సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాజకీయ పార్టీలన్నీ మూగనోము పట్టాయి. గడిచిన నెల రోజులుగా జిల్లాలో ఏ పార్టీ పెద్దగా కార్యక్రమాలు జరిపింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైం దన్న ప్రకటన వెలువడ్డాక ఒకటీ రెండురోజులు కాంగ్రెస్ హడావిడి చేసినా.. ఇక, ఆ తర్వాత నుంచి ఏ పార్టీ కనీసం చిన్న కార్యక్రమమూ లేకుండా ప్రేక్షకపాత్రలో ఉండిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడోదశ ముగిసే సమయంలోనే తెలంగాణ ప్రకటన వెలువడింది. ఆ ఎన్నికల వరకూ ఎంతో హడావిడి చేసిన పార్టీలన్నీ ఒక్కసారిగా మౌనముద్ర దాల్చాయి.
తెలంగాణ సాధన కోసం పుష్కరకాలంగా పోరాటాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పూర్తిగా తన రాజకీయ కార్యక్రమాలను అటకెక్కించింది. ఇక, తమ అధినేత చంద్రబాబు తెలంగాణ విషయంలో మరోమారు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేయడంతో జిల్లాలో తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వివిధ కారణాలతో ఏ పార్టీ జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించక పోవడంతో రాజకీయ స్తబ్దత నెలకొంది. ఆయా పార్టీల నేతలు సైతం ఎలాంటి ఉత్సాహం చూపించడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం ఏదో ఒక కొలిక్కి వచ్చేదాకా వేచి చూడడం మినహా ఏం కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్‌ఎస్ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం ఆ పార్టీ నేతల గుండెల ను గుభేల్ మనిపిస్తోంది. గడిచిన పదమూడేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసుకుంటున్న నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. పార్టీని విలీనం చేసినా.. లేక కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు వెళ్లినా జిల్లాలో అవకాశం వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ.
మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. విలీనం, పొత్తు, ఈ రెండు పరిణామాలు చోటు చేసుకోకున్నా, ఎన్నికలకు ఒంటరిగా వెళ్లినా, తాము ఏ నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లాలని మదనపడుతున్న వారూ ఉన్నారు. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా టీఆర్‌ఎస్ ఎలాంటి కార్యక్రమాల జోలికీ వెళ్లడం లేదు. చివరకు జాయింట్ యాక్షన్ కమిటీ చేపడుతున్న కార్యక్రమాల్లోనూ పెద్దగా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ జిల్లాలో పూర్తిగా దుకాణం మూసినట్లే కనిపిస్తోంది. విపక్షపార్టీగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కనీసం ప్రకటనల రూపంలోనైనా స్పందించడం లేదు. ఇటీవల వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో కూడా టీడీపీ నుంచి కనీస స్పందన కరువైంది. గ్రూపు గొడవలతో కొట్టుకు చస్తున్న టీడీపీ తమ అధినేత ‘యూ’టర్న్‌తో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును తక్షణం ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌కు మద్దతు కూడా వీరి నుంచి కనిపించడం లేదు. జిల్లాలో ఏ నాయకుడూ చిన్న ప్రకటన కూడా విడుదల చేయడం లేదు. తమ అధినేతను వెనకేసుకురావడం మినహా మరో పాత్ర నిర్వహించడం లేదు. గడిచిన నాలుగేళ్లుగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ నేతల పాత్ర స్వల్పం గానే ఉంది.
తాజా పరిస్థితులతో జిల్లా తమ దుకాణం బందైనట్లేనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. అధికార కాంగ్రెస్‌లో తెలంగాణ సాధించామన్న భావన మొదట కొంత కనిపించినా, ఆ తర్వాత ఎందుకనో ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాలో తమ పార్టీ నేతలు రక రకాల ప్రకటనలు చేస్తుంటే నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడపదడపా ప్రకటనలు ఇస్తున్నారు.
ఆలేరు ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ఇంటింటా తెలంగాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పేర వివిధ శాఖల మంత్రులను పర్యటనలకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తెలంగాణవాదాన్ని వినిపించిన సీపీఐ, బీజేపీ సైతం మౌనంగానే ఉంటున్నాయి. ఇలా.. ఏ పార్టీలోనూ ఎలాంటి చిన్న కార్యక్రమమమూ లేకపోవడంతో జిల్లాలో రాజకీయ స్తబ్దత ఆవరించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యచరణను ప్రకటించిన నేపథ్యంలో.. ఆయా తెలంగాణవాద పార్టీలు జేఏసీతో చేతులు కలిపితే మళ్లీ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి.
రాజకీయ స్తబ్దత !
Published Sat, Aug 31 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement