State officials
-
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్‌లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్‌పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అప్పీళ్ల దాఖలులో మితిమీరిన జాప్యం
న్యూఢిల్లీ: అప్పీళ్లను దాఖలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మితిమీరిన ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నందుకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు బాధ్యులైన అధికారుల నుంచి ఖర్చులు రాబడతామని హెచ్చరించింది. అప్పీళ్ల విషయంలో నిర్ణీత కాల పరిమితిని పట్టించుకోని ప్రభుత్వాధికారులకు సుప్రీం కోర్టు వేదిక కాదని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో అప్పీలు దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ అధికారులు 663 రోజుల సమయం తీసుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ‘ఇలా ఆలస్యం చేసి, ఆ అప్పీల్‌ను కొట్టివేసే పరిస్థితిని తీసుకురావడం, తద్వారా ఈ అంశాన్ని ఇంతటితో మరుగున పడేయటమే ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘అంతిమంగా బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారు. దీనిపై గతంలో పలు పర్యాయాలు హెచ్చరించినా మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలి’ అని తెలిపింది. అప్పీళ్ల విషయంలో తీవ్ర ఆలస్యానికి కారణం కావడంతోపాటు, న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసే అధికారుల నుంచి అందుకు తగ్గ ఖర్చులను వసూలు చేయాలి’ అని తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.25 వేలను వసూలు చేయాలని ఆదేశించింది. లేకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ధిక్కార చర్యలు తప్పవని తెలిపింది. -
తీహార్ జైలుకు ‘దిల్సుఖ్నగర్’ దోషులు
ఉరిశిక్ష పడిన ఉగ్రవాదుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల దోషులను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2014లో పేలుళ్ల అనంతరం ఈ ఐదుగురు ఉగ్రవాదు లను విచారించేందుకు నేషనల్ ఇన్వె స్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైదరాబాద్ రేంజ్ అధికారులు పీటీ వారెం ట్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. పే లుళ్ల కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారించిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్‌లో విచారణ పూర్తయినందున ఈ ఐదుగురి ని తాము విచారించాల్సి ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో పీటీ వారెంట్ పొందారు. అంతేకాకుండా నిందితులను దర్యాప్తు అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకొస్తే తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు వీరిని తీహార్ జైలుకు తరలిం చాలని విజ్ఞప్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కి జైళ్ల శాఖ డీజీ లేఖలు రాశారు. 4 రోజుల్లోగా ఈ ఐదుగురిని తీహార్ జైలు కు తరలించేందుకు చర్యలు చేపడుతు న్నామని.. ఇందుకు భద్రతా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ ఐదుగురు ఉగ్రవాదులను వచ్చే వారం విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచా రం. వారిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు, అనంతరం మహా రాష్ట్రలోని థానే పోలీసులు విచారించనున్నారు. బెంగ ళూర్, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, బిహార్, జైపూర్ పేలుళ్ల కేసులోనూ ఈ ఉగ్రవాదులే నిందితులుగా ఉండటంతో అక్కడి పోలీసులు సైతం విచారించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. -
మన్యంలో నకిలీ నోట్ల జోరు
- గంజాయి ముఠాల పనిగా అనుమానం - బ్యాంకు అధికారులకే టోకరా పాడేరు: మన్యంలో నకిలీ కరెన్సీ చెలామణి జోరుగా సాగుతోంది. నకిలీ 1000, 500 నోట్లు ఎక్కువగా మార్కెట్లో హల్చెల్ చేస్తున్నాయి. వీటిని గుర్తించడం అసాధ్యంగానే ఉంటోంది. అసలైన నోట్లు మాదిరిగానే ఉండటం వల్ల ఇవి సులువుగా మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. వీటి విషయంలో స్టేట్‌బ్యాంక్ అధికారులు సైతం టోకరా తిన్నారు. ఈ నెల 6న ఒక బ్యాంకు ఖాతాకు జమ కోసం పాడేరులో ఒక వ్యక్తి ఇచ్చిన రూ.31,500 నగదును నకిలీ నోట్లుగా బ్యాంకు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. 31 వెయ్యినోట్లు, ఒక 500 నోటు వీటిలో ఉన్నాయి. వీటిని బ్యాంకు అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈ నగదు జమ అయిన ఖాతాదారుడిని పోలీసులు విచారిస్తున్నారు. పాడేరు కేంద్రంగా సంచరిస్తున్న గంజాయి ముఠాలే వీటిని చెలామణి చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పెదబయలు, జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో వీటి జోరు ఎక్కువగా ఉంటోంది. పెద్ద ఎత్తున గంజాయి రవాణా చేస్తున్న వ్యాపారులు సులువుగా నకిలీ నోట్లను కూడా చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాల గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 1000, 500 న కిలీ నోట్ల విషయంలో ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
పల్లెజనంపై పన్ను పోటు
పాలమూరు, న్యూస్‌లైన్: వాతావరణ ప్రతికూల పరిస్థితులు..ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా జీవనఖర్చులు పెరిగి అవస్థలు పడుతున్న పల్లె ప్రజలపై సర్కారు మరో భారం మోపేందుకు రంగం సిద్ధంచేసింది. గ్రామ పంచాయతీల పురోభివృద్ధి కోసం చేపట్టే చర్యల్లో భాగంగా పన్నులు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే ఆస్తిపన్నును భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీల పరిధిలో ఇతర పన్నులూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు పన్నులు పెంచాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్ర అధికారులు నెలరోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ పంచాయతీల ఆదాయ వనరులపై అధ్యయనం చేస్తున్నారు. ప్ర స్తుతం గ్రామ పంచాయతీలకు ని ధులు సరిపోవడం లేదని, ప్రజ లకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలంటే పన్నులు పెంచాల్సిందేనని వారు గుర్తించినట్లు సమాచారం. 15 ఏళ్లుగా పన్నులు సవరించలేదని, గ్రామాల అభివృద్ధికోసం పన్నులు పెంచాల్సిందేనని వారు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని భావిస్తున్నారు. 50 శాతం పెరిగే అవకాశం పన్నుల పెంపు భారం మేజర్ పంచాయతీలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 1327 పంచాయతీలు ఉండగా ఇందులో 18 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులోనూ 10 వేలకు పైగా జనాభా కలిగిన మేజర్ పంచాయతీలు 15 ఉన్నాయి. 15 ఏళ్లలో పెరిగిన ఆస్తి విలువ ప్రకారం పన్నులను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 50 శాతం ఆస్తి పన్ను పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు పట్టణాలకు సమీపంలో ఉన్న పంచాయతీల్లో పన్నులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో హోర్డింగ్‌లపై పన్ను, వ్యాపార సంస్థలపై పన్ను, ఖాళీ స్థలాల వినియోగంపై పన్ను, వినోదపన్ను, సెల్‌టవర్‌పై పన్ను, మార్కెట్ వేలాల పన్నులు, లెసైన్స్ పన్నులు పెరగనున్నట్లు సమాచారం. నీటి పన్నులు కూడా పెంచుతారని తెలుస్తోంది. తాగునీటి పంపిణీకి అయ్యే నిర్వహణ ఖర్చును రాబట్టుకునే విధంగా మాత్రమే చార్జీలు పెంచనున్నట్లు సమాచారం. పన్నుల పెంపుపై ప్రజలకు నచ్చజెప్పే బాధ్యతను సర్పంచ్‌లకే అప్పగించనున్నారు. కాగా, గ్రామ పంచాయతీల్లో త్వరలో పన్నులు పెంచుతారని సమాచారం ఉందని, అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని జిల్లా పంచాయతీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.