పాలమూరు, న్యూస్‌లైన్: వాతావరణ ప్రతికూల పరిస్థితులు..ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా జీవనఖర్చులు పెరిగి అవస్థలు పడుతున్న పల్లె ప్రజలపై సర్కారు మరో భారం మోపేందుకు రంగం సిద్ధంచేసింది. గ్రామ పంచాయతీల పురోభివృద్ధి కోసం చేపట్టే చర్యల్లో భాగంగా పన్నులు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే ఆస్తిపన్నును భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీల పరిధిలో ఇతర పన్నులూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు పన్నులు పెంచాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్ర అధికారులు నెలరోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ పంచాయతీల ఆదాయ వనరులపై అధ్యయనం చేస్తున్నారు. ప్ర స్తుతం గ్రామ పంచాయతీలకు ని ధులు సరిపోవడం లేదని, ప్రజ లకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలంటే పన్నులు పెంచాల్సిందేనని వారు గుర్తించినట్లు సమాచారం. 15 ఏళ్లుగా పన్నులు సవరించలేదని, గ్రామాల అభివృద్ధికోసం పన్నులు పెంచాల్సిందేనని వారు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని భావిస్తున్నారు.
50 శాతం పెరిగే అవకాశం
పన్నుల పెంపు భారం మేజర్ పంచాయతీలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 1327 పంచాయతీలు ఉండగా ఇందులో 18 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులోనూ 10 వేలకు పైగా జనాభా కలిగిన మేజర్ పంచాయతీలు 15 ఉన్నాయి. 15 ఏళ్లలో పెరిగిన ఆస్తి విలువ ప్రకారం పన్నులను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 50 శాతం ఆస్తి పన్ను పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు పట్టణాలకు సమీపంలో ఉన్న పంచాయతీల్లో పన్నులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో హోర్డింగ్‌లపై పన్ను, వ్యాపార సంస్థలపై పన్ను, ఖాళీ స్థలాల వినియోగంపై పన్ను, వినోదపన్ను, సెల్‌టవర్‌పై పన్ను, మార్కెట్ వేలాల పన్నులు, లెసైన్స్ పన్నులు పెరగనున్నట్లు సమాచారం. నీటి పన్నులు కూడా పెంచుతారని తెలుస్తోంది.
తాగునీటి పంపిణీకి అయ్యే నిర్వహణ ఖర్చును రాబట్టుకునే విధంగా మాత్రమే చార్జీలు పెంచనున్నట్లు సమాచారం. పన్నుల పెంపుపై ప్రజలకు నచ్చజెప్పే బాధ్యతను సర్పంచ్‌లకే అప్పగించనున్నారు. కాగా, గ్రామ పంచాయతీల్లో త్వరలో పన్నులు పెంచుతారని సమాచారం ఉందని, అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని జిల్లా పంచాయతీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.