న్యూఢిల్లీ: అప్పీళ్లను దాఖలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మితిమీరిన ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నందుకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు బాధ్యులైన అధికారుల నుంచి ఖర్చులు రాబడతామని హెచ్చరించింది. అప్పీళ్ల విషయంలో నిర్ణీత కాల పరిమితిని పట్టించుకోని ప్రభుత్వాధికారులకు సుప్రీం కోర్టు వేదిక కాదని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో అప్పీలు దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ అధికారులు 663 రోజుల సమయం తీసుకోవడంపై ఈ మేరకు స్పందించింది.
‘ఇలా ఆలస్యం చేసి, ఆ అప్పీల్‌ను కొట్టివేసే పరిస్థితిని తీసుకురావడం, తద్వారా ఈ అంశాన్ని ఇంతటితో మరుగున పడేయటమే ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘అంతిమంగా బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారు. దీనిపై గతంలో పలు పర్యాయాలు హెచ్చరించినా మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలి’ అని తెలిపింది. అప్పీళ్ల విషయంలో తీవ్ర ఆలస్యానికి కారణం కావడంతోపాటు, న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసే అధికారుల నుంచి అందుకు తగ్గ ఖర్చులను వసూలు చేయాలి’ అని తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.25 వేలను వసూలు చేయాలని ఆదేశించింది. లేకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ధిక్కార చర్యలు తప్పవని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment