YSR Digital Libraries | Work from Home to Work from Gram Panchayat
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇంకాస్త కొత్తగా.. పంచాయతీల నుంచే పని

Published Wed, Aug 4 2021 1:58 AM | Last Updated on Wed, Aug 4 2021 10:45 AM

CM Jagan high-level review on IT and digital libraries - Sakshi

సాక్షి, అమరావతి: వర్క్‌ ఫ్రమ్‌ హోం కాన్సెప్ట్‌ (ఇంటి నుంచే పనిచేసే విధానం) బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామాలకు మంచి సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసి హై స్పీడ్‌ క్వాలిటీ ఇంటర్నెట్‌ సౌకర్యంతో కంప్యూటర్లను సమకూర్చాలని స్పష్టం చేశారు. దీనివల్ల అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయంతో పాటు విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మొదటి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాన్ని చేపట్టి ఆగస్టు 15న భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఆలోగా స్థలాలను గుర్తించి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఐటీ, వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 
ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

విద్యార్థులకు మేలు జరిగేలా...
ప్రాథమిక, మాథ్యమిక విద్యతోపాటు డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులతోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు నిరంతర ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

మార్చి నాటికి డిజిటల్‌ లైబ్రరీలు
ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని, దీనివల్ల అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

హై క్వాలిటీ ఇంటర్నెట్‌..
డిజిటల్‌ లైబ్రరీల భవనాల్లో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, హై క్వాలిటీతో అన్‌ లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్, స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులో తేవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్‌టాప్‌ టేబుళ్లు, సిస్టం చెయిర్స్, విజిటర్‌ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్‌లు, ఐరన్‌ ర్యాక్స్, వార్తా పత్రికలు, మేగజైన్స్‌ డిజిటల్‌ లైబ్రరీల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్‌ ఉపకరణాల కోసం దాదాపు రూ.140 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 

హాజరైన మంత్రి మేకపాటి, ఉన్నతాధికారులు..
సమీక్షలో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ ఎం.నందకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల్లో సదుపాయాలిలా..
► మూడు డెస్క్‌టాప్‌లు
► యూపీఎస్‌
► డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్‌  
► స్కానర్‌  
► లేజర్‌ ప్రింటర్‌  
► సాఫ్ట్‌వేర్‌  
► యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌  
► హై క్వాలిటీతో అన్‌ లిమిలెడ్‌  బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ 
► స్టోరేజీ కోసం డేటా సెంటర్లు  
► టేబుళ్లు, కుర్చీలు తదితరాలతో మౌలిక వసతులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement