకు రిజర్వేషన్ కలిపించి ఎన్నికలు నిర్వహించారు. ఐటీడీఏ మాత్రం అచ్చంపేట మండలం దేవులతండా, అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, కల్మలోనిపల్లి, బల్మూర్ మండలం లక్ష్మిపల్లి గ్రామపంచాయతీలను ఏజెన్సీ జాబితా నుంచి తొలగించింది. ఇది ఎక్కడి న్యాయమని విద్యావంతలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. -
నగర ‘పంచాయితీ’
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీల స్థాయి పెరిగినా.. ఆశించిన అభివృద్ధి కరువైంది. కోట్లాది రూపాయల నిధులు వచ్చి పడతాయని భావించినా.. నిరాశే మిగులుతోంది. జిల్లాలోని గూడురు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ కాగా.. నందికొట్కూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అయితే ఆ స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలి ప్రజలు మంచంపడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో చెత్తాచెదారాన్ని తరలించేందుకు ట్రాక్టర్లు ఉండగా, నగర పంచాయతీ గూడురుకు నేటికీ ఎద్దుల బండ్లే దిక్కయ్యాయి. ఇక్కడ సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోకి సమీపంలోని పి.చింతకుంట, దేవరాయపురం, పడకండ్ల, నాగిరెడ్డిపల్లె గ్రామాలను కూడా విలీనం చేశారు. ఇక్కడ 40వేల జనాభాకు 45 మంది మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఫలితంగా కనీసం వారం రోజులకోసారి కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. మురుగు కాల్వల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మెయిన్ మురుగు కాల్వలో జమ్ము పెరిగిపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడ రోడ్లపై ప్రవహిస్తోంది. బనగానపల్లె నగర పంచాయతీలోకి పక్కనున్న యాగంటిపల్లి, బత్తలూరుపాడు, రాళ్లకొత్తూరు, రాళ్లకొత్తూరు తండా, మిట్టపల్లి, కాపులపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. ఇక్కడ కూడా సిబ్బంది సమస్య వేధిస్తోంది. రెగ్యులర్ సిబ్బంది 9 మంది ఉండగా, 50 మంది కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. గూడురు నగర పంచాయతీలో గతంలో పని చేస్తున్న 20 మంది పారిశుద్ధ్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు నగర పంచాయతీలోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. మున్సిపాలిటీగా మారిన నందికొట్కూరులో పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పట్టణంలోని మారుతీనగర్, బెరైడ్డినగర్, సాయిబాబానగర్, కోటవీధి, సుబ్బారావుపేట, శేషశయనారెడ్డి తదితర కాలనీల్లో ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. నిధుల విడుదల అంతంతే నగర పంచాయతీలకు నిధులు కూడా అంతంత మాత్రంగానే విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో నగర పంచాయతీకి మున్సిపల్ నిధులు రూ.2 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.1.49 కోట్లు విడుదలయ్యాయి. అయితే నగర పంచాయతీల్లో జనాభా, శివారు కాలనీలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధికి సంబంధించి నిధులు విడుదలైతే తప్ప నగర పంచాయతీల్లో ఆశించిన అభివృద్ధి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. -
విలీన కష్టాలు..!
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్లో విలీనమైతే తమ గ్రామాల దశ తిరిగినట్టేనని సంతోషించిన వారి కలలు కల్లలే అయ్యాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు సమస్యలేమైనా చెప్పుకుంటే ఒకటి, రెండు రోజుల్లోనే పరిష్కారం అయ్యేవని, ఇప్పుడు అసలు ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని అంటున్నారు. ఖమ్మం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పుడు పట్టణంతో పాటు పరిసర పది గ్రామపంచాయతీలను ఇందులో విలీనం చేశారు. ఖమ్మం అర్బన్ మండలంలోని ఖానాపురం హవేలీ, బల్లేపల్లి, కొత్తగూడెం, పుట్టకోట, అల్లీపురం, ధంసలాపురం, గొల్లగూడెం, రూరల్ మండలంలోని కైకొండాయిగూడెం, దానవాయిగూడెం, మల్లెమడుగు గ్రామాలను కార్పొరేషన్లో కలిపారు. దీంతో ఇత తమ గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయా గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రక్రియను ఆగమేఘాల మీద చేపట్టిన అధికారులు ఆ తర్వాత వాటి అభివృద్ధిని విస్మరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అశలు అది అడి యాశలే అయ్యాయి. కళతప్పిన గ్రామాలు... పంచాయతీలుగా ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు సమస్యలపై దృష్టి సారించేవారు. ఇప్పుడు వీధిలైట్లు వెలగ కపోవడం, చెత్తాచెదారం ఎక్కడివక్కడే ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేసేవారు లేరు. దీంతో దోమలు ప్రబలి జ్వరాల బారిన పడుతున్నామని ఆయా గ్రామాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ వచ్చి.. హామీ ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. జిల్లాలోనే మేజర్ పంచాయతీగా ఉన్న ఖానాపురం హవేలిలో గతంలో పాలకవర్గం ఉన్నప్పుడు ప్రధాన అవసరాలను గుర్తించి పంచాయతీ కార్యదర్శి స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేవారు. అప్పుడు వార్డు సభ్యుడి దృష్టికి సమస్య తీసుకెళ్తే కనీసం వారం రోజులకు పరిష్కారం అయ్యేదని, ఇప్పుడు అధికారులను కలిసేందుకే అవకాశం దొరకడం లేదని హవేలీ వాసులు అంటున్నారు. కార్పొరేషన్‌కు వెళ్తే తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదని వాపోతున్నారు. మిగితా గ్రామాల వారిదీ ఇదే పరిస్థితి. సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నప్పుడు వచ్చిన నిధులలో కొన్ని దుర్వినియోగం అయినా, ఎంతోకొంత అభివృద్ధి జరిగేదని, ఇప్పుడు కార్పొరేషన్లో విలీనమై ఏడాది గడిచినా.. ఒరిగిందేమీ లేదని ఆయా గ్రామాల వారు అంటున్నారు. తాగునీటి సరఫరా, వీధులను శుభ్రపర్చడం, రోడ్ల మరమ్మతు వంటి విషయాలలో సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలలో నిల్వ ఉన్న నిధులను తమ ఖాతాలో వేసుకున్న కార్పొరేషన్ అధికారులు.. పనులు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మురుగుతో చస్తున్నాం.. మురుగు నీరు నిల్వ చేరి దోమలు, దుర్గంధంతో చస్తున్నాం. పంచాయతీగా ఉన్నప్పుడే నయం. కనీసం నెలలో ఒకసారైనా శుభ్రం చేసేవారు. ఇప్పుడు చెత్తంతా కాల్వల్లో పడి మురుగునీరు పేరుకుపోతోంది. దీంతో దోమలు ప్రబలి జ్వరాలు వస్తాయని భయపడుతున్నాం. - ఆర్లకుంట్ల అన్నమ్మ, రోటరీనగర్ మా కాలనీకి వస్తే బాధలు తెలుస్తాయి.. బాలాజీ నగర్ వస్తే మా బాధలు తెలుస్తాయి. ఎక్కడ మురుగు అక్కడే చేరడంతోపాటు కాల్వలు పేరకుపోయాయి. వీధుల్లో నడవాలంటేనే కపంరం పుడుతోంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. - సారక ధనమ్మ, బాలాజీనగర్ కొంచెం ఖర్చు పెడితే నీటి సమస్య తీర్చవచ్చు వార్డు సభ్యుడు, బాలాజీనగర్ మా వార్డు పరిధిలో తాగునీటి సమస్య ఉంది. కొద్ది మొత్తం ఖర్చు చేస్తే ఈ సమస్య తీర్చవచ్చు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మా కాలనీకి సక్రమంగా నీరు రాక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నచిన్న సమస్యలు పరిష్కరించాలి. - బొంకూరి శ్రీనివాస్, పిల్లలు, వృద్ధులు నడవలేకపోతున్నారు వీధులు శుభ్రం గా లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు నడవలేక జారిపడతున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళితే కొన్ని రోజులకయినా పరిష్కరించేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోడం లేదు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. - వై.సత్యనారాయణ, పాండురంగాపురం దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నాం రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయక పోవడంతో చెత్త పేరుకుపోతోం ది. కాల్వల నిండా చెత్త చేరడంతో మురుగునీరు, దుర్గంధంతో నరకం చూస్తున్నాం. అనేక సార్లు అధికారు ల దృష్టికి తీసుకెళ్లినా బాగు చేసేవా రు లేరు. పంచాయతీగా ఉన్నప్పుడే నయం.. కాస్తోకూస్తో అభివృద్ధి జరిగేది. - రాములు, పాండురంగాపురం -
పల్లెజనంపై పన్ను పోటు
పాలమూరు, న్యూస్‌లైన్: వాతావరణ ప్రతికూల పరిస్థితులు..ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా జీవనఖర్చులు పెరిగి అవస్థలు పడుతున్న పల్లె ప్రజలపై సర్కారు మరో భారం మోపేందుకు రంగం సిద్ధంచేసింది. గ్రామ పంచాయతీల పురోభివృద్ధి కోసం చేపట్టే చర్యల్లో భాగంగా పన్నులు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే ఆస్తిపన్నును భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీల పరిధిలో ఇతర పన్నులూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు పన్నులు పెంచాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్ర అధికారులు నెలరోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ పంచాయతీల ఆదాయ వనరులపై అధ్యయనం చేస్తున్నారు. ప్ర స్తుతం గ్రామ పంచాయతీలకు ని ధులు సరిపోవడం లేదని, ప్రజ లకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలంటే పన్నులు పెంచాల్సిందేనని వారు గుర్తించినట్లు సమాచారం. 15 ఏళ్లుగా పన్నులు సవరించలేదని, గ్రామాల అభివృద్ధికోసం పన్నులు పెంచాల్సిందేనని వారు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని భావిస్తున్నారు. 50 శాతం పెరిగే అవకాశం పన్నుల పెంపు భారం మేజర్ పంచాయతీలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 1327 పంచాయతీలు ఉండగా ఇందులో 18 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులోనూ 10 వేలకు పైగా జనాభా కలిగిన మేజర్ పంచాయతీలు 15 ఉన్నాయి. 15 ఏళ్లలో పెరిగిన ఆస్తి విలువ ప్రకారం పన్నులను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 50 శాతం ఆస్తి పన్ను పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు పట్టణాలకు సమీపంలో ఉన్న పంచాయతీల్లో పన్నులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో హోర్డింగ్‌లపై పన్ను, వ్యాపార సంస్థలపై పన్ను, ఖాళీ స్థలాల వినియోగంపై పన్ను, వినోదపన్ను, సెల్‌టవర్‌పై పన్ను, మార్కెట్ వేలాల పన్నులు, లెసైన్స్ పన్నులు పెరగనున్నట్లు సమాచారం. నీటి పన్నులు కూడా పెంచుతారని తెలుస్తోంది. తాగునీటి పంపిణీకి అయ్యే నిర్వహణ ఖర్చును రాబట్టుకునే విధంగా మాత్రమే చార్జీలు పెంచనున్నట్లు సమాచారం. పన్నుల పెంపుపై ప్రజలకు నచ్చజెప్పే బాధ్యతను సర్పంచ్‌లకే అప్పగించనున్నారు. కాగా, గ్రామ పంచాయతీల్లో త్వరలో పన్నులు పెంచుతారని సమాచారం ఉందని, అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని జిల్లా పంచాయతీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. -
సమైక్యంగా ఉంచాల్సిందే
సాక్షి, అనంతపురం : ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వానికి జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచులు విజ్ఞప్తి చేశారు. తామంతా ‘సమైక్య’ రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి.. ఆ ప్రతులను ఢిల్లీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ సర్పంచులు తీర్మానాలు చేయాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విష యం విదితమే. ఇందుకు వారు స్పందిం చారు. శుక్రవారం పలు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి...తీర్మానాలను ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా 314 మంది సర్పంచులు తీర్మానం చేశారు. గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుంతకల్లు మండలంలో ఏడుగురు, గుత్తిలో 23 మంది, ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం ఎనిమిది, బత్తలపల్లి ఆరు, ముదిగుబ్బ 11, తాడిమర్రి తొమ్మిది, తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరు మండలంలో పది మంది సర్పంచులు తీర్మానం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం మండలంలో 19మంది, కణేకల్లు 17, గుమ్మఘట్ట 13, డి.హీరేహాళ్ 16, బొమ్మనహాళ్ 19 మంది, రాప్తాడు మండలంలో ఇద్దరు సర్పంచులు తీర్మానాన్ని ఆమోదించారు. శింగనమల నియోజకవర్గంలో 118 పంచాయతీలకు గాను 96 పంచాయతీల్లో ‘సమైక్య’ తీర్మాన పత్రాలపై సంతకాలు చేసిన సర్పంచులు... వాటిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఆలూరు సాంబశివారెడ్డికి అందజేశారు. కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లి, మండలకేంద్రమైన శెట్టూరు పంచాయతీ సర్పంచులు చేసిన ‘సమైక్య’ తీర్మాన ప్రతులను వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామికి అందజేశారు. జిల్లాలోని మరో 56 పంచాయతీల్లో కూడా సమైక్య తీర్మానం చేసి ఢిల్లీ పెద్దలకు ఫ్యాక్స్, ఈమెయిల్ చేశారు. -
రాజకీయ స్తబ్దత !
