సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగ భద్ర జలాల్లో కోత విధించేందుకు కన్నడిగులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వాటా నీటిని అందించే విషయంలో మోసగించేందుకు తెర తీస్తున్నారు. కనీసం 500 క్యూసెక్కుల నీరు వదలాలని మంగళవారం తుంభద్ర డ్యాం అధికారులను కలిసి కోరిన ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసులరెడ్డి, డీఈ నెహా మియాకు స్పష్టమైన హామీ లభించలేదు. గ్రిడ్ పడిపోయిందని.. ఆ స్థాయిలో నీరు ఇవ్వలేమని డ్యాం అధికారులు చెప్పడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. నీటి విడుదలకు.. గ్రిడ్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. ఫలితంగా తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతుల రబీ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడమూరు నియోజకవర్గాల పరిధిలో 1.50 లక్షల ఎకరాలకు సాగు, 192 గ్రామాలకు తాగునీటికి తుంభద్ర దిగువ కాలువ(ఎల్‌ఎల్‌సీ) ఆధారం. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువ దాదాపు 580 కి.మీ మేర ప్రవహిస్తోంది.
కాలువ ద్వారా ఖరీఫ్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,514 ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. 250 కి.మీ మేర కర్ణాటకలో, 330 కి.మీ ఆంధ్ర(కర్నూలు)లో ప్రవహిస్తున్న కాలువ నీటిలో అధిక శాతం కర్ణాటకలోనే దారి మళ్లుతోంది. తుంభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 110 టీఎంసీలు కాగా.. వరద సమయంలో వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్ర రాష్ట్ర వాటాగా 24 టీఎంసీలను కేటాయించింది.
అయితే జలాశయంలో పూడికతో నిల్వ సామర్థ్యం తగ్గటం, వర్షాభావ పరిస్థితులతో గడచిన దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ వాటా 16 నుంచి 18 టీఎంసీలకే పరిమితమైంది. ఆలా దాదాపు 6 టీఎంసీల నీరు తగ్గిపోగా.. ఉన్న నీటిని సైతం సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి. కాలువకు సంబంధించి 250 కి.మీ వద్ద 725 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర బోర్డు రాష్ట్ర అధికారులకు అప్పగించాలి. అయితే కర్ణాటక పరిధిలో ప్రవహించే కాలువలో అడుగడుగునా నీటి చౌర్యం జరుగుతోంది. కాలువలపై విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా జల దోపిడీకి పాల్పడుతున్నారు.
‘సాగు’తుందా!
Published Wed, Oct 9 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement