Telangana state samithi party
-
ఫలించిన కాంగ్రెస్ నేతల రాయబారం
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించింది. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్...కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే నందీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కూడా కలిశారు. అయితే నందీశ్వర్ గౌడ్ పార్టీ వీడేందుకు సిద్ధం కావటంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు యత్నించారు. చివరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ నేత డీ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ...రంగంలోకి దిగి నందీశ్వర్ గౌడ్‌ను బుజ్జగించి టీఆర్ఎస్లోకి వెళ్లే ఆలోచనను విరమింపచేశారు. నేతల రాయబారం ఫలించటంతో నందీశ్వర్ హస్తాన్ని వీడే యోచన విరమించుకున్నారు. -
కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్
హైదరాబాద్: పటాన్చెరు కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్‌గౌడ్ శనివారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు నందీశ్వర్ గౌడ్ కేసీఆర్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్ లో చేరికపై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కాగా పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడు. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసి డీఎస్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డీఎస్ స్వయంగా ఫోన్ చేసినా రెండ్రోజుల నుంచి స్పందించడం లేదని సమాచారం. అయితే డీఎస్ సన్నిహితులు మాత్రం నందీశ్వర్‌గౌడ్‌కు తాత్కాలిక ఇబ్బందులున్నప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్‌ను వీడబోరనే చెబుతున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ.. వెల్కమ్
* ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా కాంగ్రెస్‌లో చేరవచ్చు: దిగ్విజయ్ * తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు మా పార్టీకే ఉంటాయి * ఒంటరిగా పోటీ చేసేందుకైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.. * టీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే పొత్తులపై పరిశీలిస్తాం * విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారు * 28లోగా తెలంగాణ, సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యేలు సహా ఆ పార్టీకి చెందిన నేతలెవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని, వారికి ఆహ్వానం పలుకుతామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. వారితో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేతలు, తాను కూడా అందుబాటులో ఉంటామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే ప్రజాదరణ ఉందని, అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పొత్తుల కోసం టీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే పరిశీలిస్తామని తెలిపారు. ‘‘తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని సోనియాకు హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారు. రాజకీయ పార్టీగా కొనసాగిస్తామన్నారు. పొత్తులపై కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ చైర్మన్ కేకేకు ఫోన్ చేసి చర్చలకు రమ్మన్నాం. వస్తామని ముందుగా చెప్పారు. ఆ తరువాత రావడంలేదని చెప్పారు. ఇప్పుడు పొత్తులపై మాట్లాడాలనుకుంటే టీఆర్ఎస్సే ప్రతిపాదనలతో ముందుకు రావాలి. పొత్తులు వద్దనుకుంటే అది వారిష్టం. టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనది. తెలంగాణ వచ్చాక రాజకీయ పార్టీగా కొనసాగాల్సిన అవసరంలేదు. కేసీఆర్‌తో చర్చించాకే తెలంగాణ బిల్లు రూపొందించాం. విలీనంపై టీఆర్ఎస్ మాట తప్పడం మోసపూరితమనను. కానీ అదో రాజకీయ ఎత్తుగడ’’ అని చెప్పారు. తొలి సీఎంగా అవకాశమివ్వాలని కేసీఆర్ అడిగారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ ప్రతిపాదన కేసీఆర్ నుంచి నేరుగా రాలేదని సమాధానమిచ్చారు. విస్తృత చర్చల తరువాతే తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చివరిగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు రాష్ట్రాలూ పరస్పర సమన్వయం, సహకారాలతో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగాములుగా నిలుస్తాయన్న నమ్మకం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన వారిని ఆదుకొనే అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దలేదని, అసెంబ్లీలో చర్చించి ఆమోదం పొందాకే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కానీ, కిరణ్ దాన్నే సాకుగా చూపి తమకు ఇచ్చిన మాటను తప్పి పార్టీ పెట్టడం విచారకరమన్నారు. తెలంగాణలో ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కోవడానికి, పార్టీ పటిష్టానికే పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంటును నియమించామని, మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కాదని చెప్పారు. ఇద్దరూ సమానులు, సమర్థులేనని అన్నారు. తెలంగాణ సీఎం దళితుడా కాదా అన్నది ఇప్పుడుచెప్పలేమన్నారు. ఎన్నికల్లో గెలిచాక సీఎల్పీ సభ్యులు సీఎంను ఎన్నుకుంటారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై నమ్మకం లేదా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, గెలుస్తామనే నమ్మకం కూడా మాకు ఉందని చెప్పారు. జానారెడ్డికి అసంతృప్తి లేదని, ఆయన ఇంటిలో విందు కూడా ఇచ్చారని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రలలో అభ్యర్థుల ఎంపికను ఈనెల 28లోగా పూర్తిచేస్తామని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, మరో 20 ఏళ్లు అక్కడ అధికారంలోకి రాలేమని జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘జైరాం ఆయన స్టయిల్లో అలా చెప్పారేమో! దానిపై వ్యాఖ్యానించలేను’’ అని అన్నారు. ‘‘సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు అనేక మంది సమర్థులు వస్తున్నారు. రఘువీరారెడ్డి సమర్ధుడైన సీనియర్ నేత. ఎన్నికల్లో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు’’ అని చెప్పారు. వామపక్షాలతో పొత్తులపై ప్రశ్నించగా.. అవి తమ మిత్రపక్షాలేనన్నారు. వంద కోట్లకు పైగా ఉన్న ప్రజల్లో ఒకటి రెండు వేల మంది అభిప్రాయాలు సేకరించే సర్వేలను పటి ్టంచుకోబోమని చెప్పారు. వైఎస్ జగన్‌ది కాంగ్రెస్ డీఎన్యేనని తెలిపారు. రాహుల్ గాంధీకి తాను గురువునో, మార్గదర్శినో కాదని, ఆయన సొంత ఆలోచనల ప్రకారమే నడుస్తున్నారని చెప్పారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ గురించి తమకు తెలియదంటూనే, ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దిగ్విజయ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. -
బలంలేని స్థానాలిస్తారా ?
కేసీఆర్ టికెట్ల ప్రతిపాదనలపై జేఏసీ నేతల అసంతృప్తి నేడు జేఏసీ ముఖ్యుల సమావేశం సాక్షి, హైదరాబాద్: గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా బలం లేని స్థానాలను చూపించి పోటీచేయమంటే ఎలా పోటీచేయగలమని తెలంగాణ జేఏసీ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఓట్లు తక్కువగా ఉన్న నియోజకవర్గాలను, టీఆర్ఎస్కు నిర్మాణం లేని స్థానాలను, కాంగ్రెస్ పెద్ద నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీచేయాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా జేఏసీ నేతలు అంటున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, కో కన్వీనర్ దేవీ ప్రసాద్, అధికార ప్రతినిధి సి.విఠల్ తదితరులు ప్రత్యక్ష ఎన్నికల్లో పొల్గొనబోమని ఇప్పటికే ప్రకటించారు. అయితే వీరి ప్రకటన వెనుక పోటీపై విముఖత కంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన స్థానాలే కారణమని తెలుస్తోంది. ఇప్పటిదాకా జేఏసీ నేతలకు ప్రతిపాదించిన స్థానాల్లో టీఆర్ఎస్కు బలం లేదని, ఓడిపోయే స్థానాల్లోనే పోటీచేయాలం టూ జేఏసీ నేతలను ఆహ్వానించారని ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నవారి కి అవకాశం ఇవ్వాలనే కేసీఆర్ యోచన మంచిదే అయినా ఓడిపోయే స్థానాలనే ప్రతిపాదించడంపట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జేఏసీ ముఖ్యనేత అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలే లేవు. వీటిలో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కోరారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఇప్పటికే ఒక ఇన్చార్జిని మార్చి అంతర్గత అసంతృప్తిని మూట గట్టుకుంది. మరోసారి కూడా ఇన్చార్జీని మారిస్తే మరింత నష్టం జరుగుతుంది. దానికితోడు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, విప్ జయప్రకాశ్‌రెడ్డికి ఆ నియోజకవర్గంలో బలమైన పట్టుంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీఎన్జీఓ అధ్యక్షులు దేవీ ప్రసాద్‌కు సూచించారు. దేవీ ప్రసాద్ మాత్రం మెదక్‌లో అవకాశం ఇస్తే పోటీచేస్తానని, లేకుంటే ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు. మహేశ్వరం, తాండూరు(అప్పటికి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరలేదు), సంగారెడ్డిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని జేఏసీ అధికార ప్రతినిధి విఠల్‌కు సూచిస్తే వెనుకంజ వేశారు. మరో అధికారప్రతినిధి కత్తి వెంకటస్వామి వరంగల్ తూర్పు లేదా పశ్చిమ నియోజకవర్గాల్లో అవకాశం ఇవ్వాలని కోరితే మలక్‌పేటలో పోటీచేయాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ముస్లింలు బలంగా ఉండే మలక్‌పేటలో మజ్లిస్ తప్ప మరో పార్టీ గెలిచే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్‌లో తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్‌ను పోటీచేయమంటున్నారు. ఆర్థికంగా, నిర్మాణపరంగా, రాజకీయంగా బలంగా ఉన్న రాజనర్సింహపై రసమయి గెలిచే అవకాశం ఉందా? తెలంగాణవాదం చాలా తక్కువగా ఉన్న రాజేందర్‌నగర్‌లో లేదా మహేశ్వరం నుంచి పోటీచేయాలని అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డికి ప్రతిపాదించారు. విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి సత్తుపల్లి లేదా వికారాబాద్ ఇచ్చినా ఫలితంలేదు. జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కేసీఆర్ ఇంకా ఎలాంటి ప్రతిపాదననూ చేయలేదు. నేడు జేఏసీ ముఖ్యుల సమావేశం ఈ నేపథ్యంలో జేఏసీ ముఖ్యుల సమావేశం శుక్రవారం జరగనుంది. అన్ని పార్టీలకు రాజకీయంగా సమాన దూరంలో ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే విధంగా వ్యవహరించాలని జేఏసీ అనుకుంటున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో అవసరమైన నిర్మాణాత్మక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే తెలంగాణ ప్రభుత్వానికి ఎజెండాను నిర్దేశించి, అమలుకోసం ఒత్తిడి తెచ్చే ప్రజా ఉద్యమ సంఘంగా జేఏసీని కొనసాగించాలని భావిస్తున్నారు. -
కాంగ్రెస్.. టీఆర్ఎస్.. మధ్యలో జేఏసీ!
టీ-జేఏసీ నేతల కోసం రెండు పార్టీల మధ్య పోటీ టికెట్లిస్తామంటూ ఆఫర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ - ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య.. ఇప్పుడు తెలంగాణ క్రెడిట్ కోసమే కాదు.. తెలంగాణ జేఏసీ నేతల కోసమూ పోటీ మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ ఆశించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో.. తెలంగాణ కోసం ఉద్యమం నడిపిన టీ-జేఏసీ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు అంతర్గతంగా రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు జేఏసీ నేతలతో పాటు ఒకరిద్దరు అమరవీరుల కుటుంబాలకు టికెట్లు కేటాయించడం ద్వారా టీఆర్ఎస్ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం పనిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి అనుగుణంగానే కేంద్రమంత్రి జైరాంరమేష్ ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తూ అధిష్టానం ప్రణాళికను అమలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పడు జేఏసీ నేతలను పిలిపించుకుని ఎన్నికల్లో పోటీచేయటానికి ఆసక్తి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వటానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఈ నెల 19న హైదరాబాద్‌లో కలుస్తానని కూడా జైరాం ప్రకటించారు. 18న మరోసారి తెలంగాణ జేఏసీ నేతలతో భేటీ కానున్నట్లు తాజాగా వెల్లడించారు. కాంగ్రెస్ తమను విమర్శించటమే కాకుండా జేఏసీ నేతలకు, అమరవీరుల కుటుంబ సభ్యులకు దగ్గర కావటానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం టీఆర్ఎస్కు మింగుడుపడటం లేదు. దీంతో.. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు జేఏసీని, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎదురు దాడి మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ఏర్పాటు తరువాత మొదటిసారి మంగళవారం తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ వ్యూహానికి ప్రతిగా అన్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జేఏసీలో కీలకంగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్‌ను మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా శ్రీనివాస్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన ఎం.డి.ఇబ్రహీంకు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశమిస్తామని టీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. -
సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా
* తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం * ఇండియూ టుడే/సీఓటర్ సర్వే స్పష్టీకరణ * సీమాంధ్రలో వై ఎస్సార్సీపీకి 18 ఎంపీ సీట్లు * తెలంగాణలో 14 సీట్లు టీఆర్ఎస్వే.. న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు కంచు కోట అనేది ఇక చరిత్రకే పరిమితం కానుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నారుు..’ అని ఇండియూ టు డే గ్రూపు/ సీఓటర్ తాజా సర్వే తేల్చింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోగతంపై ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలు వెనుకబడిపోయి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో మాదిరి ప్రాంతీయ పార్టీలు ముందంజలో నిలువనున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుంది. 25 లోక్‌సభా స్థానాలకు గాను ఆ పార్టీ 18 చోట్ల విజయదుందుభి మోగించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో అధికశాతం మంది ఇప్పటికీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే తమకు ఇష్టమైన ముఖ్యమంత్రి అని చెప్పడం. వైఎస్ జీవించి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని క్షేత్రస్థారుులో ప్రజలు భావిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చు. సీమాంధ్రలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఎక్కువ ప్రజాదరణ ఉండటం మరింత ఆసక్తి కలిగించే అంశం. ఇక తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేకుండానే 17 సీట్లకు గాను 14 సీట్లలో విజయం సాధించనుంది. -
సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా
-
ఇక విలీనమే తరువాయి..
నేడో, రేపో సోనియాతో భేటీ... ఆ తర్వాత ప్రకటన నేడు విస్తృతస్థాయి పొలిట్‌బ్యూరో ఢిల్లీలోనే ఉండాలని టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశం పార్టీలో చేరికలకు ప్రోత్సాహంతో అనుమానాలు న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేకప్రతినిధి: పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీన ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత విలీనంపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటిదాకా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ గురువారం రాత్రి ప్రకటించారు. 2, 3 రోజులు ఢిల్లీలోనే ఉంటానని, సోనియాగాంధీని కలసిన తర్వాత రాజకీయ నిర్ణయాలపై చెబుతానని ఆయన వెల్లడించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. పార్టీ రాజకీయ భవితవ్యంపై ఈ సమావేశంలోనే చర్చించనున్నారు. అనంతరం సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో సోనియాగాంధీతో సమావేశం అయిన తర్వాత విలీనంపై స్పష్టమైన ప్రకటన చేయాలనేది కేసీఆర్ యోచనగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఒకవేళ విలీనంపై నిర్ణయం తీసుకుంటే లాంఛనంగా ఢిల్లీలోనే ఆ విషయాన్ని ప్రకటించనున్నారు. అనంతరమే తెలంగాణలోనే భారీ సభను ఏర్పాటుచేసి విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని అనుకుంటున్నట్టుగా టీఆర్ఎస్ ముఖ్యులు వెల్లడించారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, విలీనంపై ఇప్పుడే ఎందుకు తొందరపడాలనే ఆలోచన కూడా లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. చేరికలతో అనుమానం..? టీడీపీకి చెందిన ఎమ్మెల్యే జి.నగేశ్ టీఆర్ఎస్లో చేరడానికి కేసీఆర్ అంగీకారం తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా అవకాశం ఉంటుందనే హామీతో నగేశ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్సే విలీనం కావడానికి సిద్దమవుతున్న ఈ తరుణంలో చేరికలను ప్రోత్సహించడంపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని లక్ష్యంగా చేసుకోవాలనే వ్యూహమా? కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ఏదో ఒక సాకుతో తప్పించుకోవాలనే యోచన కేసీఆర్‌కు ఉందా అని వారు అనుమానపడుతున్నారు. 24 గంటల్లో విలీన ప్రకటన: ఏఐసీసీ వర్గాలు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ పార్టీ విలీనంపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. రాజ్యసభలో ఆమోదం పొందిన 24 గంటల్లోపు కేసీఆర్ స్వచ్ఛందంగా విలీన ప్రకటన చేస్తామని హైకమాండ్ పెద్దలకు హామీ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో టీఆర్ఎస్ విలీన ప్రకటన చేసిన అనంతరం తెలంగాణలో కనీవినీ ఎరగని రీతిలో లక్షలాది మందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియాగాంధీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలందరినీ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం సోనియాగాంధీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు వెల్లడించారు. -
విజయశాంతివి అసత్య ఆరోపణలు: కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలు తన చావును కోరుకున్నారని ఆ పార్టీ మాజీ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే కేటీఆర్ ఖండించారు. విజయశాంతి ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సరైన గుర్తింపు లేకపోవటంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము వసూళ్లకు పాల్పడితే... అందుకు ఆధారాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ నేతలు కుట్రపన్నారని, అడుగడుగునా ఆంక్షలు విధించారని, ఆ పార్టీ నేతలు తన చావును కోరుకున్నారంటూ విజయశాంతి నిన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. -
నా చావు కోరుకున్నారు: విజయశాంతి
మెదక్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) మాజీ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ నేతలు కుట్రపన్నారని, అడుగడుగునా ఆంక్షలు విధించారని, ఆ పార్టీ నేతలు తన చావును కోరుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తాను వాటిని ప్రజాబలంతో జయించానని ఉద్ఘాటించారు. తానెన్నడూ కుటుంబ సభ్యుల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయలేదంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. మెదక్ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం జరిగిన అక్కన్నపేట-మెదక్ రైల్వేలైను శంకుస్థాపన కార్యక్రమానికి విజయశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే.. - టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసి నన్ను ఒంటరిని చేశారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అభివృద్ధికి అడ్డుపడ్డారు. ఆ పార్టీ నేతలు నా చావును కోరుకున్నారు. అడుగడుగునా ఎన్నో కుట్రలు పన్నారు. - వెన్నుపోటు పొడవాలనుకున్నారు. నా నియోజకవర్గానికి వెళ్తానంటే వద్దన్నారు. ఎవరు సహకరించక పోయినా నియోజకవర్గంలో తిరగబట్టే ప్రజా సమస్యలు తెలిశాయి. ఒకవేళ నేను నియోజకవర్గంలో తిరగకపోయి ఉంటే ఈ రోజు మెదక్ రైల్వేలైన్ వచ్చేదా? - ఈ క్రెడిట్ నాకు దక్కుతుందన్న అక్కసుతోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని సైతం అడ్డుకునేందుకు కుట్రలు చేశారు. - ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్నికుట్రలు పన్నినా ఓపికతో మిన్నకుండిపోయా. ప్రజాబలమే శ్రీరామరక్షగా అందరి ఎత్తుల్నీ చిత్తుచేశాను. ప్రజలకోసం, వారి సంక్షేమం కోసం ప్రాణాలైనా పణంగా పెడతా. - నాకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కొన్ని పత్రికల్లో నాపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దయచేసి వాస్తవాలు గ్రహించి రాయాలని, ఎవరో చెప్పిన మాటలు వినవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. - నా జీవితంలో ఏ నేతకీ తలవంచను. కావాల్సినంత సంపాదించాకే రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నికలు ఏవైపునకు దారితీస్తాయో.. ఏ క్షణాన ఏం జరుగుతుందో(తన రాజకీయ భవిష్యత్తుపై పరోక్ష వ్యాఖ్యలు) - నా రాజకీయ జీవితంలో పాపాలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు. నాకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు లేవు. కుటుంబ సభ్యుల కోసం రాజకీయాలు చేయటం లేదు. (టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు) -
గడువు పెంచినా ఇబ్బంది లేదు: కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచినా తెలంగాణ ఆవిర్భావానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తదితరులతో శుక్రవారం కేసీఆర్ తన నివాసంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. ‘శాసనసభ అభిప్రాయం కోసం మరో వారం, పదిరోజులు రాష్ట్రపతి గడువును పెంచుతారని ప్రచారం జరుగుతోంది. వందశాతం పెంచకపోవచ్చు. ఒకవేళ పెంచినా ఫరాక్ (తేడా, ప్రభావం) పడదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పెన్షనర్ల స్థానికతను బట్టి విభజన ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి రిటైరైతే తెలంగాణ రాష్ట్రం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగి రిటైరైతే ఆ రాష్ట్రం పెన్షన్‌ను భరించాలి. తెలంగాణ ప్రాంత ఉద్యోగ అవకాశాలను ఆంధ్రా వారు కొల్లగొట్టారనే అంశంపై మనం కొట్లాడుతున్నప్పుడు మళ్లీ పెన్షన్లను ఎలా భరిస్తాం, దీనిపై పోరాటం చేయాల్సిందే’ అని కేసీఆర్ అన్నారు. గవర్నర్ చేతికి శాంతి భద్రతలు, పదేళ్ల ఉమ్మడి రాజధాని వంటి ఇతర అంశాలతో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి వచ్చే అవరోధం ఏమీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి మొదటివారంలో ప్రధానమంత్రిని కలిసి వివిధ అంశాలపై సవరణల కోసం వినతి పత్రం ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.సుదర్శన్‌రెడ్డితో కేసీఆర్, కేకే శుక్రవారం సమావేశమయ్యారు. ప్రధానికి అందించాల్సిన వినతిపత్రంపై మూడు గంటల పాటు చర్చించి ముసాయిదా ప్రతిని రూపొందించినట్టు సమాచారం. -
ఆంక్షలుంటే మరో యుద్ధానికి సన్నద్ధం
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏకైక ఏజెండాతో పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఉద్యమం పేరిట మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 13 ఏళ్ల టీఆర్ఎస్ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు తదితర పరిస్థితులను అనుకూలంగా మలచుకుని 2014 ఎన్నికల నాటికి సంస్థాగతంగా పూర్తి బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రం ఏర్పాటుచేస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించడం... కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో విలీనంపై అయోమయం ఏర్పడింది. ఎలాంటి ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటిస్తేనే విలీనం విషయం ఆలోచిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఈలోపు కార్యకర్తల అభిప్రాయాలు సేకరించింది. ఇటీవల నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో మెజారిటీ కార్యకర్తలు విలీనంపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దంటూ కుండబద్దలు కొట్టారు. శిబిరాల్లో పాల్గొన్న నేతలు సైతం విలీనమయ్యే ప్రసక్తే లేదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందంటూ స్పష్టంచేయడంతోపాటు సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించారు. తెలంగాణ తామే తెచ్చామని జైత్రయాత్రల పేరిట కాంగ్రెస్ సభలు నిర్వహిస్తుండడం... టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లకపోవడంతో పరిస్థితి చేజారకుండా ఉండేందుకు వ్యూహాలు రూపొందించారు. తెలంగాణ కోసం 2009లో కేసీఆర్ దీక్షకు బయలుదేరిన నవంబర్ 29ని కీలకదినంగా భావిస్తూ జిల్లా వ్యాప్తంగా దీక్షాదివస్ పేరిట వేలాదిమందితో దీక్షలకు దిగడమే కాకుండా కేసీఆర్‌ను అరెస్టు చేసిన నాటి ఫొటోలు, ఫ్లెక్సీలను ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయూలని, 13 ఏళ్లుగా టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో నియోజకవర్గ ఇన్చార్జీలు, మండల, పట్టణ, నగర పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, శంకర్‌రెడ్డి తదితరులు ప్రసంగిస్తూ టీఆర్ఎస్ జోష్ పెంచుతూ... ఇతర పార్టీల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాయమాటలతో లబ్ధిపొందుతున్న ఆంధ్రా పార్టీలకు గుణపాఠం చెప్పే రీతిలో పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఎట్టి పరిస్థితుల్లో విలీనమయ్యే ప్రసక్తే లేదని, హైదరాబాద్‌పై ఏ చిన్న ఆంక్ష విధించినా మరో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించే దీక్షా దివస్‌ను జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేసే దిశగా కార్యకర్తలు కృషిచేయాలని చెప్పారు. -
రాజకీయ స్తబ్దత !