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాజకీయ పార్టీలన్నీ మూగనోము పట్టాయి. గడిచిన నెల రోజులుగా జిల్లాలో ఏ పార్టీ పెద్దగా కార్యక్రమాలు జరిపింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైం దన్న ప్రకటన వెలువడ్డాక ఒకటీ రెండురోజులు కాంగ్రెస్ హడావిడి చేసినా.. ఇక, ఆ తర్వాత నుంచి ఏ పార్టీ కనీసం చిన్న కార్యక్రమమూ లేకుండా ప్రేక్షకపాత్రలో ఉండిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడోదశ ముగిసే సమయంలోనే తెలంగాణ ప్రకటన వెలువడింది. ఆ ఎన్నికల వరకూ ఎంతో హడావిడి చేసిన పార్టీలన్నీ ఒక్కసారిగా మౌనముద్ర దాల్చాయి. తెలంగాణ సాధన కోసం పుష్కరకాలంగా పోరాటాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పూర్తిగా తన రాజకీయ కార్యక్రమాలను అటకెక్కించింది. ఇక, తమ అధినేత చంద్రబాబు తెలంగాణ విషయంలో మరోమారు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేయడంతో జిల్లాలో తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వివిధ కారణాలతో ఏ పార్టీ జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించక పోవడంతో రాజకీయ స్తబ్దత నెలకొంది. ఆయా పార్టీల నేతలు సైతం ఎలాంటి ఉత్సాహం చూపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం ఏదో ఒక కొలిక్కి వచ్చేదాకా వేచి చూడడం మినహా ఏం కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం ఆ పార్టీ నేతల గుండెల ను గుభేల్ మనిపిస్తోంది. గడిచిన పదమూడేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసుకుంటున్న నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. పార్టీని విలీనం చేసినా.. లేక కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు వెళ్లినా జిల్లాలో అవకాశం వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. విలీనం, పొత్తు, ఈ రెండు పరిణామాలు చోటు చేసుకోకున్నా, ఎన్నికలకు ఒంటరిగా వెళ్లినా, తాము ఏ నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లాలని మదనపడుతున్న వారూ ఉన్నారు. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాల జోలికీ వెళ్లడం లేదు. చివరకు జాయింట్ యాక్షన్ కమిటీ చేపడుతున్న కార్యక్రమాల్లోనూ పెద్దగా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ జిల్లాలో పూర్తిగా దుకాణం మూసినట్లే కనిపిస్తోంది. విపక్షపార్టీగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కనీసం ప్రకటనల రూపంలోనైనా స్పందించడం లేదు. ఇటీవల వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో కూడా టీడీపీ నుంచి కనీస స్పందన కరువైంది. గ్రూపు గొడవలతో కొట్టుకు చస్తున్న టీడీపీ తమ అధినేత ‘యూ’టర్న్‌తో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును తక్షణం ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌కు మద్దతు కూడా వీరి నుంచి కనిపించడం లేదు. జిల్లాలో ఏ నాయకుడూ చిన్న ప్రకటన కూడా విడుదల చేయడం లేదు. తమ అధినేతను వెనకేసుకురావడం మినహా మరో పాత్ర నిర్వహించడం లేదు. గడిచిన నాలుగేళ్లుగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ నేతల పాత్ర స్వల్పం గానే ఉంది. తాజా పరిస్థితులతో జిల్లా తమ దుకాణం బందైనట్లేనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. అధికార కాంగ్రెస్‌లో తెలంగాణ సాధించామన్న భావన మొదట కొంత కనిపించినా, ఆ తర్వాత ఎందుకనో ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాలో తమ పార్టీ నేతలు రక రకాల ప్రకటనలు చేస్తుంటే నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడపదడపా ప్రకటనలు ఇస్తున్నారు. ఆలేరు ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ఇంటింటా తెలంగాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పేర వివిధ శాఖల మంత్రులను పర్యటనలకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తెలంగాణవాదాన్ని వినిపించిన సీపీఐ, బీజేపీ సైతం మౌనంగానే ఉంటున్నాయి. ఇలా.. ఏ పార్టీలోనూ ఎలాంటి చిన్న కార్యక్రమమమూ లేకపోవడంతో జిల్లాలో రాజకీయ స్తబ్దత ఆవరించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యచరణను ప్రకటించిన నేపథ్యంలో.. ఆయా తెలంగాణవాద పార్టీలు జేఏసీతో చేతులు కలిపితే మళ్లీ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. -
సర్పంచులపై ఐటీ కన్ను
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీలో పది రోజుల పాటు విందులు, వినోదాలతో జనం పండగ చేసుకున్నారు. రాజకీయంగా ఎదగడానికి పల్లెను ఆటపట్టుగా భావించిన నయా సంపన్నుడొకరు అడిగిన వారికి అడిగింది సమకూర్చి గ్రామ ప్రథమపౌరుడి కుర్చీ అధిష్టించారు. ఇందుకు ఆయన చేసిన ఖర్చు కొంచెం అటూ ఇటూగా కోటీకి చేరి ఉంటుందని అంచనా.కరీంనగర్ శివారులోని మరో పల్లెలో కులాలు, వర్గాలు, సంఘాల వారీగా నజరానాలు, విరాళాలు, బహుమానాలు పంచడం ద్వారా మరో ఔత్సాహికుడు గద్దె నెక్కారు. అందుకయిన వ్యయం అరకోటీకి పైమాటే. ఇదే మండలంలోని మరో ఊరిలో ఒక యువ వ్యాపారి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినా సర్పంచ్ పదవి పీఠాన్ని అందుకోవాలన్న ఆయన ఆశ నెరవేరలేదు.అడ్డూఅదుపూ లేకుండా ఖర్చు చేయడం సాధారణ ఎన్నికల్లో మామూలే అయినా పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గ్రామస్థాయి పదవి కోసం ఇంత భారీగా ఖర్చ చేసిన వ్యవహారాన్ని ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ఎన్నికలలో పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టిన వారి వివరాలను సేకరించిన ఆదాయపన్నుల అధికారులు జిల్లా ఎన్నికల అధికారుల నుంచి కూడా అభ్యర్థుల వ్యయ నివేదికలను కోరినట్టు సమాచారం. పూర్తి వివరాలను సేకరించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 250 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లాల వారీగా ఆదాయపన్ను అధికారులకు కూడా ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఎన్నికల అధికారులతో సంబంధం లేకుండా కూడా మితిమీరి వ్యయం చేసిన వారి వివరాలను సేకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలనుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని ఆశించిన ఔత్సాహికులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఈసారి పంచాయతీ ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఎన్నారైలు, రియల్ ఎస్టేట్, క్వారీలు, పరిశ్రమలు తదితర వ్యాపారాల్లో బాగా సంపాదించిన బరిలోకి దిగారు. ఇలా నయా సంపన్నులు రాజకీయాల్లోకి రావడం, వారి మధ్య పంతాల వల్ల కొన్ని చోట్ల పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇలాంటి చోట్ల ఖర్చు కట్టలు తెగింది. గ్రామ రాజకీయాలపై అవగాహన లేకపోవడం, ఎవరేమిటో తెలియకపోవడం తదితర కారణాల వల్ల ఎలాగైనా గెలవాలని భావించిన అభ్యర్థులు ఇష్టారీతిన ఖర్చు చేశారు. పది వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులు రూ.80 వేలు, పది వేల తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.40 వేలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం పరిమితి విధించింది. ఇది ఎక్కడా అమలు కాలేదు. చట్టసభల ఎన్నికలను తలపించేలా సాగిన పంచాయతీ ఎన్నికలలో రూ.లక్షలు ఖర్చు చేశారు. పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఆయా పార్టీల్లో ఉన్న ముఖ్యులే ఊళ్లలోనూ లీడర్లుగా చలామణి అయ్యారు. ఎన్నికల తర్వాత సర్పంచులే ఆయా గ్రామాల్లో నాయకులుగా గుర్తింపు పొందుతారు. ఈ గుర్తింపు కోసమే నయా నేతలు ఆరాటపడుతున్నారు. ఆయా వ్యాపారాల్లో భారీ సంపాదన ఉన్న వారు పదవి సంపాదించుకోవడానికి ఎంత ఖర్చయినా వెనుకాడలేదని తెలుస్తోంది. ఈ ఆరాటమే ఇప్పుడు కొత్త చిక్కులు తెస్తోంది. పదవీ సంబరం తీరక ముందే ముంచుకొచ్చిన ఈ గండం నుంచి తప్పించుకునే దారులు వెతుక్కుంటున్నారు.