గ్రామ పంచాయతీల స్థాయి పెరిగినా.. ఆశించిన అభివృద్ధి కరువైంది. కోట్లాది రూపాయల నిధులు వచ్చి పడతాయని భావించినా.. నిరాశే మిగులుతోంది.
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీల స్థాయి పెరిగినా.. ఆశించిన అభివృద్ధి కరువైంది. కోట్లాది రూపాయల నిధులు వచ్చి పడతాయని భావించినా.. నిరాశే మిగులుతోంది. జిల్లాలోని గూడురు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ కాగా.. నందికొట్కూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అయితే ఆ స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలి ప్రజలు మంచంపడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో చెత్తాచెదారాన్ని తరలించేందుకు ట్రాక్టర్లు ఉండగా, నగర పంచాయతీ గూడురుకు నేటికీ ఎద్దుల బండ్లే దిక్కయ్యాయి. ఇక్కడ సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోకి సమీపంలోని పి.చింతకుంట, దేవరాయపురం, పడకండ్ల, నాగిరెడ్డిపల్లె గ్రామాలను కూడా విలీనం చేశారు. ఇక్కడ 40వేల జనాభాకు 45 మంది మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు.
ఫలితంగా కనీసం వారం రోజులకోసారి కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. మురుగు కాల్వల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మెయిన్ మురుగు కాల్వలో జమ్ము పెరిగిపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడ రోడ్లపై ప్రవహిస్తోంది. బనగానపల్లె నగర పంచాయతీలోకి పక్కనున్న యాగంటిపల్లి, బత్తలూరుపాడు, రాళ్లకొత్తూరు, రాళ్లకొత్తూరు తండా, మిట్టపల్లి, కాపులపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. ఇక్కడ కూడా సిబ్బంది సమస్య వేధిస్తోంది. రెగ్యులర్ సిబ్బంది 9 మంది ఉండగా, 50 మంది కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. గూడురు నగర పంచాయతీలో గతంలో పని చేస్తున్న 20 మంది పారిశుద్ధ్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు నగర పంచాయతీలోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. మున్సిపాలిటీగా మారిన నందికొట్కూరులో పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పట్టణంలోని మారుతీనగర్, బెరైడ్డినగర్, సాయిబాబానగర్, కోటవీధి, సుబ్బారావుపేట, శేషశయనారెడ్డి తదితర కాలనీల్లో ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు.
నిధుల విడుదల అంతంతే
నగర పంచాయతీలకు నిధులు కూడా అంతంత మాత్రంగానే విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో నగర పంచాయతీకి మున్సిపల్ నిధులు రూ.2 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.1.49 కోట్లు విడుదలయ్యాయి. అయితే నగర పంచాయతీల్లో జనాభా, శివారు కాలనీలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధికి సంబంధించి నిధులు విడుదలైతే తప్ప నగర పంచాయతీల్లో ఆశించిన అభివృద్ధి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.