నేడో, రేపో సోనియాతో భేటీ...
ఆ తర్వాత ప్రకటన
నేడు విస్తృతస్థాయి పొలిట్‌బ్యూరో
ఢిల్లీలోనే ఉండాలని టీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశం
పార్టీలో చేరికలకు ప్రోత్సాహంతో అనుమానాలు
న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేకప్రతినిధి: పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీన ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత విలీనంపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటిదాకా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ గురువారం రాత్రి ప్రకటించారు. 2, 3 రోజులు ఢిల్లీలోనే ఉంటానని, సోనియాగాంధీని కలసిన తర్వాత రాజకీయ నిర్ణయాలపై చెబుతానని ఆయన వెల్లడించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు.
పార్టీ రాజకీయ భవితవ్యంపై ఈ సమావేశంలోనే చర్చించనున్నారు. అనంతరం సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో సోనియాగాంధీతో సమావేశం అయిన తర్వాత విలీనంపై స్పష్టమైన ప్రకటన చేయాలనేది కేసీఆర్ యోచనగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఒకవేళ విలీనంపై నిర్ణయం తీసుకుంటే లాంఛనంగా ఢిల్లీలోనే ఆ విషయాన్ని ప్రకటించనున్నారు. అనంతరమే తెలంగాణలోనే భారీ సభను ఏర్పాటుచేసి విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని అనుకుంటున్నట్టుగా టీఆర్‌ఎస్ ముఖ్యులు వెల్లడించారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, విలీనంపై ఇప్పుడే ఎందుకు తొందరపడాలనే ఆలోచన కూడా లేకపోలేదని కొందరు భావిస్తున్నారు.
చేరికలతో అనుమానం..?
టీడీపీకి చెందిన ఎమ్మెల్యే జి.నగేశ్ టీఆర్‌ఎస్‌లో చేరడానికి కేసీఆర్ అంగీకారం తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా అవకాశం ఉంటుందనే హామీతో నగేశ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. అయితే టీఆర్‌ఎస్సే విలీనం కావడానికి సిద్దమవుతున్న ఈ తరుణంలో చేరికలను ప్రోత్సహించడంపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని లక్ష్యంగా చేసుకోవాలనే వ్యూహమా? కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ఏదో ఒక సాకుతో తప్పించుకోవాలనే యోచన కేసీఆర్‌కు ఉందా అని వారు అనుమానపడుతున్నారు.
24 గంటల్లో విలీన ప్రకటన: ఏఐసీసీ వర్గాలు
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విలీనంపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. రాజ్యసభలో ఆమోదం పొందిన 24 గంటల్లోపు కేసీఆర్ స్వచ్ఛందంగా విలీన ప్రకటన చేస్తామని హైకమాండ్ పెద్దలకు హామీ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ విలీన ప్రకటన చేసిన అనంతరం తెలంగాణలో కనీవినీ ఎరగని రీతిలో లక్షలాది మందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియాగాంధీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నేతలందరినీ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు వెల్లడించారు.
ఇక విలీనమే తరువాయి..
Published Fri, Feb 21 2014 3:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement