కర్నూలు దాహం తీరనిది
► అడుగంటిన సుంకేసుల జలాశయం
► సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో నీళ్లు అంతంతే..
► శివారు కాలనీల్లో మంచినీటి సమస్య జటిలం
► కల్లూరు కాలనీల్లో తీవ్ర ఇక్కట్లు
► పరిష్కారానికి చొరవ చూపని నేతలు
కర్నూలు(టౌన్): వేసవి వచ్చిందంటే కర్నూలు నగర ప్రజలకు కంటి మీద కునుకు దూరమవుతుంది. మంచినీటి సమస్యను తల్చుకుంటేనే ప్రజలకు చెమట పడుతోంది. సుంకేసుల రిజర్వాయర్ ఎన్నడూ లేని విధంగా ఎండిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ప్రత్యామ్నాయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మునగాలపాడు వద్ద ఏర్పాటు చేసిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 45 రోజుల పాటు నీటిని నిలువ చేసుకునే వీలుంది. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టడంలో అధికారులు, నాయకులు విఫలం కావడంతో నగర ప్రజల గొంతెండుతోంది. ప్రస్తుతం ట్యాంకులో 15 నుండి 20 రోజులకు కూడా సరిపోని నీళ్లు మాత్రమే నిల్వ ఉండటంతో సమస్య జటిలమైంది. కర్నూలు నగర ప్రజలకు ప్రతి రోజూ 71.76 ఎంఎల్‌డీ చొప్పున మంచినీళ్లు సరఫరా చేయాల్సి ఉంది. నీటి సమస్య కారణంగా ప్రస్తుతం 67 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. కల్లూరు కాలనీల్లో రోజు విడిచి రోజు నీరు ఇవ్వాల్సిన స్థానంలో నాలుగు రోజులకోసారి, వారం రోజులకోసారి నీళ్లు వదులుతున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు నీటి సమస్యతో చుక్కలు చూస్తున్నారు. ప్రతి రోజూ 8 ట్యాంకర్ల ద్వారా శివారు కాలనీలకు మంచినీళ్లు సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉంది.
నీటిసమస్య పట్టని నేతలు: నగర ప్రజలు మంచినీళ్ల కోసం ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అయితే జిల్లా కేంద్రంలోని సమస్య పరిష్కారానికి నేతలు చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత మూడేళ్లలో నగర జనాభా భారీగా పెరిగింది. స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామాలను కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో మంచినీటి అవసరాలు కూడా అధికమయ్యాయి. ఆ దిశగా నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టకపోవడంతో ప్రతి యేటా వేసవిలో మంచినీటి సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా కల్లూరు కాలనీలపై అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు ప్రజలు నీటి పన్ను రూపంలో రూ.8కోట్లు చెల్లిస్తుండగా.. ఇందులో అత్యధికంగా పాణ్యం పరిధిలోని కల్లూరు కాలనీలు, కోడుమూరు నియోజకవర్గంలోని నాలుగు వార్డుల ప్రజల నుంచే అధిక పన్ను ఉంటోంది. అలాంటిది.. ఇక్కడి ప్రజలకే మంచినీటి సమస్య అధికంగా ఉండటం గమనార్హం.
ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం: సుంకేసుల రిజర్వాయర్‌లో నీళ్లు లేకపోవడంతో నగరంలో మంచినీటి సమస్య ఉత్పన్నమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో గాజులదిన్నె నీటిని తీసుకొస్తున్నాం. వేసవిలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌లో 45 రోజులకు అవసరమైన నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ 15 రోజులకు మించి నీళ్లు లేవు. అందువల్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. రెండు రోజుల్లో నీళ్లు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును చేరుకోనున్నాయి. ప్రజలు సహకరించి నీటిని పొదుపుగా వాడుకోవాలి --- రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, కర్నూలు నగరపాలక సంస్థ
వాటర్ వర్క్స్ విభాగం
ట్యాంకర్లు రావట్లేదు: రెండు వారాల నుంచి నీళ్లు వస్తలేవు. ఎప్పుడూ ఇంత ఇబ్బంది లేకుండె. ట్యాంకర్లను కూడా పంపిస్తలేరు. ఎన్నాళ్లని ఇట్లా ఎదురు చూస్తుండాల. ఒక్కరు కూడా ఇట్లకెళ్లి వచ్చి చూస్తలేరు. అదిగో వస్తాయి, ఇదిగో వస్తాయని ఎదురు చూసినట్లుంది. ఇంత పెద్ద ఊర్లనే ఇంత సమస్య ఉంటే నాయకులు, అధికారులు ఏమి చేస్తున్నట్లు? --అబుదాబీ, పాతబస్తీ
వచ్చినా బురద నీళ్లే.: మంచినీళ్లు రాక చానా సమస్యగా ఉంది. మూడు నాలుగు రోజులకోసారి నీళ్లు ఇడుస్తున్నా అర్దగంటకే నిలిచిపోతున్నాయి. ఆ నీళ్లను కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంది. బురద నీళ్లు వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బందికి చెబుతున్నా మార్పు లేదు. ఎవరు కూడా కాలనీల్లోకి వచ్చి చూస్తలేరు.--- రుక్మిణి, ఉమర్‌నగర్
నీళ్లు కొనాల్సి వస్తోంది: ఇంతటి సమస్య ఎప్పుడూ లేదు. మంచినీళ్ల కోసం అక్కడకూ ఇక్కడకూ వెళ్లాల్సి వస్తోంది. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. అఖరికి నీళ్లను కొనుక్కోవాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు ఇట్లకెళ్లి వస్తే సమస్య అర్థమయితాది. ఆఫీసుల్లో కూర్చొని సమస్య లేదని అధికారులు అనుకుంటే సరిపోతుందా? --- రామిరెడ్డి, కల్లూరు కాలనీ హైవే