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాజకీయ పార్టీలన్నీ మూగనోము పట్టాయి. గడిచిన నెల రోజులుగా జిల్లాలో ఏ పార్టీ పెద్దగా కార్యక్రమాలు జరిపింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైం దన్న ప్రకటన వెలువడ్డాక ఒకటీ రెండురోజులు కాంగ్రెస్ హడావిడి చేసినా.. ఇక, ఆ తర్వాత నుంచి ఏ పార్టీ కనీసం చిన్న కార్యక్రమమూ లేకుండా ప్రేక్షకపాత్రలో ఉండిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడోదశ ముగిసే సమయంలోనే తెలంగాణ ప్రకటన వెలువడింది. ఆ ఎన్నికల వరకూ ఎంతో హడావిడి చేసిన పార్టీలన్నీ ఒక్కసారిగా మౌనముద్ర దాల్చాయి. తెలంగాణ సాధన కోసం పుష్కరకాలంగా పోరాటాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పూర్తిగా తన రాజకీయ కార్యక్రమాలను అటకెక్కించింది. ఇక, తమ అధినేత చంద్రబాబు తెలంగాణ విషయంలో మరోమారు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేయడంతో జిల్లాలో తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వివిధ కారణాలతో ఏ పార్టీ జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించక పోవడంతో రాజకీయ స్తబ్దత నెలకొంది. ఆయా పార్టీల నేతలు సైతం ఎలాంటి ఉత్సాహం చూపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం ఏదో ఒక కొలిక్కి వచ్చేదాకా వేచి చూడడం మినహా ఏం కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం ఆ పార్టీ నేతల గుండెల ను గుభేల్ మనిపిస్తోంది. గడిచిన పదమూడేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసుకుంటున్న నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. పార్టీని విలీనం చేసినా.. లేక కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు వెళ్లినా జిల్లాలో అవకాశం వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. విలీనం, పొత్తు, ఈ రెండు పరిణామాలు చోటు చేసుకోకున్నా, ఎన్నికలకు ఒంటరిగా వెళ్లినా, తాము ఏ నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లాలని మదనపడుతున్న వారూ ఉన్నారు. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాల జోలికీ వెళ్లడం లేదు. చివరకు జాయింట్ యాక్షన్ కమిటీ చేపడుతున్న కార్యక్రమాల్లోనూ పెద్దగా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ జిల్లాలో పూర్తిగా దుకాణం మూసినట్లే కనిపిస్తోంది. విపక్షపార్టీగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కనీసం ప్రకటనల రూపంలోనైనా స్పందించడం లేదు. ఇటీవల వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో కూడా టీడీపీ నుంచి కనీస స్పందన కరువైంది. గ్రూపు గొడవలతో కొట్టుకు చస్తున్న టీడీపీ తమ అధినేత ‘యూ’టర్న్‌తో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును తక్షణం ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌కు మద్దతు కూడా వీరి నుంచి కనిపించడం లేదు. జిల్లాలో ఏ నాయకుడూ చిన్న ప్రకటన కూడా విడుదల చేయడం లేదు. తమ అధినేతను వెనకేసుకురావడం మినహా మరో పాత్ర నిర్వహించడం లేదు. గడిచిన నాలుగేళ్లుగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ నేతల పాత్ర స్వల్పం గానే ఉంది. తాజా పరిస్థితులతో జిల్లా తమ దుకాణం బందైనట్లేనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. అధికార కాంగ్రెస్‌లో తెలంగాణ సాధించామన్న భావన మొదట కొంత కనిపించినా, ఆ తర్వాత ఎందుకనో ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాలో తమ పార్టీ నేతలు రక రకాల ప్రకటనలు చేస్తుంటే నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడపదడపా ప్రకటనలు ఇస్తున్నారు. ఆలేరు ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ఇంటింటా తెలంగాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పేర వివిధ శాఖల మంత్రులను పర్యటనలకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తెలంగాణవాదాన్ని వినిపించిన సీపీఐ, బీజేపీ సైతం మౌనంగానే ఉంటున్నాయి. ఇలా.. ఏ పార్టీలోనూ ఎలాంటి చిన్న కార్యక్రమమమూ లేకపోవడంతో జిల్లాలో రాజకీయ స్తబ్దత ఆవరించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యచరణను ప్రకటించిన నేపథ్యంలో.. ఆయా తెలంగాణవాద పార్టీలు జేఏసీతో చేతులు కలిపితే మళ్లీ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి.