మన్యంలో నకిలీ నోట్ల జోరు
- గంజాయి ముఠాల పనిగా అనుమానం
- బ్యాంకు అధికారులకే టోకరా
పాడేరు: మన్యంలో నకిలీ కరెన్సీ చెలామణి జోరుగా సాగుతోంది. నకిలీ 1000, 500 నోట్లు ఎక్కువగా మార్కెట్‌లో హల్‌చెల్ చేస్తున్నాయి. వీటిని గుర్తించడం అసాధ్యంగానే ఉంటోంది. అసలైన నోట్లు మాదిరిగానే ఉండటం వల్ల ఇవి సులువుగా మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. వీటి విషయంలో స్టేట్‌బ్యాంక్ అధికారులు సైతం టోకరా తిన్నారు. ఈ నెల 6న ఒక బ్యాంకు ఖాతాకు జమ కోసం పాడేరులో ఒక వ్యక్తి ఇచ్చిన రూ.31,500 నగదును నకిలీ నోట్లుగా బ్యాంకు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. 31 వెయ్యినోట్లు, ఒక 500 నోటు వీటిలో ఉన్నాయి. వీటిని బ్యాంకు అధికారులు పోలీసులకు అప్పగించారు.
ఈ నగదు జమ అయిన ఖాతాదారుడిని పోలీసులు విచారిస్తున్నారు. పాడేరు కేంద్రంగా సంచరిస్తున్న గంజాయి ముఠాలే వీటిని చెలామణి చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పెదబయలు, జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో వీటి జోరు ఎక్కువగా ఉంటోంది. పెద్ద ఎత్తున గంజాయి రవాణా చేస్తున్న వ్యాపారులు సులువుగా నకిలీ నోట్లను కూడా చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాల గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 1000, 500 న కిలీ నోట్ల విషయంలో ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.