
నా చావు కోరుకున్నారు: విజయశాంతి
మెదక్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) మాజీ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్‌ఎస్ నేతలు కుట్రపన్నారని, అడుగడుగునా ఆంక్షలు విధించారని, ఆ పార్టీ నేతలు తన చావును కోరుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తాను వాటిని ప్రజాబలంతో జయించానని ఉద్ఘాటించారు. తానెన్నడూ కుటుంబ సభ్యుల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయలేదంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. మెదక్ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం జరిగిన అక్కన్నపేట-మెదక్ రైల్వేలైను శంకుస్థాపన కార్యక్రమానికి విజయశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.
విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే..
- టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసి నన్ను ఒంటరిని చేశారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అభివృద్ధికి అడ్డుపడ్డారు. ఆ పార్టీ నేతలు నా చావును కోరుకున్నారు. అడుగడుగునా ఎన్నో కుట్రలు పన్నారు.
- వెన్నుపోటు పొడవాలనుకున్నారు. నా నియోజకవర్గానికి వెళ్తానంటే వద్దన్నారు. ఎవరు సహకరించక పోయినా నియోజకవర్గంలో తిరగబట్టే ప్రజా సమస్యలు తెలిశాయి. ఒకవేళ నేను నియోజకవర్గంలో తిరగకపోయి ఉంటే ఈ రోజు మెదక్ రైల్వేలైన్ వచ్చేదా?
- ఈ క్రెడిట్ నాకు దక్కుతుందన్న అక్కసుతోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని సైతం అడ్డుకునేందుకు కుట్రలు చేశారు.
- ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్నికుట్రలు పన్నినా ఓపికతో మిన్నకుండిపోయా. ప్రజాబలమే శ్రీరామరక్షగా అందరి ఎత్తుల్నీ చిత్తుచేశాను. ప్రజలకోసం, వారి సంక్షేమం కోసం ప్రాణాలైనా పణంగా పెడతా.
- నాకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కొన్ని పత్రికల్లో నాపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దయచేసి వాస్తవాలు గ్రహించి రాయాలని, ఎవరో చెప్పిన మాటలు వినవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.
- నా జీవితంలో ఏ నేతకీ తలవంచను. కావాల్సినంత సంపాదించాకే రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నికలు ఏవైపునకు దారితీస్తాయో.. ఏ క్షణాన ఏం జరుగుతుందో(తన రాజకీయ భవిష్యత్తుపై పరోక్ష వ్యాఖ్యలు)
- నా రాజకీయ జీవితంలో పాపాలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు. నాకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు లేవు. కుటుంబ సభ్యుల కోసం రాజకీయాలు చేయటం లేదు. (టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు)